Abn logo
Sep 22 2021 @ 00:47AM

ధాన్యం కొనుగోళ్లకు సన్నాహాలు

జిల్లాలో వరి ధాన్యం కొనుగోళ్లు (ఫైల్‌)

- జిల్లాలో పెరిగిన వానాకాలం సాగు 

-  2.48 లక్షల ఎకరాల్లో పంటలు  

-   1.73 లక్షల ఎకరాల్లో వరి

- కొనుగోలు లక్ష్యం 3.50 లక్షల మెట్రిక్‌ టన్నులు 

- 236 కేంద్రాల ఏర్పాటుకు ప్రణాళిక 

- యాసంగిలో దొడ్డురకంపై ఆంక్షలు 

- ప్రత్యామ్నాయ పంటలపై వ్యవసాయ శాఖ ప్రచారం

 (ఆంధ్రజ్యోతి సిరిసిల్ల)

భూగర్భజలాలు సమృద్ధిగా ఉండడం, కాళేశ్వరం జలాలతో ప్రాజెక్ట్‌లు, చెరువులు జలకళను సంతరిం చుకోవడం వంటి పరిణామాలతో జిల్లాలో వానాకాలం వరి సాగు విస్తీర్ణం పెరిగింది. ఇటీవల కురిసిన కురిసిన వర్షాలు కూడా రైతుల్లో అనందం నింపాయి.  అయితే కేంద్రం దొడ్డురకం ధాన్యం కొనుగోలు చేయబోమని చెప్పడంతో తొలుత ఆందోళనకు గురయ్యారు. అనంతరం  ఈసారికి కొనుగోలు చేస్తామని ప్రకటించడంతో ఊరట చెందారు. ఇందుకు అనుగుణంగా వానాకాలం ధాన్యం కొనుగోలుకు పౌరసరఫరాల శాఖ ద్వారా యాక్షన్‌ ప్లాన్‌ను రూపొందించారు. నవంబరు మొదటి వారం నుంచి కొనుగోలు కేంద్రాలు ప్రారంభించే దిశగా సన్నాహాలు చేస్తున్నారు.  యాసంగిలో మాత్రం దొడ్డురకం ధాన్యం కొనుగోలు ఉండదని, సాగు చేయవద్దని ప్రభుత్వం కరాఖండిగా చెబుతోంది. యాసంగిలో ప్రత్యామ్నాయ పంటలు వేయడానికి రైతులకు అవగాహన కల్పించే దిశగా ఈ నెల 30వ తేదీ వరకు ప్రచారం, సదస్సులు నిర్వహణ ప్రణాళికలు సిద్ధం చేశారు. వ్యవసాయ క్లస్టర్ల వారీగా దొడ్డురకం వరి సాగుకు బదులు ఆయిల్‌పాం, వేరుశనగ, పొద్దు తిరుగుడు, మొక్కజొన్న, శనగలు, జొన్నలు, ఉద్యాన పంటలు, కూరగాయలు, సన్నరకం ధాన్యం పండించే దిశగా రైతువేదికల్లో సదస్సులు నిర్వహించనున్నారు. 


దిగుబడి అంచనా 3.78 లక్షల మెట్రిక్‌ టన్నులు 

రాజన్న సిరిసిల్ల జిల్లాలో వానాకాలం 2.48 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగు చేశారు. ఇందులో అత్యధికంగా వరి 1.73 లక్షల ఎకరాలు, పత్తి 62,959 ఎకరాల్లో వేశారు. మొక్కజొన్న 2,501, కందులు 4,975, ఇతర పంటలు 613, ఉద్యాన పంటలు 4,422 ఎకరాల్లో సాగు చేశారు. వరి సాగు ద్వారా జిల్లాలో 3 లక్షల 78 వేల 696 మెట్రిక్‌ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అంచనా వేశారు. ఇందులో 28,696 మెట్రిక్‌ టన్నుల ధాన్యం జిల్లాలోని మిల్లర్లు కొనుగోలు చేస్తే మిగిలిన 3.50 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం పౌరసరఫరాల శాఖ ద్వారా కొనుగోలు చేయడానికి యాక్షన్‌ ప్లాన్‌ రూపొందించారు. నవంబరులో 85 వేల మెట్రిక్‌ టన్నులు, డిసెంబరు 2021లో 1,91,304 మెట్రిక్‌ టన్నులు, జనవరిలో 73,696 మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు చేయాలనే లక్ష్యంగా పెట్టుకున్నారు. 2019-20లో వానాకాలం 36,584 మంది రైతుల నుంచి  రూ.332.12 కోట్ల విలువైన  1,80,995 మెట్రిక్‌ టన్నులు సేకరించారు. రబీలో 50,574 మంది రైతుల నుంచి రూ.450.22 కోట్ల విలువైన ధాన్యం 2,45,371 మెట్రిక్‌ టన్నులు కొనుగోలు చేశారు. 2020-21లో ఖరీఫ్‌లో 53,862 మంది రైతుల నుంచి రూ.333.33 కోట్ల విలువైన  1,76,552 మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని సేకరించారు. రబీలో 60,471 మంది రైతుల నుంచి రూ.682.32 కోట్ల విలువైన 3,61,383 మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు చేశారు. ప్రస్తుతం 2021-22 సంవత్సరానికి 3.78 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలుకు సిద్ధమయ్యారు.


236 కొనుగోలు కేంద్రాల ఏర్పాటు 

కొవిడ్‌ సమయంలో రైతులకు అందుబాటులో ఉండే విధంగా ప్రతి గ్రామంలోనూ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తూ ధాన్యాన్ని సేకరిస్తున్నారు. ఇదే నేపథ్యంలో ఈ సారి కూడా జిల్లాలో 236 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఐకేపీ ద్వారా 58 కేంద్రాలు, సింగిల్‌ విండోల ద్వారా 162 కేంద్రాలు, డీసీఎంఎస్‌ ద్వారా 7 కేంద్రాలు, ఏఎంసీ ద్వారా 7 కేంద్రాలు, మెప్మా ద్వారా 2 కేంద్రాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.  కొత్తగా మరో 20 కేంద్రాలు ఏర్పాటు చేయడానికి ప్రతిపాదనలు రూపొందించారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని జిల్లాలోని 75 రైస్‌ మిల్లులకు పంపించనున్నారు. ధాన్యం కొనుగోళ్లకు ఉపయోగించడానికి 87 లక్షల 50 వేల గన్నీ సంచులు అవసరం అవుతాయని అంచనా వేశారు. ప్రస్తుతం జిల్లాలో 21 లక్షల 87 వేల 679 గన్నీ సంచులు నిల్వ ఉన్నాయి. 27 లక్షల కొత్త గన్నీ సంచులు జిల్లాకు రానున్నాయి. మిగతా సంచులు కూడా సేకరించడానికి ఏర్పాట్లు చేశారు.