ధాన్యం కొనుగోళ్లకు సన్నాహాలు

ABN , First Publish Date - 2020-11-07T09:23:54+05:30 IST

జిల్లాలో ధాన్యం కొనుగోలుకు అధికారులు ఏర్పాట్లు ముమ్మరం చేశారు. ఈనెల మూడోవారంలో జిల్లాలో 122 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు

ధాన్యం కొనుగోళ్లకు సన్నాహాలు

16 నుంచి ప్రారంభించేందుకు ఏర్పాట్లలో నిమగ్నమైన అధికారులు


(ఆంధ్రజ్యోతి, వికారాబాద్‌) : జిల్లాలో ధాన్యం కొనుగోలుకు అధికారులు ఏర్పాట్లు ముమ్మరం చేశారు. ఈనెల మూడోవారంలో జిల్లాలో 122 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. జిల్లాలో  వరిని గతఏడాది కంటే ఈసారి ఎక్కువ సాగు చేశారు. 68,297.33 ఎకరాల్లో 43,309 మంది రైతులు వరిసాగు చేయగా, 1.60 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అధికారులు అంచనా వేశారు.  లక్ష్యం మేరకు ధాన్యం సేకరించాలని పౌరసరఫరాల శాఖ అధికారులు  నిర్దేశించుకున్నారు. కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చే ధాన్యాన్ని బాగా ఆరబెట్టి తేమ 17శాతం మించకుండా, చెత్తచెదారం లేకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటేనే ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర లభించనుంది. 


16 నుంచి  జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు

పరిగి, కొడంగల్‌, ధారూరు, బషీరాబాద్‌, తాండూరు వ్యవసాయ మార్కెట్‌ యార్డుల్లో ధాన్యం కొనుగోళ్లు చేపట్టనున్నారు. కేంద్రాలకు ఒకేరోజు ఎక్కువ సంఖ్యలో రైతులు ధాన్యం తీసుకుని రాకుండా టోకెన్‌ విధానం అమలు చేయనున్నారు. ఏఈవోలు గ్రామాల వారీగా వరిసాగు చేసిన రైతులకు టోకెన్లు పంపిణీ చేసి ఏ రైతు ఏరోజు కొనుగోలు కేంద్రానికి  ధాన్యం తీసుకు రావాలనే సమాచారం ఈ టోకెన్లలో నమోదు చేయనున్నారు. తేదీ, కొనుగోలు కేంద్రం, గ్రామం, రైతువివరాలు, తీసుకోవాల్సిన, పాటించాల్సిన జాగ్రత్తలు ఈ టోకెన్‌పైన  ముద్రించి ఉంటాయి.


ధాన్యం కొనుగోళ్లకు 35లక్షల గన్నీ బస్తాలు అవసరమవుతాయని అధికారులు గుర్తించగా, ఇప్పటి వరకు 12 లక్షల బస్తాలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకున్నారు. ఈనెల 16వ తేదీ నుంచి జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్న అధికారులు మరో 13 లక్షల గన్నీ బస్తాలు కావాలని ఆర్డర్‌ ఇచ్చారు. ధాన్యం కొనుగోళ్లు ప్రారంభం కాగానే మరో 10లక్షల బస్తాలు ఆర్డర్‌ ఇవ్వాలని వారు భావిస్తున్నారు. కొనుగోలు కేంద్రాల్లో అవసరమైన సదుపాయాలు కల్పించే పనుల్లో అధికారులు నిమగ్నమయ్యారు. తూకంయంత్రాలు, టార్ఫాలిన్‌ షీట్లు, తేమ నమోదు చేసే మీటర్లను సమకూర్చుకునే పనిలో పడ్డారు. ధాన్యం విక్రయించిన 48 గంటల్లోగా రైతుల ఖాతాల్లో  డబ్బులు ఆన్‌లైన్‌ ద్వారా జమయ్యేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. 

 

అక్రమ రవాణాకు అడ్డకట్ట 

ధాన్యం కొనుగోళ్లలో ఎలాంటి అవకతవకలు చోటు చేసుకోకుండా చర్యలు చేపట్టాలని ఉన్నతాధికారులు నిర్ణయించారు. పక్క రాష్ట్రం నుంచి జిల్లాకు ధాన్యం అక్ర మంగా తరలిరాకుండా జిల్లా సరిహద్దుల్లో రెండు చోట్ల తనిఖీలు కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. కొడంగల్‌ మండలం, రావులపల్లి, తాండూరు మండలం, కొత్లాపూర్‌ వద్ద ఏర్పాటు చేయనున్న ఈ కేంద్రాల్లో రెవెన్యూ, పోలీసు, వ్యవసాయ శాఖల అధికారుల ఆధ్వర్యంలో తనిఖీలు జరగనున్నాయి. ఇటీవల కొడంగల్‌లో కందుల కొనుగోళ్లలో చోటుచేసుకున్న అక్రమాల నేపథ్యంలో ఈసారి కొనుగోళ్లపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. 


కోవిడ్‌ నిబంధనలు తప్పనిసరి

ఇదిలా ఉంటే, కొనుగోలు కేంద్రాల వద్ద కోవిడ్‌ నిబంధనలను తప్పనిసరిగా పాటించేలా చర్యలు తీసుకోనున్నారు. కేంద్రాలకు వచ్చే రైతులు తప్పనిసరిగా మాస్కు ధరించాల్సి ఉంటుంది.  భౌతిక దూరం  పాటించేలా చర్యలు తీసుకోనున్నారు. అంతే కాకుండా కేంద్రాల వద్ద చేతులు శుభ్రపరుచుకునేందుకు నీరు, సబ్బు, శానిటైజర్‌ అందుబాటులో ఉంచనున్నారు. 

Updated Date - 2020-11-07T09:23:54+05:30 IST