Advertisement
Advertisement
Latest Telugu News
Advertisement
Published: Fri, 28 Jan 2022 23:06:59 IST

యువతకు ప్రాధాన్యం

twitter-iconwatsapp-iconfb-icon
యువతకు ప్రాధాన్యంకొత్త ప్రభాకర్‌ రెడ్డి

పార్టీ కమిటీల్లో వారికే పెద్దపీట

సీఎం కేసీఆర్‌, మంత్రి హరీశ్‌రావు సూచనలతో ముందుకు

పూర్తిస్థాయి కార్యకర్తగా అందుబాటులో ఉంటా

ఆంధ్రజ్యోతితో టీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు, ఎంపీ కేపీఆర్‌


ఆంధ్రజ్యోతి ప్రతినిధి, సిద్దిపేట, జనవరి 28: ‘తెలంగాణ మలిదశ ఉద్యమంలో కేసీఆర్‌ మడమ తిప్పని పోరాటానికి విద్యార్థులు, యువత వెన్నంటి నిలిచారు. నేడు బంగారు తెలంగాణ సాధనలోనూ విద్యార్థులు, యువత కీలకం. అందుకే టీఆర్‌ఎస్‌ కమిటీల్లో యువతకు అధిక ప్రాధాన్యత కల్పిస్తాం. పార్టీలోనే కాకుండా పారిశ్రామికంగా, ప్రభుత్వపరంగా అనేక ఉపాధి అవకాశాలు వారి ముందున్నాయి. యువతతోపాటు సీఎం కేసీఆర్‌, మంత్రి హరీశ్‌రావు, పార్టీ నేతలు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తల సూచనలతో ముందుకెళ్తాను’ అని ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి తన ఆలోచనలను పంచుకున్నారు. సిద్దిపేట జిల్లా టీఆర్‌ఎస్‌ తొలి అధ్యక్షుడిగా నియమితులైన సందర్భంగా ఆయన ‘ఆంధ్రజ్యోతి’తో ముచ్చటించారు.  


పార్టీ జిల్లా అధ్యక్ష పదవి వస్తుందని ఊహించారా?

తెలంగాణ ఉద్యమంలో పాల్గొనేందుకే టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరాను. ఎప్పుడూ పదవుల గురించి ఆలోచించలేదు. 2014 ఉప ఎన్నికలో నాయకుడు కేసీఆర్‌ మెదక్‌ ఎంపీగా బరిలోకి దింపారు. ఆయన నమ్మకాన్ని వమ్ముచేయకుండా ప్రజాక్షేత్రంలో నిలిచాను. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకోవడంతో రెండోసారి కూడా భారీ మెజార్టీతో గెలిపించారు. పార్టీ అధినేత నా పనితీరును గుర్తించి లోకసభలో పార్టీ ఉపనేతగా నియమించారు. ఇప్పుడు పార్టీ జిల్లా అధ్యక్షుడిగా అవకాశం ఇచ్చారు. టీఆర్‌ఎస్‌ పార్టీలో కరడుగట్టిన కార్యకర్తగా, నిబద్దత కలిగిన సైనికుడిలా 24 గంటల పాటు శ్రమించడానికి సిద్ధంగా ఉన్నా నాయకుడు అప్పగించిన బాధ్యతను సమర్థవంతంగా నెరవేర్చడానికి కృషిచేస్తా. 


సంస్థాగత కమిటీలను పూర్తిస్థాయిలో ఏర్పాటు చేయలేదేం?

గ్రామ స్థాయిల్లో దాదాపు పార్టీ కమిటీలు పూర్తయ్యాయి. విద్యార్థి, మహిళా, యూత్‌, సోషల్‌ మీడియా, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ విభాగాల కమిటీల ఏర్పాటు పూర్తయ్యింది. కొన్ని మండలాల అధ్యక్షుల ఎంపిక జరిగింది. పూర్తిస్థాయి కమిటీలను నియమించాల్సి ఉన్నది. అదేవిధంగా జిల్లా ప్రధాన కమిటీ, అనుబంధ విభాగాల జిల్లా కమిటీల నియామకంపై ముఖ్యనేతల సూచనల మేరకు నిర్ణయం తీసుకుంటాం. పక్షం రోజుల్లో అన్ని కమిటీల ఎంపిక పూర్తిచేస్తాం. పార్టీలో క్రియాశీలకంగా పనిచేసే ప్రతీ కార్యకర్తకు కమిటీల్లో ప్రాధాన్యత కల్పిస్తాం. 


ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా నిరసనలు, ఆందోళనలు జరుగుతున్నాయి. వీటిని ఎలా ఎదుర్కొంటారు?

ప్రజలకు ఉపయోగపడే విధంగానే ప్రభుత్వ విధానాలు ఉన్నాయి. ప్రతిపక్షాలు ఉనికి కోసం విష ప్రచారం చేస్తున్నాయి. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వాన్ని, పార్టీని విమర్శిస్తే ప్రజల్లో చులకన కావడం తప్ప సాధించేదేమీ ఉండదు. ప్రాణాలు అడ్డుపెట్టి తెలంగాణ తెచ్చిన కేసీఆర్‌కు తెలంగాణ    ప్రజల సంక్షేమంపై ప్రత్యేక విజన్‌ ఉంది. దేశంలోనే ఆదర్శవంతమైన       రాష్ట్రంగా తీర్చిదిద్దారు. ప్రతీ పథకం ఓ రోల్‌మోడల్‌గా నిలుస్తున్నది. రాష్ట్రాభివృద్ధిపై సీఎం కేసీఆర్‌ నిబద్దతను చూసి 2018 ఎన్నికల్లో భారీ మెజార్టీ కట్టబెట్టారు. వచ్చే ఎన్నికల్లోనూ ఇదే పునరావృతం అవుతుంది. ప్రతిపక్షాల డ్రామాలను ప్రజలు నమ్మబోరు.


టీఆర్‌ఎస్‌ తొలి జిల్లా అధ్యక్షుడిగా మీ లక్ష్యం ఏమిటి?

తెలంగాణ రాష్ట్ర సమితికి సిద్దిపేట జిల్లా పురిటిగడ్డ. సీఎం కేసీఆర్‌, మంత్రి హరీశ్‌రావుల కృషితో పార్టీ క్షేత్రస్థాయిలో గడపగడపనా విస్తరించింది. ఎంపీగా జిల్లా నలుమూలలా కార్యకర్తలు, నాయకులతో పరిచయాలు, నేతలతో సత్సంబంధాలు ఉన్నాయి. అందరిని సమన్వయం చేసుకుంటూ పార్టీని మరింత బలోపేతం చేస్తా. ప్రతిపక్షాల తప్పుడు ప్రచారాలను ఎండగడతా. సోషల్‌ మీడియా, మీడియా, యువత ద్వారా ప్రభుత్వ పథకాలను ఇంటింటికి చేరవేస్తా. చేసిన పనులను చెబుతా. కళ్లముందున్న అభివృద్ధిని గుర్తుచేస్తా. పూర్తిస్థాయి కార్యకర్తగా అందరికీ అందుబాటులో ఉంటా. 

Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
OpinionPoll
Advertisement
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.