డంపింగ్‌యార్డులో వర్మీ కంపోస్ట్‌ తయారీ

ABN , First Publish Date - 2022-05-12T04:45:15+05:30 IST

డంపింగ్‌యార్డుల్లో వర్మీ కంపోస్ట్‌ తయారుచేస్తూ, తయారుచేసిన ఎరువును నర్సరీ, పల్లె ప్రకృతివనం, హరితహారంలో నాటిన మొక్కలకు అందిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నది అక్కన్నపేట మండలం కుందనవానిపల్లి గ్రామపంచాయతీ.

డంపింగ్‌యార్డులో వర్మీ కంపోస్ట్‌ తయారీ
అక్కన్నపేట మండలం కుందనవానిపల్లిలోని డంపింగ్‌యార్డు

హరితహారంలో నాటిన మొక్కలకు సరఫరా

ఆదర్శంగా నిలుస్తున్న కుందనవానిపల్లి

అక్కన్నపేట, మే 11: డంపింగ్‌యార్డుల్లో వర్మీ కంపోస్ట్‌ తయారుచేస్తూ, తయారుచేసిన ఎరువును నర్సరీ, పల్లె ప్రకృతివనం, హరితహారంలో నాటిన మొక్కలకు అందిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నది అక్కన్నపేట మండలం కుందనవానిపల్లి గ్రామపంచాయతీ. ఈ గ్రామంలోని ప్రతి ఇంట్లో నుంచి చెత్త సేకరణ చేస్తూ తడి, పొడి చెత్త వేరుచేస్తూ డంపింగ్‌యార్డుకు తరలిస్తున్నారు. 

డంపింగ్‌యార్డులో తయారీ ఇలా

గ్రామంలోని ప్రతి ఇంటి నుంచి తడి, పొడి చెత్త,  వంటింటి వ్యర్థాలను పంచాయతీ సిబ్బంది సేకరించి గ్రామపంచాయతీ ట్రాక్టర్‌ ద్వారా డంపింగ్‌యార్డుకు తరలిస్తున్నారు. 

డంపింగ్‌యార్డులో ఉన్న నాడెప్‌ కంపోస్ట్‌ ఎరువు పిట్‌లో కింద కొబ్బరి పీచును వేస్తారు. దానిపైన తడి చెత్తను, ఆకులను వేస్తారు. ఇలా నాలుగు లేయర్లుగా వేస్తారు. వాటిపైన వానపాములను వేసి గోనె సంచులను కప్పుతారు. ప్రతి రెండురోజులకు ఒకసారి నీటిని చల్లుతారు. ఇలా చేయడం ద్వారా 40 నుంచి 50 రోజుల్లో వర్మీ కంపోస్టు తయారవుతుంది. ఈ ఎరువు పంటలకు ఎంతో ఉపయోగపడుతుంది. ఫర్టిలైజర్స్‌, ఫెస్టిసైడ్స్‌ను తగ్గించి వర్మీ కంపోస్ట్‌ను వాడడం వల్ల నాణ్యమైన పంటలు చేతికి వస్తాయని వ్యవసాయాధికారులు పేర్కొంటున్నారు.

ప్రజల సహకారంతో గ్రామ అభివృద్ధి

ప్రజల సహకారంతో గ్రామాన్ని అన్నిరకాలుగా అభివృద్ధి చేసేందుకు కృషిచేస్తున్నాను.గ్రామంలో నిర్మించిన డంపింగ్‌యార్డులో వర్మీ కంపోస్ట్‌ తయారుచేసి హరితహారంలో నాటిన, నర్సరీ మొక్కలకు అందించాలనే ఉద్దేశంతో ఈ ప్రక్రియను చేపట్టాం. వర్మీ కంపోస్ట్‌ ఎరువు ఎక్కువగా తయారుచేసి రైతులకు అతి తక్కువ ధరలో అందించేందుకు ప్రయత్నం చేపట్టాం.

- అన్నాడి దినే్‌షరెడ్డి, సర్పంచ్‌, కుందనవానిపల్లి



Read more