అకాల గుబులు

ABN , First Publish Date - 2022-05-27T06:27:37+05:30 IST

అకాల వర్షాలతో రైతుల్లో గుబులు నెలకొంటుంది. ఆకాశమంతా కారుమబ్బులు కమ్మేయడంతో రైతులు ఆగమాగం అవుతున్నారు. కేంద్రాల్లోని వరి ధాన్యం పంట పొలాల్లోని వరిని కాపాడుకునేందుకు రైతులు నానా తంటాలు పడుతున్నారు.

అకాల గుబులు
అకాల వర్షాల గుబులుతో ధాన్యంపై టార్పాలిన్‌లు కప్పిన రైతులు

- రైతులను భయపెడుతున్న కారుమబ్బులు

- జిల్లాలో మేఘావృతం అయిన ఆకాశం

- కొనుగోలు కేంద్రాల్లోనే వేల క్వింటాళ్ల ధాన్యం

- వర్షాలు కురిస్తే ధాన్యం తడిసిపోతుందేమోనని అన్నదాతల్లో ఆందోళన

- ఇప్పటి వరకు కొనుగోలు చేసింది 1.95లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం

- ఇప్పటికే కురిసిన అకాల వర్షాలతో పలుమార్లు తడిసిన ధాన్యం


కామారెడ్డి, మే 26(ఆంధ్రజ్యోతి): అకాల వర్షాలతో రైతుల్లో గుబులు నెలకొంటుంది. ఆకాశమంతా కారుమబ్బులు కమ్మేయడంతో రైతులు ఆగమాగం అవుతున్నారు. కేంద్రాల్లోని వరి ధాన్యం పంట పొలాల్లోని వరిని కాపాడుకునేందుకు రైతులు నానా తంటాలు పడుతున్నారు. మరోవైపు జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు మందకొడిగా సాగుతున్నాయి. కొనుగోలు కేంద్రాల్లోనే కుప్పలు తెప్పలుగా ధాన్యం రాశులు ఉండిపోతున్నాయి. కేంద్రాల వద్ద పూర్తిస్థాయిలో ధాన్యం కొనుగోలు జరగకపోవడంతో అకాల వర్షాలకు ఎక్కడ తడిసిపోతాయోనని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కేంద్రాల వద్ద ఉన్న ధాన్యాన్ని వెనువెంటే కొనుగోలు చేసి తరలించాలంటూ రైతులు డిమాండ్‌ చేస్తున్నారు. జిల్లాలో ఇప్పటి వరకు 343 కేంద్రాల్లో 1.95 లక్షల మెట్రిక్‌ టన్నుల వరకు ధాన్యం కొనుగోలు చేసినట్లు సంబంధిత శాఖ అధికారులు చెబుతున్నారు.

ఆకాశాన్ని కమ్మేసిన మబ్బులు

ప్రతీ యాసంగి సీజన్‌లో అకాల, వడగళ్ల వర్షం కురువడం సాధారణమే. సరిగ్గా వరి కోతల సమయంలోనే, ధాన్యం కొనుగోళ్ల సమయంలో వర్షం కురుస్తుండడంతో ప్రతీఏటా రైతుల ధాన్యం తడిసిపోతుండడంతో తీవ్రంగా నష్టపోతున్నారు. ఇటీవల వాతావరణంలో చోటు చేసుకుంటున్న మార్పులు ఆకాశాన్ని కారుమబ్బులు కమ్మేస్తుండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. గత 10 రోజుల కిందట జిల్లాలో అకాలవర్షాలు కురువడంతో కొనుగోలు కేంద్రాలు, పంట పొలాల్లోనే ధాన్యం తడిసిపోతుంది. కామారెడ్డి, భిక్కనూర్‌, దోమకొండ, తాడ్వాయి, రామారెడ్డి, బాన్సువాడ, నాగిరెడ్డిపేట,  ఎల్లారెడ్డి  తదితర మండలాల్లో కురుసిన అకాల వర్షాలు, వడగళ్లతో పంటలు దెబ్బతినడమే కాకుండా కేంద్రాల్లోని ధాన్యం తడిసిపోయింది. పలుమార్లు అకాల వర్షాలు కురువడంతో కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యం తడిసిపోవడంతో రైతులు పదేపదే ధాన్యాన్ని ఆరబెట్టడంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

పరుగులు తీస్తున్న రైతులు

జిల్లాలో వాతావరణం ఉన్నట్టుండి మారిపోవడంతో కేంద్రాల్లోని ధాన్యాన్ని కాపాడుకునేందుకు రైతులు పరుగులు తీస్తున్నారు. కోతకు వచ్చిన పొలాలు గాలి దుమారానికి, వర్షానికి అడ్డం పడుతాయని రాశులు ఉన్న ధాన్యం తడిస్తుందేమోనని ఆవేదన చెందుతున్నారు. ఎప్పుడు ఏ గాలి దుమారం వస్తుందోనని ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే పంటను కోసి కల్లాలు, కేంద్రాల్లో ఆరబెట్టుకున్న రైతులు కుప్పలుగా పోసి పట్టాలు పట్టుకునేందుకు ఉరుకులు పరుగులు పెడుతున్నారు. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో సరిపడా టార్పాలిన్‌లు అందుబాటులో లేకపోవడంతో తెలిసిన వారి వద్ద కొనుగోలు చేసి ధాన్యం రాశులపై కప్పుకుంటున్నారు.

1.95లక్షల మెట్రిక్‌ టన్నుల్లో  ధాన్యం కొనుగోలు

జిల్లాలోని కామారెడ్డి, ఎల్లారెడ్డి, బాన్సువాడ డివిజన్‌ల పరిధిలో గత నెలరోజుల నుంచి ధాన్యం కొనుగోళ్లు జరుగుతున్నాయి. గత 15 రోజుల నుంచి కొనుగోలు కేంద్రాలకు పెద్దఎత్తున ధాన్యాన్ని రైతులు తరలిస్తున్నారు. జిల్లాలో మొత్తం 343 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి రైతుల నుంచి ధాన్యం సేకరిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు 1,95,210 మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని 34వేల 200 మంది రైతుల నుంచి రూ.371 కోట్లు విలువ చేసే ధాన్యాన్ని కొనుగోలు చేశారు. ఇందులో ఇప్పటికే రూ.240 కోట్ల ధాన్యం డబ్బులను ఆయా రైతుల ఖాతాల్లో జమ చేశారు. కేంద్రాల్లోని ధాన్యాన్ని కొనుగోలు చేయడంలో కాస్తా జాప్యం నెలకొంటుండడంతో ధాన్యం కుప్పలు ఎక్కడికక్కడే నిలిచిపోతున్నాయి. అకాల వర్షాలు వస్తే ధాన్యం తడిసిపోతుందేమోనని రైతులు ఆందోళన చెందుతున్నారు. మరో 60వేల మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు చేసే అవకాశం ఉందని సంబంధితశాఖ అధికారులు చెబుతున్నారు.

Updated Date - 2022-05-27T06:27:37+05:30 IST