ఆలయాలు తెరిచేందుకు సన్నాహాలు

ABN , First Publish Date - 2020-06-07T08:11:10+05:30 IST

ప్రభుత్వం లాక్‌డౌన్‌ సడలింపులు ఇవ్వడంతో ఆలయాలు తెరిచేందుకు దేవాదాయ శాఖ సిద్ధమవుతోంది.

ఆలయాలు తెరిచేందుకు సన్నాహాలు

మేనేజర్లు, ఈవోలతో దేవాదాయ శాఖ సహాయ కమిషనర్‌ సమావేశం


వన్‌టౌన్‌, జూన్‌ 6:

ప్రభుత్వం లాక్‌డౌన్‌ సడలింపులు ఇవ్వడంతో ఆలయాలు తెరిచేందుకు దేవాదాయ శాఖ సిద్ధమవుతోంది. ఆలయాలు 8వ తేదీ నుంచి తెరిచేందుకు ప్రభుత్వం అనుమతించినప్పటికీ భక్తుల దర్శనాలు 10వ తేదీ నుంచి కల్పించాలని దేవాదాయ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. యథావిధిగా 8వ తేదీన ఆలయాలు తెరుచకుని 10వ తేదీ నుంచి భక్తుల దర్శనానికి ఏర్పాట్లు చేయనున్నారు. భక్తులు సామాజిక దూరం పాటించేలా క్యూలైన్లు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆలయాలకు వచ్చే భక్తులు కాళ్లు కడుక్కుని శానిటైజర్‌ను చేతులకు రాసుకుని మాస్క్‌లతో ఆలయంలోకి రావాల్సి ఉంటుంది. ఆలయాలకు వచ్చే భక్తులకు శానిటైజర్‌ను, నీళ్లను దేవస్థానాలు అందిస్తాయి. తీర్థప్రసాదాలు ఉండవు. స్వామి, అమ్మవార్ల దర్శనం చేసుకుని భయటకు వెళ్ళిపోవల్సి ఉంటుంది.


రెడ్‌జోన్లు, కంటెయిన్‌మెంట్‌ జోన్లలో ఆలయాలు తెరవడానికి అనుమతులు లేనట్టు దేవాదాయ శాఖ వర్గాలు తెలిపాయి. మరోవైపు జిల్లాలోని 6బీ, 6సీ ఆలయాల్లో ఏర్పాట్లపై దేవాదాయ శాఖ సహాయ కమిషనర్‌ శాంతి శనివారం ఈవో, మేనేజర్లతో సమావేశమై ఆలయాల వద్ద తీసుకోవాల్సిన జాగ్రత్తలు సూచించారు. ఆలయ ధ్వజస్తంభం, ఇతర దేవతా విగ్రహాలను భక్తులు తాకకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. భక్తులు మాస్క్‌లు ధరించడం, సామాజిక దూరం పాటించడం, శానిటైజర్‌తో చేతులు శుభ్రం చేసుకోవడం వంటి అంశాలపై చర్చించి సూచనలు జారీ చేశారు.  

Updated Date - 2020-06-07T08:11:10+05:30 IST