అకాల వర్షం..అపార నష్టం

ABN , First Publish Date - 2022-01-18T06:36:14+05:30 IST

రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో పంట పొలాలకు తీవ్ర నష్టం వాటిల్లింది. వరదలతో పంట పొలాల్లో ఇసుక మేటలు వేయడంతో రైతులు లబోదిబోమంటున్నారు.

అకాల వర్షం..అపార నష్టం
సూర్యాపేటలోని మానసనగర్‌లో జనావాసాల మధ్య నిలిచిన వరద నీరు

వరదలతో పంట పొలాల్లో ఇసుక మేటలు

రైతులకు కలిసి రాని యాసంగి వ్యవసాయం

సూర్యాపేటరూరల్‌, జనవరి 17: రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో పంట పొలాలకు తీవ్ర నష్టం వాటిల్లింది. వరదలతో పంట పొలాల్లో ఇసుక మేటలు వేయడంతో రైతులు లబోదిబోమంటున్నారు. నష్టపోయిన పంట పొలాల్లో అధికంగా సన్నకారు రైతులే ఉన్నారు. ఈ యాసంగి రాష్ట్ర ప్రభు త్వం వరిని సాగు చేయొ ద్దని ఆదేశించడం, వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోవడం, భారీ వర్షాలు కురవడం తదితర కారణాలతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. డిసెంబరులో అధిక చలిలో నాట్లు వేయడంతో వరి పైర్లు పూర్తిగా ఎండుబారాయి.  దీంతో రైతులు రెండో సారి దుక్కు లు దున్ని నాట్లు వేశారు. నాట్లు వేసిన వారం, పది రోజులకే  వరదలు రావడంతో తీవ్ర నష్టం వాటి ల్లింది. సూర్యాపేట మండలంలో రెండు వేల ఎకరాలు పంట పొలాలు దెబ్బతిన్నట్లు వ్యవసాయాధికారులు ప్రాథమిక అంచనా వేశారు. ఇసుక మేట వేసిన ప్రాంతాలను జిల్లా వ్యవసాయాధికారి రామారావు నాయక్‌ సోమవారం పరిశీ లించారు. ప్రభుత్వానికి నివే దిక అందజేస్తామని ఆయన తెలిపారు. ఆయనతో పాటు ఏవో జానిమియా, ఏఈవో ముత్త య్య ఉన్నారు.

నీరు తొలగక ఇబ్బందులు

సూర్యాపేటటౌన్‌: జలదిగ్బంధం నుంచి సూర్యాపేట పట్టణం ఇప్పుడిప్పుడే తేరుకుంటోంది. వరద నీరు ఇంకా తొలగిపోలేదు. పట్టణంలోని పలు కాలనీల్లో అక్కడక్కడ నిలిచే ఉంది. జిల్లా కేంద్రంలోని తాళ్లగడ్డ, ఆర్‌కే గార్డెన్‌, మానసనగర్‌, అమరావదినగర్‌, కృష్ణాకాలనీలతో పాటు పలు ప్రాంతాల్లో వరద నీరు తొలగకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు.ముని సి పల్‌ అధికారులు నాలా ఆక్రమణలు గుర్తించి ఎక్స్‌కవేటర్‌ సహాయంతో నీటి ప్రవాహానికి అడ్డంకులు లేకుండా చేస్తున్నారు. మురుగు కాల్వలను శుభ్రం చేస్తున్నారు. 

బాధితులకు నిత్యావసరాల పంపిణీ 

లోతట్టు ప్రాంతాల ఇళ్లలోకి వరద నీరు చేరి ఇబ్బందులు పడుతున్న బాధితులకు తహసీల్దార్‌ బియ్యం అందజేశారు. సుమారు 74 కుటుంబాలకు 10 కేజీల చొప్పున బియ్యం పంపిణీ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం, కలెక్టర్‌ సూచనలమేరకు బాధితులకు సహాయం అందజేస్తున్నట్లు తెలిపారు. త్వరలోనే పలు స్వచ్ఛంద సంస్థల ద్వారా మరింత సహాయం అందజేసే అవకాశం ఉందన్నారు.

కొనసాగుతున్న సహాయక చర్యలు

వరద బాధితులకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మునిసిపల్‌ సిబ్బంది నాలా ఆక్రమణలు గుర్తించి వాటిని ఎక్స్‌కవేటర్‌ సాయంతో నీరు ప్రవహించేలా చర్యలు తీసుకున్నారు. అదేవిధంగా ప్రజాప్రతినిధులు, అఽధికారులు సహాయక చర్యలు చేపట్టారు. మునిసిపల్‌ వైస్‌చైర్మన్‌ పుట్ట కిశోర్‌, 27వవార్డు కౌన్సిలర్‌ సిరివెళ్ల లక్ష్మీకాంతమ్మ బాధితులకు తమవంతు సహా యం అందజేస్తున్నారు. మునిసిపల్‌ కమిషనర్‌ రామాంజులరెడ్డి మాట్లాడుతూ ప్రజలందరూ నిబంధనలు పాటించాలని,  నాలాలను ఆక్రమిస్తే చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.

జిల్లాలో వర్షపాతం వివరాలు ఇవే..

జిల్లాలో సోమవారం సగటున 6.07 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అత్యధికంగా ఆత్మకూర్‌(ఎ్‌స)లో 30.07 వర్షపాతం నమోదుకాగా, అత్యల్పంగా హుజూర్‌నగర్‌లో 0.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.  

అలుగులు పోస్తున్న చెరువులు

మోతె: రెండు రోజులుగా కురిసిన వర్షానికి తోడు ఎస్సారెస్పీ కాల్వల ద్వారా నీరు వస్తుండడంతో చెరువులు నిండి అలుగులు పోస్తున్నాయి. నామవరం పెద్దచెరువు, మామిళ్లగూడెం గండ్లచెరువు, సిరికొండ చెరువులు అలుగులు పోస్తుండంతో నామవరం నుంచి గుంజలూరుకు వెళ్లే రోడ్డు పగిలి మూడు అడుగుల మేర వరద వస్తుంది. మామిళ్లగూడెం నుంచి విభలాపురం వెళ్లే బ్రిడ్జి మునిగి వరద పెరగడంతో ప్రయాణికులు వెళ్లకుండా పోలీసులు బారీకేడ్లను ఏర్పాటు చేశారు. సిరికొండ గ్రామ శివారులో పొలాలు నీట మునిగాయి. ఉర్లుగొండ– నర్సింహాపురం మధ్య లోని పాలేరు బ్రిడ్జికి ఆనుకుని వరద వస్తుండడంతో సమీపంలోని పొలాలు పూర్తిగా నీట మునిగాయి. హుస్సేనాబాద గ్రామానికి చెందిన కొమ్ము లింగయ్య, కొమ్ము వీరయ్య పొలాల వద్ద ఎండబెట్టిన మిర్చి వదరకు కొట్టుకుపోయింది. సిరికొండ, రాంపురంతండా, నామవరం గ్రామాల్లోనూ కల్లాల వద్ద ఎండబెట్టిన మిర్చి రోడ్ల వెంబడి వరదకు కొట్టుకుపోయాయి. పంట నష్టంతో రైతులు ఆందోళనతో ఉన్నారు.

కోడూరు–కొమ్మాల రాకపోకలు బంద్‌

అర్వపల్లి : వర్షాలతో వాగులు, చెరువులు, కుంటలు పొంగి పోర్లుతున్నాయి. తిమ్మాపురం నుంచి కోడూరు వాగు అలుగు పోస్తుండడంతో రాకపోకలు బంద్‌ అయ్యాయి. వాగు వద్ద నడుంలోతు నీరు ప్రవహిస్తుండడంతో వ్యవసాయ బావుల వద్దకు, ద్విచక్ర వాహనదారులు, ప్రజలు ఇతర ప్రాంతాలకు వెళ్లడానికి తీవ్ర అవస్థలు పడుతున్నారు. కోడూరు గ్రామస్థులు ఎటూ వెళ్లే పరిస్థితి లేక సంక్రాంతి పండుగకు వచ్చినవారంతా గ్రామంలో ఉండి పోవాల్సి వచ్చింది. గతంలోనూ వాగు ప్రవాహంతో 10 రోజుల పాటు రాకపోకలు నిలిచి గ్రామస్థులు ఊర్లోనే ఉండాల్సిన వచ్చింది. వాగుపై బ్రిడ్జి నిర్మిస్తే 10 గ్రామాల రాకపోకలకు ఇబ్బంది ఉండదని కోడూరు గ్రామస్థులు తెలిపారు.  ఈ ప్రాంతంలో బిడ్జీ నిర్మించాలని గ్రామస్థులు కోరుతున్నారు.. 






Updated Date - 2022-01-18T06:36:14+05:30 IST