అకాలవర్షం.. అపార నష్టం

ABN , First Publish Date - 2022-04-23T05:06:38+05:30 IST

జిల్లాలో వాన దంచి కొట్టింది. ఈదురుగాలులతో కూడిన వడగండ్ల వర్షానికి రైతులు తీవ్రంగా నష్టపోయారు.

అకాలవర్షం.. అపార నష్టం
తలకొండపల్లి : జంగారెడ్డి పల్లిలో నేలకొరిగిన వరి


  • నేలరాలిన మామిడి.. పడిపోయిన వరి 
  • తడిసి ముద్దయిన ఉల్లి
  • రూ.లక్షల్లో నష్టపోయిన రైతులు 
  • పిడుగుపాటుకు పశువులు మృతి
  • నష్టాన్ని అంచనా వేస్తున్న వ్యవసాయ అధికారులు

జిల్లాలో వాన దంచి కొట్టింది. ఈదురుగాలులతో కూడిన వడగండ్ల వర్షానికి రైతులు తీవ్రంగా నష్టపోయారు. చేతికొచ్చిన కూరగాయలు, వరి, మొక్కజొన్న పంటలు నేలకొరిగాయి. మామిడి తోటలు దెబ్బతిన్నాయి. గాలులకు చెట్లు విరిగిపడ్డాయి. పలుచోట్ల పిడుగుపాటుకు పశువులు మృత్యువాత పడ్డాయి. విద్యుత్‌కు అంతరాయం ఏర్పడింది.

కొత్తూరు/ఇబ్రహీంపట్నం రూరల్‌/మంచాల/మర్పల్లి/పరిగి/కులకచర్ల/తలకొండపల్లి, ఏప్రిల్‌ 22: ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో గురువారం రాత్రి శుక్రవారం సాయంత్రం వరకు కురిసిన వర్షాలు పంటలను దెబ్బతీశాయి. వర్షానికి తోడు గాలిదుమారం, వడగండ్లు కూడా తోడవ్వడంతో పంట నష్టం తీవ్రత భారీగా పెరిగింది. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలోని దండుమైలారం, కప్పాడు, ఎలిమినేడు, తులేకలాన్‌, తుర్కగూడ, పొల్కంపల్లి, నాగన్‌పల్లి గ్రామాల్లో వరిపైరు నేలకొరిగింది. మండలంలో సుమారు 70 ఎకరాల్లో మామిడి తోటలకు నష్టం వాటిల్లినట్టు వ్యవసాయ అధికారులు అంచనా వేశారు. మంచాల మండలంఆగాపల్లి, కాగజ్‌ఘట్‌ గ్రామాల్లో వడగళ్ల తీవ్రత ఎక్కువగా ఉంది. దీంతో ఆ గ్రామాల్లో వరి, కూరగాయలు, మామిడి తోటలు ధ్వంసమయ్యాయి. ఆగాపల్లిలో కూరగాయ నర్సరీల పైకప్పులు కూలిపోయాయి. వ్యవసాయాధికారులు శుక్రవారం ఆగాపల్లి, కాగజ్‌ఘట్‌ గ్రామాల్లో పర్యటించి వడగళ్లవానతో దెబ్బతిన్న పంటలను పరిశీలించారు. 22 ఎకరాల్లో వరి, 8ఎకరాల్లో మామిడి, 15ఎకరాల్లో కూరగాయ పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయని ప్రాథమికంగా అంచనా వేశారు.షాద్‌నగర్‌ నియోజకవర్గంలోని కొత్తూరు మండలం ఎస్‌బీపల్లి, సిద్ధాపూర్‌ గ్రామాల్లో గురువారం రాత్రి కురిసిన వర్షానికి 200 ఎకరాల్లో కూరగాయలు, వరిపంట దెబ్బతిన్నట్టు అధికారులు అంచనా వేశారు. ఒక్కసారిగా ఈదురుగాలులతో కూడిన వర్షం కురవడంతో ఈ గ్రామాల్లో మిర్చి, వంకాయ, కీరలాంటి కూరగాయల పంటలతో పాటు వరి, మొక్కజొన్న నేలకొరిగాయి. కొత్తూరు మండలంలోనే దాదాపు 50లక్షల రుపాయల పంట నష్టం జరిగి ఉండవచ్చని రైతులు చెబుతున్నారు. చేతికి వచ్చిన పంట నెల పాలు కావడంతో రైతులు లబోదిబోమంటున్నారు. వికారాబాద్‌ జిల్లా మర్పల్లిలో ఉల్లి పంటకు తీవ్ర నష్టం వాటిల్లింది. భారీ వర్షం, వడగండ్ల ప్రభావంతో మర్పల్లి మండలంలో 400 ఎకరాల ఉల్లిపంట ధ్వంసమైందని, దీంతోపాటు గట్లపై నిల్వ ఉంచిన ఉల్లి కూడా వర్షానికి తడిసి పాడైందని రైతులు వాపోతున్నారు. ఈ మండలంలోని మర్పల్లి, పంచాలింగాల, పట్లూరు, నర్సాపూర్‌ గ్రామాల్లో 1500 ఎకరాలకు పైగా ఈ జనవరిలో ఉల్లిపంట సాగుచేశారు. ప్రస్తుతం ఆ పంట చేతికి వచ్చి పొలాలనుంచి విక్రయించే తరుణంలో క్వింటాల్‌ ధర రూ. 500కు పడిపోయింది. దీంతో 80శాతం పంటను పొలాల గట్లపై నిల్వ ఉంచారు. ఇప్పుడు పడిన వర్షానికి ఆ పంటంతా పాడైపోయింది. గురువారం రాత్రి 11 గంటల నుంచి శుక్రవారం తెల్లవారుజామున రెండు గంటల వరకు ఎడతెరిపి లేకుండా వర్షం కురవడంతో పొలాల్లో ఉన్న పంటకూడా పాడైందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలని ఎస్‌బీపల్లి సర్పంచ్‌ అంబటి ప్రభాకర్‌ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. వికారాబాద్‌ జిల్లా పరిగిలో శుక్రవారం సాయంత్రం ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసింది. రంగారెడ్డి జిల్లా తలకొండపల్లిలో శుక్రవారం 68.3 మి.మీ వర్షం కురిసింది.

తలకొండపల్లి, జంగారెడ్డిపల్లిలో వడగండ్ల వాన

తలకొండపల్లి మండలంలో శుక్రవారం సాయంత్రం కురిసిన అకాల వర్షానికి రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఈదురుగాలులతో కూడిన వడగండ్ల వర్షానికి తలకొండపల్లి, జంగారెడ్డిపల్లి, రాంపూర్‌, ఎడవెళ్లి, చుక్కాపూర్‌, వెంకట్రావ్‌పేట, ఖానాపూర్‌, చెన్నారం, తుమ్మల కుంట తండాలలో సుమారు 500 ఎకరాలలో వరి పంట, మామిడి తోటలు దెబ్బతిన్నాయి. తలకొండపల్లిలో మేకల షెడ్డు కూలి నాలుగు మేకలు మృతి చెందాయి. కొట్టాలు కూలిపోయాయి. గ్రామాలలో కొద్ది సేపు విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. 

పిడుగుపాటుకు పశువులు మృతి

రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం తుర్కగూడ గ్రామంలో గురువారం రాత్రి పిడుగుపాటుకు రెండు పాడి గేదెలు మృత్యువాత పడ్డాయి. మాదారం కుమార్‌ తన పాడి గేదెలను గురువారం సాయంత్రం పశువుల పాకలో కట్టేసి బంధువుల ఇంటికి వెళ్లాడు. శుక్రవారం తెల్లవారుజామున స్థానికులు వచ్చి చూసేసరికి రెండు గేదెలు మృతి చెంది ఉన్నాయి. వాటి విలువ సుమారు రూ.లక్షకు పైనే ఉంటుందని రైతు వాపోయాడు. వికారాబాద్‌ జిల్లా కులకచర్ల మండలం బొంరెడ్డిపల్లిలో నాలుగు ఆవులు, రెండు లేగదూడలు, బండెల్కిచర్లలో ఆవిఉ, పీరంపల్లిలో ఒక ఆవు మృత్యువాత పడ్డాయి.

ఉమ్మడి జిల్లాలో శుక్రవారం 

నమోదైన వర్షపాతం (మిల్లిమీటర్లు)

జిల్లా మండలం ప్రాంతం వర్షపాతం

రంగారెడి తలకొండపల్లి చుక్కాపూర్‌ 68.3

నందిగామ పీహెచ్‌సీ 23.5

షాబాద్‌ షాబాద్‌ 15.3

వికారాబాద్‌ కుల్కచర్ల పుట్టపహాడ్‌ 16.3

పరిగి పరిగి 13.0

మేడ్చల్‌ కూకట్‌పల్లి బాలాజీనగర్‌ 2.0

తీవ్రంగా నష్టపోయాం 

నేను ఒక ఎకరంలో వరి, ఒక ఎకరంలో మిర్చి పంటను సాగు చేశాను. గురువారం రాత్రి ఈదురుగాలులు, వడగండ్లతో కురిసిన వర్షానికి పంటంతా దెబ్బతిన్నది. అప్పులు తెచ్చి పంట సాగు చేశా. ఇతర రైతుల వరి, మొక్కజొన్న, కూరగాయల పంటలు కూడా నేలకు ఒరిగాయి. మా ఒక్క ఊరిలోనే లక్షల రూపాయల నష్టం వాటిల్లింది. ప్రభుత్వం నష్టపోయిన రైతులను ఆదుకోవాలి.     -కృష్ణయ్య, మిర్చి రైతు ఎస్‌బీ పల్లి, కొత్తూరు మండలం

నివేదికలు సిద్ధం చేస్తున్నాం

పంట నష్టపోయిన శేరిగూడబద్రాయపల్లి, సిద్ధాపూర్‌ గ్రామాల్లో వ్యవసాయ విస్తరణాధికారులు పర్యటించారు. పంట నష్టం వివరాలను అంచనా వేస్తున్నాం. పూర్తి వివరాలు సేకరించి ఎంత నష్టం జరిగింది అనే విషయంపై నివేదిక తయారుచేసి ప్రభుత్వానికి అందజేస్తాం.   - గోపాల్‌, వ్యవసాయాధికారి, కొత్తూర్‌

వర్షానికి ఉల్లి పంట తడిసిపోయింది

ఎకరంన్నర ఉల్లిపంట సాగుచేశా. రూ.60వేల పెట్టుబడి పెట్టాను. పంట దిగుబడి బాగా వచ్చింది. రాత్రి కురిసిన వర్షానికి పొలం గట్లపై పెట్టిన ఉల్లిగడ్డలు పూర్తిగా తడిసిపోయాయి. తడిస్తే సరైన ధర రాదు. కనీసం రవాణా చార్జీలు కూడా వచ్చే పరిస్థితి కనిపించడం లేదు.   - శేఖర్‌, రైతు, పంచాలింగాలు, మర్పల్లి మండలం

Updated Date - 2022-04-23T05:06:38+05:30 IST