ప్రపంచాలు మూడు రకాలు. ఒకటి ఈ ప్రకృతి సృష్టించిన ప్రపంచం. అందులో ఈ విశ్వమంతా ఉంది. సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, గ్రహాలు తదితరాలు ఉన్నాయి. భూమి కూడా ఆ ప్రపంచంలోకే వస్తుంది. మరొక (రెండవ) ప్రపంచాన్ని.... ఈ భూమి మీద మనం స్వయంగా సృష్టించుకున్నాం .అందులోనే ఉంటాం, అందులోనే మీరు పరిభ్రమిస్తూ ఉంటాం, దానికి చాకిరీ చేస్తూ ఉంటాం. దాని మీదే మన నమ్మకాలన్నీ ఆధారపడి ఉంటాయి. అయితే, మూడవ ప్రపంచం కూడా ఒకటున్నది - అది మీ (స్వీయ) ప్రపంచం.
మీ ప్రపంచంలో మీకు కష్టాలు ఎదురైనప్పుడు కలిగే ఆ బాధను అనుభవించేది కేవలం మీరే. దాని ప్రభావం ఎక్కువగా ఉండేది కూడా మీపైనే. మీదైన ఆ ప్రపంచంలో కేవలం మీరు మాత్రమే ఉంటారు. అందులో మీకంటూ ఎవరూ ఉండరు. మీ భర్తయినా, భార్యయినా, పిల్లలైనా... వాళ్ళ ప్రపంచాలన్నీ వేరు వేరు. ఈ విషయం మీకు సరిగ్గా అర్థం కాకపోవచ్చు. కానీ పిల్లలు పెద్దవారై... వేరే చోట ఉంటున్న తల్లితండ్రులకు ఇది చాలా స్పష్టంగా తెలుస్తుంది.
ఇక, మన ముందున్నది బాహ్య ప్రపంచం. దానిలో మీకు ధనం ఉండాలనీ, పేరు ప్రతిష్టలు ఉండాలనీ కోరుకుంటారు. అన్నీ ఉండడం ఎంతో అవసరం అనుకుంటారు. అయితే మీ వ్యక్తిగత ప్రపంచంలో మీకు ఉండాల్సినదేమిటి? అందులో మీ అవసరాలేమిటి? మీ వ్యక్తిగత ప్రపంచంలో మీకు ఏదైతే అవసరమో, దాని అవసరం బాహ్యప్రపంచానికి ఏమాత్రం ఉండదు. అయితే, మీకు వ్యక్తిగతంగా ఏది అవసరమో అదే జీవితంలో కీలకం అవుతుంది.
మనిషి తన జీవితంలో ఆత్మజ్ఞానం విలువను సరిగ్గా అర్థం చేసుకోనంత కాలం... మతి చెడినట్టు తిరుగుతూ ఉంటాడు. ఎందుకంటే ఈ బాహ్య ప్రపంచం ఒక మాయ. అది మిమ్మల్ని బొంగరంలా ఆడిస్తూ ఉంటుంది. ఏదేదో చేయమంటుంది. మిమ్మల్ని ఇప్రశాంతంగా ఉండనివ్వదు. జీవితంలో మీకు ప్రశాంతత కావాలంటే... మీ ప్రపంచంలో మీకు శాంతి చేకూరాలి. మీకు శాంతి లభ్యం కావడం సాధ్యమే! దాని కోసం మీరు కళ్ళు తెరవాలి. మీ ప్రపంచంలో మీకు లభించినది ఏమిటో గమనించండి. మీ దగ్గర ఉన్నవాటి కన్నా గొప్పవీ, పెద్దవి కావాలని మీరు కలలు కంటారు. కానీ, ప్రస్తుతం భగవంతుడు మీకు దేన్నయితే ప్రసాదించాడో దాన్ని ఏనాడైనా గుర్తించారా? అలా గుర్తించినప్పుడు... అవధులు లేని ఆనందానుభూతిని మీరు నిరంతరంగా పొందుతారు.
మనకు లభ్యమైన శరీరం మన కోరికలకు అనుగుణమైన రూపు రేఖలతో లేకపోయినా... అది దాని కర్తవ్యాన్ని నెరవేరుస్తుంది. అదే దాని గొప్పతనం. మీరు ధనవంతులైనా, పేదలైనా, గొప్పవారైనా, సామాన్యులైనా, బాగా చదివినవారైనా, ఏది చదువుకోకపోయినా... మీరు ఎలా ఉన్నా ‘శరీరం’ అనే ఈ యంత్రంతోనే పరమానందానుభూతిని పొందగలరు. మీలో ఉన్న భగవంతుణ్ణి తెలుసుకోగలరు. ఈ రోజు మీరు ఈ ప్రపంచంలో ఉన్నారు. కానీ ఎప్పుడో ఒకప్పుడు ఇక్కడి నుంచి వెళ్ళిపోవలసిందే! ఎక్కడికి వెళ్తారనేది ఎవరికీ తెలీదు. కాబట్టి మీ ప్రపంచంలో మీరు శాంతి స్థాపించుకోండి. అందులోనే మీరు ఆ పరమానందానుభవాన్ని పొందండి. అలా చేసుకోగలిగితే... మీరు అన్నీ చేసినట్టే. లేదంటే మీ ముఖం మీద కనిపించే చిరునవ్వులన్నీ కేవలం కపట నాటకాలే. మీరు ప్రపంచం కోసం చిరునవ్వులు చిందిస్తున్నారు కానీ... అది మీ లోపలి నుంచి వస్తున్నది కాదు. కనుక... మీకు లభించిన ఈ జీవితం తాలూకు పరిపూర్ణ ప్రయోజనాన్ని తప్పనిసరిగా పొందండి. మీ ఆవశ్యకతను మీరు గుర్తించండి.
ప్రేమ్ రావత్