‘అకాల’ కష్టం

ABN , First Publish Date - 2022-01-13T05:02:44+05:30 IST

‘అకాల’ కష్టం

‘అకాల’ కష్టం
రుద్రగూడెంలో కల్లంలో తడిసిన మిర్చిని చూపిస్తున్న రైతు రాజమల్లు, మైసంపల్లిలో కొట్టుకుపోయిన ఇంటి పైకప్పు, దుగ్గొండి మండలంలో నీటమునిగిన పంట పొలం

జిల్లాను కుదిపేసిన వర్ష బీభత్సం

556.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు

191 గ్రామాల్లో 25వేల ఎకరాల్లో దెబ్బతిన్న పంటలు

నర్సంపేటలో 14,500 ఎకరాల్లో నీటమునిగిన మిర్చి 

వరంగల్‌లో జలమయమైన లోతట్టు ప్రాంతాలు

ఇటుకాలపల్లి, గుండ్లపహాడ్‌లో రైతుల రాస్తారోకో

నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్‌


వరంగల్‌, జనవరి 12(ఆంధ్రజ్యోతి) : జిల్లాను అకాల వర్షాలు కుదిపేశాయి. ఎన్నడూ లేనివిధంగా వంద కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన వడగళ్ల బీభత్సానికి పంటలన్నీ నేలమట్టమయ్యాయి. జిల్లా వ్యాప్తంగా 191 గ్రామాల్లో వడగండ్ల వాన తో పంటలు నష్టపోయినట్లు అధికారులు ప్రాథమి కంగా అంచనాకు వచ్చారు. జిల్లా వ్యాప్తంగా 25వేల ఎకరాల్లో పంట నష్టం వాటిల్లినట్టు తెలుస్తోంది. నర్సంపేట డివిజన్‌లోని ఆరు మండలాల్లో 14వేల ఎకరాల్లో మిర్చి పంట దెబ్బతినగా, 9255 ఎకరాల్లో మొక్కజొన్న, వంద ఎకరాల్లో వేరుశనగ, 55 ఎకరాల్లో పొద్దుతిరుగుడు, 126 ఎకరాల్లో అరటితోటలు దెబ్బతిన్నాయని అధికారులు అంచనా చేశారు. వరంగల్‌ జిల్లా వ్యాప్తంగా 10 మండలాల్లో 191 గ్రామాల్లోని 18,946 రైతులకు సంబంధించిన రూ.200కోట్ల మేర పంట నష్టం వాటిల్లినట్టు లెక్కలు కట్టారు. వైరస్‌ ఉధృతితో మిర్చిపంటలు కొంత నష్టపోయినా మందులతో ఎలాగోలా బయటపడిం దనుకున్న సమయానికి వడగండ్లు సర్వనాశనం చేశాయి. 


నేలవాలిన మొక్కజొన్న.. 

మొక్కజొన్న పంటలో ఇప్పుడిప్పుడే కంకి బెరడు, పీచు వేస్తుండగా రాళ్ల వర్షంతో పంట నేలవాలి దెబ్బతిన్నది. మరోవైపు ఇప్పటికే వేలాది ఎకరాల్లో కొత్తరకం వైరస్‌తో మిర్చి తోటలు దెబ్బతిని రైతులు తీవ్రంగా నష్టపోగా సోమ, మంగళవారాల్లో కురిసిన అకాల వర్షాలతో మిర్చి తోటలు నీటమునిగిపోయాయి. ఇప్పటికే కళ్లాల్లో వేసిన మిర్చి సైతం వర్షంతో తడిసిముద్దవడంతో కంటికిరెప్పలా కాపాడుకున్న పంట చేతికి రాకుండా పోయిందని మిర్చి రైతులు గుండెలవిసేలా రోదిస్తున్నారు. 


కొట్టుకుపోయిన రేకులషెడ్లు

ఈదురుగాలులతో పలు గ్రామాల్లో ఇళ్ల పైకప్పులు, రేకుల షెడ్లు కూలిపోయాయి. భారీ వృక్షాలు విద్యుత్‌ తీగలపై పడడంతో నల్లబెల్లి, దుగ్గొండి, నర్సంపేట మండలాల్లో విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. మంగళవారం రాత్రంతా ప్రజలు చీకట్లోనే మగ్గిపోయారు. ఇళ్లలోకి నీరు రావడం, వడగండ్లు కురవడంతో వంట సామగ్రి ధ్వంసమైంది. అకాల వర్షంతో అటు రైతులు, ఇటు సాధారణ ప్రజలు తీవ్రంగా నష్టపోయారు.  


జాతీయ రహదారిపై రాస్తారోకో

అకాల వర్షంతో  కోల్పోయిన పంటలకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్‌  చేస్తూ నర్సంపేట మండలం ఇటుకాలపల్లి శివారులో నేషనల్‌ హైవే-365పై బుధవారం రైతులు రాస్తారోకో చేశారు. దీంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఉన్నతాధికారులకు విషయాన్ని తెలియజేసి న్యాయం చేస్తామని తహసీల్దార్‌ రామ్మూర్తి, సీఐ పులి రమే్‌ష హామీ ఇవ్వడం రైతులు ఆందోళన విరమించారు.  రాస్తారోకోలో ఇటుకాలపల్లి, ఆకులతండా రైతులు బానోతు లక్ష్మణ్‌, వీరన్న, రాజన్న తదితరులు పాల్గొన్నారు.


నర్సంపేటలోనే భారీ నష్టం

నర్సంపేట డివిజన్‌లోని నర్సంపేట మండలంలో ఇప్పల్‌తండా, ఆకులతండా, ఇటుకాలపల్లి, రాజుపేట, భాంజిపేట, కమ్మపల్లి, దాసరిపల్లి, మాధన్నపేట, మహేశ్వరం,  దుగ్గొండి మండలంలోని వెంకటాపురం, దుగ్గొండి, మహ్మదాపురం, చంద్రయ్యపల్లి, గోపాలపురం, మైసంపల్లి, మల్లంపల్లి, బల్వాంతాపురం,  ఖానాపురం మండలంలోని కొత్తూరు, రంగాపురం, చెన్నారావుపేట మండలంలోని చెన్నారావుపేట, అక్కల్‌చెడ, కోనాపురం, ఉప్పరపల్లి, పాపయ్యపేట, నల్లబెల్లి మండలంలోని నల్లబెల్లి, రుద్రగూడెం, నాగరాజుపల్లె, కొండైలుపల్లె, మామిండ్లవీరయ్యపల్లె, గుండ్లపహాడ్‌, బజ్జుతండా, లెంకాలపల్లి తదితర గ్రామాల్లో వర్షం దంచికొట్టింది. ఈ వర్షంతో మిర్చి, మొక్కజొన్న, అరటి, వేరుశనగ, పొద్దుతిరుగుడు, మినుమములు, పెసలు, అలసంద, జొన్న, ఆవాల పంటలు తీవ్రంగా దెబ్బతినడంతో రైతులు గుండెలు బాదుకున్నారు.









Updated Date - 2022-01-13T05:02:44+05:30 IST