పాక్షిక కర్ఫ్యూకు సన్నాహాలు

ABN , First Publish Date - 2021-05-04T05:00:12+05:30 IST

ఈ నెల ఐదో తేదీ నుంచి పగటి సమయంలో కూడా కర్ఫ్యూ అమలుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో...అందుకు తగిన ఏర్పాట్లలో జిల్లా యంత్రాంగం నిమగ్నమైంది.

పాక్షిక కర్ఫ్యూకు సన్నాహాలు

అత్యవసర సర్వీసులకు మినహాయింపు

ఉద్యోగులకు పాస్‌లు 


విశాఖపట్నం, మే 3 (ఆంధ్రజ్యోతి): ఈ నెల ఐదో తేదీ నుంచి పగటి సమయంలో కూడా కర్ఫ్యూ అమలుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో...అందుకు తగిన ఏర్పాట్లలో జిల్లా యంత్రాంగం నిమగ్నమైంది. అయితే సోమవారం రాత్రికి అధికారికంగా ఎటువంటి ఉత్తర్వులు జిల్లాకు చేరలేదు. కర్ఫ్యూ ప్రకటిస్తే జిల్లాలో అత్యవసర విధులు నిర్వహించే ఉద్యోగులకు పాస్‌లు ఇచ్చే అవకాశం వున్నదని అధికారులు చెబుతున్నారు. ఎంతమందికి పాస్‌లు ఇవ్వాలన్న దానిపై కసరత్తు ప్రారంభించారు. గత ఏడాది లాక్‌డౌన్‌ విధించిన సమయంలో ప్రభుత్వ, ప్రైవేటు రంగంలో అనేక మంది అధికారులకు, ఉద్యోగులకు పాస్‌లు జారీచేసిన విషయం తెలిసిందే. అదే మాదిరిగానే ఈ ఏడాది కూడా పాస్‌లు జారీచేయనున్నారు. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు, ఫార్మా కంపెనీలు, రాష్ట్ర ప్రభుత్వం సంస్థలు, ప్రైవేటు కంపెనీలు, ప్రింట్‌ అండ్‌ ఎలకా్ట్రనిక్‌ మీడియాతో పాటు నిత్యావసర సరకులు పంపిణీ చేసే వారికి పాస్‌లు జారీచేయనున్నట్టు అధికారులు చెబుతున్నారు. అయితే దీనిపై ప్రభుత్వం నుంచి వచ్చిన ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటారు. కాగా లాక్‌డౌన్‌కు సంబంధించి సోమవారం రాత్రి వరకు ఎటువంటి ఆదేశాలు రాలేదని కలెక్టర్‌ వినయ్‌చంద్‌ తెలిపారు. మార్గదర్శకాలు వచ్చిన వెంటనే అమలు చేస్తామన్నారు. దీనికి సంబంధించి అన్ని విషయాలను ప్రజలకు తెలియజేస్తామన్నారు. 


Updated Date - 2021-05-04T05:00:12+05:30 IST