అన్నదాతకు అకాల కష్టం

ABN , First Publish Date - 2022-05-18T06:42:07+05:30 IST

జిల్లాలో వరి కోతలు మొదలై నెలన్నర గడిచిపోతోంది. ధాన్యం కొనుగోళ్లు మొద లుపెట్టి సైతం నెల రోజులు దాటినా.. ఇప్పటికీ జిల్లా అంతటా పలు గ్రామాల పరిధిలో ధాన్యం కుప్పలు ఎక్కడికక్కడ భారీగానే ఉన్నాయి. కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తీసుకువచ్చిన రైతులు అమ్మకం

అన్నదాతకు అకాల కష్టం
డిచ్‌పల్లి మండల శివారులో కొనుగోలు కేంద్రంలో వరిధాన్యం కుప్పలు

జిల్లాలో ఇంకా కల్లాల్లోనే ఎక్కడికక్కడ భారీగా ధాన్యం కుప్పలు

రోజుల తరబడి వేచిచూస్తున్నా.. కొనుగోలు చేయని వైనం

అకాల వర్షంలో ధాన్యం తడవడంతో అన్నదాతల్లో మొదలైన ఆందోళన

తడిసిన ధాన్యం మిల్లులకు తరలించేందుకు అధికారుల ఏర్పాట్లు

మొత్తం 457 కొనుగోలు కేంద్రాల ద్వారా 4లక్షల 44వేల 392 మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు

ఇప్పటి వరకు రూ.347 కోట్లు మాత్రమే ధాన్యం రైతులకు చెల్లింపులు

జిల్లావ్యాప్తంగా ధాన్యం తరలించేందుకు హమాలీలు, వాహనాల కొరత

నిజామాబాద్‌, మే 17(ఆంధ్రజ్యోతి ప్రతినిధి): జిల్లాలో వరి కోతలు మొదలై నెలన్నర గడిచిపోతోంది. ధాన్యం కొనుగోళ్లు మొద లుపెట్టి సైతం నెల రోజులు దాటినా.. ఇప్పటికీ జిల్లా అంతటా పలు గ్రామాల పరిధిలో ధాన్యం కుప్పలు ఎక్కడికక్కడ భారీగానే ఉన్నాయి. కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తీసుకువచ్చిన రైతులు అమ్మకం కోసం 15నుంచి 20 రోజుల వరకు వేచిచూడాల్సిన పరిస్థితు లు నెలకొన్నాయి. తూకం వేసిన ధాన్యం కూడా తరలించడానికి లారీలు లేకపోవడంతో రైతులు అక్కడే కాపలా ఉంటున్నారు. అకాల వర్షాలతో ధాన్యం తడుస్తుండడంతో రైతులు ఆందో ళన చెందుతున్నారు. అన్ని కొనుగోలు కేంద్రాల్లో గన్నీ బ్యాగులు, హమాలీలు, వా హనాలను సమకూర్చి వెంటనే కొనుగోలు పూర్తిచేయాలని రైతులు కోరుతున్నా రు. కొన్ని సొసైటీల పరిధిలో కొనుగోళ్లను చైర్మన్‌లతో పాటు సభ్యులు పట్టించుకోకపోవడం వల్ల ఆలస్యమవుతున్నాయి. గన్నీ బ్యాగుల కోసం కూడా రోజుల తరబడి ఎదురుచూసే పరిస్థితి తలెత్తుతోందని రైతులు వాపోతున్నారు.

భారీ ఎత్తున తడిసిన ధాన్యం

జిల్లాలో అకాల వర్షాలతో రైతుల ధాన్యం భారీగా తడిసింది. ఆదివారం అర్ధరాత్రి నుంచి సోమవారం ఉదయం వరకు కురిసిన వర్షానికి జిల్లా అంతటా ఆరబోసిన ధాన్యం, కుప్పలు పోసిన ధాన్యం, కొనుగోలు పూర్తి చేసి సంచుల్లో నింపిన ధాన్యం తడిసిముద్దయ్యింది. జిల్లాలోని పలు కొనుగోలు కేంద్రాలకు వర్షపు నీళ్లు రావడంతో రైతులు తడిసిన ధాన్యం ఆరబోసేందుకు తిప్పలు పడుతున్నారు. తూకం వేసిన ధాన్యం కూడా తరలించేందుకు వాహనాలు లేకపోవడంతో సమస్యలు ఎదుర్కొంటున్నారు. సొసైటీల పరిధిలోని చైర్మన్‌లతో పాటు మండల తహసీల్దార్‌లు, ఇతర అధికారులకు ఫిర్యాదులు చేసినా హమాలీలు, గన్నీ బ్యాగుల కొరత, లారీలు అందుబాటులో లేకపోవడంతో స్థానిక పలు రకాల సమస్యలను రైతులు ఎదుర్కొంటున్నారు.

ముందుగానే సన్నాల అమ్మకాలు

జిల్లాలో నెలన్నర రోజులుగా వరి కోతలను రైతులు చేస్తున్నారు. బోధన్‌ డివిజన్‌లోని ఐదు మండలాల రైతులు సన్న రకాలను ముందుగానే వ్యాపారులకు అమ్ముకున్నారు. కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయకముందే లక్ష మెట్రిక్‌ ట న్నుల వరకు అమ్మకాలు చేశారు. కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసిన తర్వాత కూడా తమ ధాన్యాన్ని ఎక్కువ మంది రైతులు వ్యాపారులకు అమ్మకాలు చేశా రు. ఈ డివిజన్‌ మినహాయిస్తే ఇతర మండలాల్లోని రైతులు కొనుగోలు కేంద్రాలకే తీసుకువచ్చి అమ్మకాలు చేస్తున్నారు. ఏ-గ్రేడ్‌ కింద క్వింటాలు రూ.1960 కొ నుగోలు చేస్తుండడంతో.. రోజుల తరబడి వేచి ఉండి మరీ ఈ ధాన్యాన్ని అమ్ము తున్నారు. ఆరబోసిన తర్వాత కొనుగోలు కోసం 15 నుంచి 20 రోజుల పాటు వేచిచూస్తున్నారు. తూకం వేసిన తర్వాత కూడా ఐదు నుంచి 10 రోజుల వరకు వేచిచూస్తే తప్ప లారీల కొరత వల్ల తరలింపు జరగడం లేదు. జిల్లాలో గత 15 రోజుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యం లారీల కొరత వల్ల తరలించకపోవడం వల్ల అకాల వర్షంతో భారీగా తడిసిపోయింది. మిల్లులకు వెళ్లిన వాహనాలు కూడా త్వరగా తిరిగి పంపించకపోవడం వల్ల  సమస్యలు ఎదరవుతున్నాయి. కాంట్రాక్టర్‌లకు వాహనాలు సమకూర్చకపోతే ఫైన్‌లు వేస్తున్నా.. బయట తగినన్ని లారీలు దొరక్కపోవడం వల్ల తరలింపు ఆలస్యమవుతుండడంతో రైతులకు ఇబ్బందులు తప్పడం లేదు.

457 కేంద్రాల ద్వారా కొనుగోళ్లు

జిల్లాలో ఇప్పటి వరకు 457 కొనుగోలు కేంద్రాల ద్వారా 4లక్షల 44వేల 392 మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశారు. జిల్లాలో ఇప్పటి వరకు రూ.871 కోట్ల ధాన్యాన్ని రైతుల నుంచి తీసుకున్నారు. జిల్లాలో ఇప్పటి వరకు మొత్తం 59,790 మంది రైతుల నుంచి ధాన్యాన్ని సేకరించారు. జిల్లాలో కొనుగోలు చేసిన ధాన్యంలో రూ.347 కోట్లు మాత్రమే రైతుల కు చెల్లించారు. జిల్లాలో ఽధాన్యం సేకరణ ఈ దఫా ఆలస్యంగా మొదలవడంతో ప్రస్తుతం ఇ బ్బందులు తలెత్తుతున్నాయి. జిల్లావ్యాప్తంగా కొ నుగోలు కేంద్రాలను పెంచినా.. తగినంతగా గన్నీ బ్యాగులను సమకూర్చకపోవడం వల్ల మొదట స మస్యలు ఎదురయ్యాయి. తర్వాత ఇతర ప్రాంతా ల నుంచి తెప్పించి సరఫరా చేస్తున్నా.. ఇప్పటికీ పలు కేంద్రాలకు తగినంతగా అందడంలేదు. కొన్ని ప్రాంతాలకు చినిగిన గన్నీ బ్యాగులు పంపడం వల్ల కూడా రైతులు ధాన్యాన్ని నింపడం లేదు. అన్ని జిల్లాల్లో ఒకేసారి కొనుగోళ్లు మొదలుపెట్టడం వల్ల హమాలీ ల కొరత కూడా భారీగానే ఉంది. ధాన్యం సంచుల్లో నింపడంతో పాటు లారీలకు ఎక్కించేందుకు రోజుల తరబడి కూడా హమాలీలు దొరక్కపోవడం వల్ల ఆలస్యమవుతోంది. కొన్ని కేంద్రాల్లో హమాలీలు ఉన్నా.. వాహనాలు దొరక్కపోవడం వల్ల కొనుగోలు చేసిన ధాన్యం కూడా తరలించడం లేదు. ముఖ్యంగా డిచ్‌పల్లి, ఇందల్‌వాయి మండలాల పరిధిలో సొసైటీ చైర్మన్‌లు స్పందించకపోవడం వల్ల గన్నీ బ్యాగుల కొరత ఏర్పడి ఇప్పటికీ ధాన్యాన్ని నింపడంలేదు. గన్నీ బ్యాగులు ఆలస్యమవడం వల్ల ఈ రెండు మండలాల పరిధిలో సమస్యలు తలెత్తాయి. తూకం వేసిన ధాన్యం కూడా తరలించక ఈ రెండు మండలాలతో పాటు నవీపేట, జక్రాన్‌పల్లి, ఆర్మూర్‌, నందిపేట మండలాల్లో అకాల వర్షానికి ధాన్యం తడిసిముద్దయ్యింది. జిల్లా సహకారశాఖ పరిధిలో ఉన్న సొసైటీల్లో కొన్నిచోట్ల చైర్మన్‌లు కలగజేసుకుని ధాన్యం కొనుగోలు వేగంగా పూర్తిచేసినా.. మిగతాచోట్ల పట్టించుకోకపోవడం వల్ల ఆలస్యమవుతోంది. అధికారులు, తహసీల్దార్‌లు పర్యవేక్షిస్తున్నా.. ప్రధానంగా హమాలీలు గన్నీ బ్యాగుల కొరత లారీలు దొరక్కపోవడం వల్ల స మస్య ఎక్కువవుతోంది. కొనుగోలుకు ఆలస్యం కావడం, తూకం వేసిన తర్వాత తరలించకపోవడం వల్లనే తమ ధాన్యం తడుస్తోందని రైతులు ఆరోపిస్తున్నారు. కొనుగోలు చేసిన రోజే ధాన్యాన్ని తరలించాలని అధికారులకు విన్నవిస్తున్నారు.

ధాన్యం తరలింపునకు చర్యలు

జిల్లాలో తడిసిన ధాన్యాన్ని వెంటవెంటనే తరలించేందుకు జిల్లా యంత్రాం గం చర్యలు చేపట్టింది. అదనపు కలెక్టర్‌ ఆధ్వర్యంలో పలు ప్రాంతాల్లో పర్యటిం చి తడిసిన ధాన్యం వివరాలను సేకరించారు. ఈ ధాన్యాన్ని ముందుగానే తరలించి బాయిల్డ్‌ మిల్లుల్లో మర ఆడించేవిధంగా ఏర్పాట్లను చేసుకున్నారు. కేంద్రం బాయిల్డ్‌ బియ్యానికి కొంతమేర అనుమతులు ఇవ్వడంతో తడిసిన ధాన్యాన్ని ముందుగా తరలించేందుకు సిద్ధమయ్యారు. రైతుల సమ్మతితోనే మి ల్లులకు తరలిస్తున్నారు. కొంత ధాన్యం తడవడం వల్ల తేడాలు రానుండడంతో రైతుల అనుమతులు తీసుకుని ఈ ధాన్యం తరలింపులు చేస్తున్నారు. 

ధాన్యం తెచ్చి 20 రోజులైనా.. కొనుగోలు లేదు

: పోతన్న, ధాన్యం రైతు, లింగాపూర్‌ గ్రామం

వరి కోసి నెల రోజులవుతోంది. ధాన్యం కొనుగోలు కేంద్రానికి తెచ్చి 20 రోజులు దాటింది. ఇప్పటి వరకు ధాన్యం కొనుగోలు చేయకపోవడంతో అకాల వర్షంలో తడిసింది. ధాన్యం తెచ్చిన తర్వాత కొనుగోలు చేస్తే మాకు ఈ ఇబ్బంది ఉండేది కాదు. ఇప్పటికైనా అధికారులు కొనుగోలు చేపట్టాలి. 

లారీలు, హమాలీల కొరతతో వాయిదా వేస్తున్నారు

: కుర్మ సాయిలు, ధాన్యం రైతు, లింగాపూర్‌ గ్రామం

లారీలు, హమాలీలు, గన్నీ బ్యాగులు లేవంటూ కొనుగోలు వాయిదా వేస్తున్నారు. ఎన్ని రోజులు అధికారులకు విన్నవించినా పట్టించుకోవడంలేదు. తెచ్చిన రెండు, మూడు రోజులకే ధాన్యం కొనుగోలు చేస్తే తడిసేది కాదు. ఇప్పటికైనా అధికారులు లారీలు, హమాలీలను సమకూర్చి, త్వరగా ధాన్యం కొనుగోలు చేయాలి. 

తడిసిన ధాన్యం మొత్తాన్ని కొనుగోలు చేస్తాం..

: చంద్రశేఖర్‌, అదనపు కలెక్టర్‌, నిజామాబాద్‌

జిల్లాలో తడిసిన ధాన్యాం మొత్తం కొనుగోలు చేస్తాం. ఇప్పటికే కొన్ని కేంద్రాల నుంచి ధాన్యాన్ని తరలిస్తున్నాం. రైతులు ఎవరూ ఆందోళన చెందవద్దు. ఒకటి, రెండు రోజులు ఆరబోయగానే తూకం వేస్తాం. వెంటనే మిల్లులకు తరలిస్తాం. వాహనాలు, హమాలీలు, గన్నీ బ్యాగుల కొరత లేకుండా ఏర్పాట్లను చేస్తున్నాం. అంతేకాకుండా జిల్లావ్యాప్తంగా తడిసిన ధాన్యాన్ని ముందుగా మిల్లులకు తరలిస్తున్నాం. బాయిల్డ్‌ మిల్లుల్లో మర ఆడించి ఎఫ్‌సీఐకి తరలిస్తాం. 


కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కాలయాపన వల్లే తడిసిన ధాన్యం

కమ్మర్‌పల్లి: ‘యాసంగి లోపు ధాన్యం కొనం.. కొనిపిస్తాం’ అంటూ అటు కేంద్ర ప్రభుత్వం, ఇటు రాష్ట్ర ప్రభుత్వం ఒకరిపై ఒకరు దుమ్మెత్తిపోసుకుంటూ కాలయాపన చేయడం వల్లే రైతులు అకాల వర్షంతో అపార నష్టన్ని చవిచూడాల్సి వచ్చిందని కాంగ్రెస్‌ మండల నాయకులు ఆరోపించారు. ఆదివారం రాత్రి అకాలవర్షం వల్ల తడిసిన వరి ధాన్యం కుప్పలను మంగళవారం మండంలోని ఉప్లూర్‌ గ్రామంలో పరిశీలించారు. కొనుగోలు కేంద్రాలు సకాలంలో ఏర్పాటు చేసి ఉంటే రైతులకు ఈ పరిస్థితి ఎదురయ్యేది కాదని దు య్యబట్టారు. కేంద్రాల ఏర్పాటు జరిగినా.. నెలల తరబ డి తూకాలు లేక, లారీలు రాక, హమాలీల కొరత, రైస్‌మిల్లర్ల కొర్రీలతో తీవ్ర నష్టం వాటిల్లిందని, వారంలోగా కొనుగోల్ల పూర్తి చేయాలని డిమాండ్‌ చేశారు. వారిలో లో పార్టీ మండల అధ్యక్షుడు సుకెట రవి, జిల్లా నాయకుడు తిప్పిరెడ్డి శ్రీనివాస్‌, తదితరులున్నారు. 

Updated Date - 2022-05-18T06:42:07+05:30 IST