అకాల వర్షం ఆగమాగం

ABN , First Publish Date - 2021-05-07T09:21:39+05:30 IST

అకాల వర్షం అన్నదాతను ఆగం చేసింది. ఆరుగాలం కష్టపడి పండించిన పంటను గాలి వాన నిండా ముంచింది.

అకాల వర్షం ఆగమాగం

నిజామాబాద్‌, కామారెడ్డి, సిరిసిల్ల జిల్లాల్లో గాలి వాన

కొనుగోలు కేంద్రాల్లో తడిసిన వడ్లు..

కళ్లముందే కొట్టుకుపోయిన ధాన్యం


(ఆంధ్రజ్యోతి న్యూస్‌ నెట్‌వర్క్‌)

అకాల వర్షం అన్నదాతను ఆగం చేసింది. ఆరుగాలం కష్టపడి పండించిన పంటను గాలి వాన నిండా ముంచింది. కళ్లెదుటే తడిసిపోతున్న వడ్లను చూసి రైతన్న గుండె విలవిల్లాడింది. తెలంగాణలోని పలు జిల్లాల్లో గురువారం సాయంత్రం కురిసిన వర్షానికి కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసిముద్దయింది. నిజామాబాద్‌ జిల్లా సిరికొండ మండలంలోని కొనుగోలు కేంద్రాల్లో తూకం వేసిన ధాన్యంతో పాటు కళ్లాల్లో ఉన్న వడ్లు తడిసిపోయాయి. కామారెడ్డి జిల్లాలోని కామారెడ్డి, రామారెడ్డి, రాజంపేట, దోమకొండ, భిక్కనూరు, మాచారెడ్డి తదితర మండలాల్లో కొనుగోలు కేంద్రాల్లో వరి ధాన్యం తడిసిపోయింది.


భారీ వర్షానికి కామారెడ్డి మార్కెట్‌ యార్డులోని ధాన్యం నీటిలో కొట్టుకుపోయింది. కేంద్రాల వద్ద సరిపడాటార్పాలిన్లు లేకపోవడంతో రైతులు ఏమీ చేయలేక ధాన్యం తడుస్తుంటే దీనంగా చూస్తూ ఉండిపోయారు. సుమారు 500 క్వింటాళ్ల వడ్లు తడిశాయని రైతులు చెబుతున్నారు. దోమకొండ, బీబీపేట మండలాల్లో సుమారు 120 ఎకరాల్లో కోతకు వచ్చిన వరి నేలవాలింది. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఎల్లారెడ్డిపేట, గంభీరావుపేట, చందుర్తి, కోనరావుపేట మండలాల్లో కొనుగోలు కేంద్రాల్లో 5 వేల క్వింటాళ్ల వరకు ధాన్యానికి నష్టం వాటిల్లింది. కోనరావుపేట మండలం వట్టిమల్ల, కోనరావుపేట, నిజామాబాద్‌ గ్రామాల్లో.. చందుర్తి మండలం సనుగుల, ఎల్లారెడ్డిపేట మండలం పదిర, బొప్పాపూర్‌, ఎల్లారెడ్డిపేటలో వడ్లు తడిసిపోయాయి. జగిత్యాల జిల్లా మేడిపల్లి మండలంలోని భీమారం, దేశాయిపేట, గోవిందారం, మన్నెగూడెం గ్రామాల్లో కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసిపోయింది. వరి, మామిడి, నువ్వు పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది.

Updated Date - 2021-05-07T09:21:39+05:30 IST