అకాల వర్షం.. అపార నష్టం

ABN , First Publish Date - 2022-05-04T05:30:00+05:30 IST

అకాల వర్షాలు రైతులకు అపార నష్టాన్ని మిగిల్చాయి.

అకాల వర్షం.. అపార నష్టం
దండుమైలారంలో దెబ్బతిన్న వరి

రంగారెడ్డి అర్బన్‌ / ఇబ్రహీంపట్నం రూరల్‌/ యాచారం, మే 4 : అకాల వర్షాలు రైతులకు అపార నష్టాన్ని మిగిల్చాయి. బుధవారం ఇబ్రహీంపట్నం నియోజక వర్గంలో ఈదురు గాలులతో కూడిన వర్షాలు భీభత్సం సృష్టించాయి. ఇబ్రహీంపట్నం, యాచారం, మంచాల మండలాల్లో బుధవారం ఉదయం భారీ ఈదురుగాలులతో కూడిన వర్షానికి కోత కొచ్చిన మామిడి కాయలు నేలరాలి తీవ్ర నష్టం వాటిల్లింది. సుమారు 200 ఎకరాల్లో మామిడి తోటలు దెబ్బతిన్నాయి. పోల్కంపల్లిలో యాదిరెడ్డికి చెందిన ఏడెకరాల్లో మామిడి తోటలో కాయలు పూర్తిగా రాలిపోయి నష్టం చేకూరింది. మామిడి చెట్లు సైతం వేళ్లతో సహా కిందకు ఒరిగిపోయాయి. అంతేగాక దండుమైలారం సెక్టార్‌లో గాలులకు కోతకొచ్చిన వరిచేలు నేలకొరిగాయి. గడిచిన 24 గంటల్లో ఇబ్రహీంపట్నం మండలం మంగళపల్లి 62.5 మిల్లిమీటర్లు వర్షపాతం నమోదైంది. నగర శివారులో మంగళవారం రాత్రి, బుధవారం ఉదయం వర్షం దంచి కొట్టింది. రోడ్లన్నీ జలమయంగా మారాయి. 


ఇబ్రహీంపట్నంలో..

ఇబ్రహీంపట్నం మండలంలో బుధవారం ఈదురు గాలులతో కూడిన వర్షం కురువడంతో పండ్ల తోటలు  దెబ్బతిన్నాయి. చేతికందిన వరి పంట నేలకొరిగింది. మండలంలోని దండుమైలారం, ముక్కునూరు, రాయపోల్‌, నెర్రపల్లి, నాగన్‌పల్లి, పొల్కంపల్లి గ్రామాల్లో మామిడి కాయలు పూర్తిగా నేలరాలాయి. కోతకు వచ్చిన వరి పైరు పాడైంది. ఉద్యానవనశాఖ అధికారులు కనకలక్ష్మి ఆయా గ్రామాల్లో సందర్శించి దెబ్బతిన్న పంటలను పరిశీలిం చారు. దాదాపు 120 ఎకరాల్లో పండ్ల తోటలు పాడయ్యాని తెలిపారు.


యాచారం మండలంలో..

యాచారం మండలంలోని యాచారం, చిన్నతూండ్ల, గున్‌గల్‌, తక్కళ్లపల్లి, తమ్మలోనిగూడ, కొత్తపల్లి, మేడిపల్లి తదితర గ్రామాల్లో బుధవారం ఉదయం ఓ మోస్తరు వర్షం కురిసింది. ఈదురు గాలులతో వర్షం కురవడంతో వరి పంట పూర్తిగా నేలకొరిగింది. ఇక పంట చేతికి రావడం కష్టమేని రైతులు ఆందోళన చెందుతున్నారు. తమను ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు.



Read more