పవర్‌కూ ప్రీపెయిడ్‌!

ABN , First Publish Date - 2020-09-13T07:13:45+05:30 IST

మీరు మొబైల్‌ ఫోన్‌లో మాట్లాడుతుంటారు. హఠాత్తుగా సర్వీసు నిలిచిపోతుంది. ఆరాతీస్తే.. ‘తగినంత బ్యాలెన్స్‌ లేదు’ అని సమాధానమొస్తుంది. సర్వీసును తిరిగి పొందాలంటే మీరు ప్రీపెయిడ్‌ చేసి మీ ఫోన్‌ను రీచార్జి చేయించుకోవాలి. ఇకముందు

పవర్‌కూ ప్రీపెయిడ్‌!

  • ముందుగా చెల్లిస్తేనే కరెంటు సరఫరా
  • ఫోన్ల మాదిరిగా ఎప్పటికప్పుడు రీచార్జి
  • లేదంటే కరెంటు సరఫరా నిలిపివేత
  • దీనికోసం ప్రీపెయిడ్‌ మీటర్ల బిగింపు
  • కొత్తగా బిగించాల్సివస్తే ఈ మీటర్లే పెట్టాలి
  • ప్రతిపాదించిన కేంద్ర విద్యుత్‌ శాఖ
  • రాష్ట్రాలకు చేరిన ముసాయిదా


(అమరావతి- ఆంధ్రజ్యోతి)

మీరు మొబైల్‌ ఫోన్‌లో మాట్లాడుతుంటారు. హఠాత్తుగా సర్వీసు నిలిచిపోతుంది. ఆరాతీస్తే.. ‘తగినంత బ్యాలెన్స్‌ లేదు’ అని సమాధానమొస్తుంది. సర్వీసును తిరిగి పొందాలంటే మీరు ప్రీపెయిడ్‌ చేసి మీ ఫోన్‌ను రీచార్జి చేయించుకోవాలి. ఇకముందు మీ ఇంటికి కరెంటు సరఫరా కావాలంటే, సరిగ్గా ఇలాగే ప్రీపెయిడ్‌ చేయాల్సిందే! ఎంత ముందుగా మీరు చెల్లిస్తే అంతే కరెంటు వాడుకొంటారు. ఈమేరకు కొత్తగా పెట్టే విద్యుత్‌ మీటర్లన్నీ ప్రీ పెయిడ్‌ మీటర్లు కాబోతున్నాయి. దీనిని ఒక నిబంధనగా అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. ఇప్పటిదాకా విద్యుత్‌ వాడకం తర్వాత నెలకు ఒకసారి కరెంటు బిల్లును వినియోగదారులు చెల్లిస్తున్నారు. ఆ రోజులు పోతున్నాయి. ప్రీ పెయిడ్‌ మీటర్లు వస్తే ఆ చెల్లింపులు ముందుగానే చేయాల్సి ఉంటుంది. ఆ మొత్తం అయిపోగానే కరెంటు సరఫరా ఆగిపోతుంది. అంటే, కరెంటు బిల్లు  వచ్చిన తర్వాత తీరిగ్గా వీలు చూసుకొని బిల్లు చెల్లించే పద్ధతికి కేంద్రం చెల్లు చీటి రాయబోతున్నదన్నమాట! చెల్లింపుల విధానాన్ని మెరుగుపర్చుకొని వినియోగదారుల నుంచి బకాయిలు లేకుండా చూసుకోవడానికి ఈ విధానం ప్రవేశపెడుతున్నారు.


  కేంద్ర విద్యుత్‌ శాఖ రెండు రోజుల కిందట అన్ని రాష్ట్రాలకు ఓ విధి విధానాల ముసాయిదాను పంపింది. వినియోగదారుల హక్కులకు సంబంధించిన విద్యుత్‌ విధి విధానాల ముసాయిదా- 2020 అని దీనికి పేరు పెట్టారు. ఈ నెలాఖరులోగా రాష్ట్ర ప్రభుత్వాలు, విద్యుత్‌ సంస్థలు తమ అభిప్రాయాలు తెలపాలని అందులో సూచించారు. కేంద్ర ప్రభుత్వ విద్యుత్‌ చట్టంలో భాగంగా ఈ విధి విధానాలను రూపొందించారు. ఒకసారి కేంద్రం వీటిని ఆమోదిస్తే దేశం అంతా ఇవి అమల్లోకి వస్తాయి. వాటిని పాటించి అమలు చేయడమే రాష్ట్ర ప్రభుత్వాల విధి అవుతుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కార్యాలయాల్లోని పాత మీటర్లను వెంటనే ప్రీపెయిడ్‌లోని మార్చాలని ఇప్పటికే ఆదేశాలు ఉన్నాయి. ఇకముందు..గృహ వినియోగదారులు, షాపులకు మార్చే మీటర్లు.. ప్రీ పెయిడే అయి ఉండాలని తన నిబంధనల్లో కేంద్రం స్పష్టంగానే సంకేతాలు ఇచ్చింది. 


ముసాయిదాలో ఉంది ఇదే..

కేంద్రం ప్రతిపాదించిన ముసాయిదా ప్రకారం కొత్తగా పెట్టే ప్రతి మీటర్‌ ప్రీ పెయిడ్‌ మీటర్‌ అయి ఉండాలి. ఏదైనా అరుదైన సందర్భంలో ఏదైనా రాష్ట్ర విద్యుత్‌ నియంత్రణ మండలి ప్రత్యేక మినహాయింపు ఇస్తే మాత్రమే మినహాయింపు లభిస్తుంది. ఆ మినహాయింపునకు సంబంధించిన సబబైన కారణాన్ని నియంత్రణ మండలి చూపించాల్సి ఉంటుంది. ప్రీ పెయిడ్‌ మీటర్లు వస్తే ముందుగానే కొంత మొత్తం చెల్లించాలి. ప్రతి నెలకు ఒకసారి అందులో ఎంత వాడారు...ఇంకా ఎంత మిగిలి ఉందో బిల్లు రూపంలోనే లేదా ఫోన్‌కు మెసేజ్‌ రూపంలోనే సమాచారం వస్తుంది. దానిని బట్టి మళ్లీ చార్జింగ్‌  చేసుకోవాలి. మీటర్లలో రెండు రకాలు ఉన్నాయి. సాధారణ మీటర్ల వద్దకు మీటర్‌ రీడర్‌ వచ్చి నెల నెలా రీడింగ్‌ నమోదు చేసుకోవాలి. స్మార్ట్‌ మీటర్‌ అయితే ఆ అవసరం లేదు. విద్యుత్‌ సంస్థ కేంద్ర కార్యాలయంలోనే రీడింగ్‌ తెలిసిపోతుంది. ఈ రెండు మీటర్లలో ఏది పెట్టినా ఇకపై పెట్టేవి అన్నీ ప్రీపెయిడ్‌ అయి తీరాలని కేంద్రం పేర్కొంది.


ప్రస్తుతం వినియోగదారులు వాడుతున్న మీటర్లను ప్రీ పెయిడ్‌ మీటర్లుగా మార్చడంపై మాత్రం ఈ విధి విధానాల్లో ఏమీ చెప్పలేదు. కానీ కేంద్రం కొత్తగా తెస్తున్న మరో విద్యుత్‌ బిల్లులో మాత్రం దీనిపై కొంత స్పష్టత ఇచ్చింది. అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రస్తుత మీటర్లు తీసివేసి ప్రీ పెయిడ్‌ మీటర్లు పెట్టాలని విద్యుత్‌ సంస్థలను ఆదేశించింది. ప్రభుత్వ కార్యాలయాల్లో విద్యుత్‌ బిల్లుల చెల్లింపు ఆలస్యమై బకాయిలు విపరీతంగా పేరుకుపోతుండటంతో వాటిలో మాత్రం పాత మీటర్లు మార్చివేయాలని నిర్ణయించారు. దశలవారీగా మొత్తం వినియోగదారుల ఇళ్లు, షాపుల్లో ఉన్న పాత మీటర్లు అన్నీ మున్ముందు ప్రీ పెయిడ్‌ అవడం ఖాయమని, నిధుల లభ్యతను బట్టి ఈ కార్యక్రమం జరుగుతుందని విద్యుత్‌ వర్గాలు భావిస్తున్నాయి. 


సేవాలోపానికి పరిహారం..

వినియోగదారుల హక్కుల పేరుతో రూపొందించిన ఈ ప్రతిపాదనల్లో సేవాలోపానికి వారికి పరిహారం చెల్లించాలని ప్రతిపాదించారు. విద్యుత్‌ నియంత్రణ మండలి నిర్దేశించిన సమయానికి మించి కరెంటు పోయినా, నిర్దేశిత సమయానికి మించి ఎక్కువ సార్లు కరెంటు సరఫరాలో అవాంతరాలు వచ్చినా, కొత్త కనెక్షన్‌ ఇవ్వడం లేదా మార్చడం లేదా కనెక్షన్‌ తొలగించడం, పునరుద్ధరించడం, వినియోగదారు వివరాలు మార్చడం, కనెక్షన్‌ స్ధాయిని పెంచడం లేదా తగ్గించడం, పాడైన మీటర్లు మార్చడం, సకాలంలో బిల్లు ఇవ్వడం, బిల్లుపై అనుమానంతో ఫిర్యాదు చేస్తే పరిష్కరించడం, వోల్టేజి సమస్యను పరిష్కరించడం వంటివి ప్రధాన మైన సేవలుగా పేర్కొన్నారు.


ఇంకా మరికొన్ని సేవలను కూడా సంబంధిత విద్యుత్‌ సంస్ధలు గుర్తించవచ్చు. ఏ ఫిర్యాదునైనా ఒక నెల నుంచి 45 రోజుల్లోపు పరిష్కరించాల్సి ఉంటుంది. పరిష్కరించలేకపోతే వినియోగదారునికి పరిహారంచెల్లించాలి. ఆ పరిహారం ఎంతో విద్యుత్‌ నియంత్రణ మండలి నిర్ణయిస్తుంది. ఆ డబ్బును వినియోగదారుడి విద్యుత్‌ బిల్లులో సర్దుబాటు చేస్తారు. ఏ ప్రాంతంలో అయినా కరెంటు సరఫరా ఆపాల్సి వస్తే అక్కడి వినియోగదారులకు ముందుగా సమాచారం తెలపాలి. ప్రతి సేవను ఎలా పొందాలో... ఏయే పత్రాలు జతచేయాలో పేర్కొంటూ సవివరంగా వెబ్‌ సైట్‌లో, కార్యాలయాల్లో ప్రదర్శించాలని ప్రతిపాదించారు. ఆన్‌లైన్‌లో...అలాగే కార్యాలయాల్లో దరఖాస్తులు ఇవ్వడానికి సమగ్ర ఏర్పాట్లు చేయాలి. ప్రతి దరఖాస్తుకు ఒక సంఖ్య ఇవ్వాలి. దాని ప్రగతిని వినియోగదారుడికి ఎప్పటికప్పుడు తెలియచేయాలి. ఒక కాల్‌ సెంటర్‌ ఏర్పాటు చేసి వినియోగదారులు దాని ద్వారా అన్ని సేవలు పొందే ఏర్పాటు చేయాలి. వృద్ధులు, వయో వృద్ధులకు వారి ఇంటి వద్దకు వెళ్లి సమస్య పరిష్కరించాలి. 


రూ.వెయ్యి దాటితే ఆన్‌లైన్‌లో..

రూ. వెయ్యికి పైబడిన విద్యుత్‌ బిల్లులన్నీ ఆన్‌లైన్‌లో చెల్లించాలని ప్రతిపాదించారు. ఇలా చేసేవారికి కొంత ప్రోత్సాహకం కూడా ఉంటుందని చెప్పారు. అంతకులోపు నగదుగా చెల్లించవచ్చు. ప్రైవేటు సంస్థల్లో మాదిరిగా ప్రభుత్వ విద్యుత్‌ సంస్థల్లో కూడా జవాబుదారీతనాన్ని పెంచేలా... వినియోగదారుల వినతులు త్వరగా పరిష్కారమయ్యేలా ఈ ప్రతిపాదనలు రూపొందించినట్లు ఈ ముసాయిదాలో వివరించారు. 

Updated Date - 2020-09-13T07:13:45+05:30 IST