దారుణం: సీమంతం తరువాత.. గర్భవతి తల, కడుపుపై కాల్పులు జరపడంతో..

ABN , First Publish Date - 2021-11-22T03:09:19+05:30 IST

ఆమె తన సీమంతం వేడుక నుంచి అప్పుడే ఇంటికి వచ్చింది. స్నేహితులు, బంధువులు ఇచ్చిన బహుమతులు తీసుకుని ఇంట్లోకి అడుగుపెట్టబోతుండగా జరిగిందో దారుణం.

దారుణం: సీమంతం తరువాత.. గర్భవతి తల, కడుపుపై కాల్పులు జరపడంతో..

ఇంటర్నెట్ డెస్క్: ఆమె తన సీమంతం వేడుక నుంచి అప్పుడే ఇంటికి వచ్చింది. స్నేహితులు, బంధువులు ఇచ్చిన బహుమతులు తీసుకుని ఇంట్లోకి అడుగుపెట్టబోతుండగా జరిగిందో దారుణం. ఆమె వెనక నుంచి హటాత్తుగా వచ్చిన నిందితుడు మహిళ తల, కడుపుపై పలు మార్లు కాల్పులు జరపడంతో ఆమె అక్కడిక్కడే కుప్పకూలిపోయింది. బాధితురాలిని ఆస్పత్రికి తరలించినా ఉపయోగం లేకపోయింది. క్షణాల వ్యవధిలో మహిళ, గర్భస్థ శిశువు మృతి చెందారు. అమెరికాలోని ఫిలడెల్ఫియా రాష్ట్రంలో శనివారం ఈ దారుణం జరిగింది. 


పాల్మెటో స్ట్రీట్‌లో రాత్రి 8.30 గంటల సమయంలో ఈ దారుణం జరిగింది. బాధిత మహిళ 7 నెలల గర్భవతి అని పోలీసులు తెలిపారు. గస్తీలో ఉన్న ఓ పోలీసు ఆఫీసర్ కాల్పుల శబ్దం విన్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని, అత్యవసర సిబ్బందికి సమాచారం అందించారు. కాల్పులు జరిపిన వ్యక్తి అప్పటికే పరారైపోయాడు. బాధితురాలిని అరగంటలోపే ఆస్పత్రికి తరలించినా ఉపయోగం లేకపోయింది. ‘‘ఈ దారుణానికి పాల్పడ్డ నిందితుడి వంటి పిరికపంద మరొకడు ఉండడు’’ అంటూ స్థానిక పోలీస్ ఉన్నాతాధికారి ఆవేదన వ్యక్తం చేశారు.


ఇటువంటి నేరాలు తరచూ వెలుగులోకి వస్తుండటంతో స్థానికులు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తక్షణం నివారణ చర్యలు చేపట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. కాగా.. ఈ ఘటన వెనకున్నది ఒక్కరా లేక పలువురా అన్న విషయంపై స్పష్టత లేదు. అయితే.. కావాలనే సదరు మహిళను టార్గెట్ చేసుకున్నారనే అంచనాకు పోలీసులు వచ్చారు. ఈ దారుణానికి బాధ్యులైన వారి కోసం విస్తృతంగా గాలిస్తున్నారు. 

Updated Date - 2021-11-22T03:09:19+05:30 IST