పర్యటనల జోరు!

ABN , First Publish Date - 2022-05-27T04:41:40+05:30 IST

పర్యటనల జోరు!

పర్యటనల జోరు!
దళ్లవలసలో చంద్రబాబుకు నీరాజనం పలుకుతున్న దృశ్యం (ఫైల్‌)

- జిల్లాలో వేడెక్కుతున్న రాజకీయం

- ఎన్నికలకు ముందే హోరెత్తుతున్న ప్రచారం

- గ్రామాల బాట పడుతున్న నేతలు

- ‘బాదుడే బాదుడు’ పేరిట టీడీపీ నిరసనలు

- ప్రభుత్వ వైఫలాలే లక్ష్యంగా ముందుకు..

- ‘గడపగడపకూ మన ప్రభుత్వం’తో ప్రజల వద్దకు వైసీపీ శ్రేణులు

(శ్రీకాకుళం,ఆంధ్రజ్యోతి)

జిల్లాలో రాజకీయం వేడెక్కుతోంది. వైసీపీ అధికారంలోకి వచ్చి మూడేళ్లు పూర్తయింది. సార్వత్రిక ఎన్నికలకు మరో రెండేళ్ల సమయమే ఉంది. ఈ నేపథ్యంలో ప్రధాన రాజకీయ పార్టీలు జోరు పెంచాయి. వైసీపీ మూడేళ్ల పాలనలో లోపాలను ప్రజల దృష్టికి తీసుకెళ్లి.. రానున్న ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా టీడీపీ అడుగులు వేస్తోంది. అన్నింటా ధరల భారం, పన్నుల పెంపును నిరసిస్తూ.. ‘బాదుడే బాదుడు’  కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఈ క్రమంలో ఇటీవల టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబునాయుడు కూడా జిల్లాకు విచ్చేశారు. పొందూరు మండలం దళ్లవలసలో పర్యటించారు. వైసీపీ పాలనపై పోరాడాలని ప్రజలకు పిలుపునిచ్చారు. చైతన్యానికి స్ఫూర్తిగా నిలిచిన సిక్కోలు నుంచే ఉద్యమించాలని టీడీపీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. పార్టీ శ్రేణుల్లో నూతనోత్తేజం నింపారు. ఈ నేపథ్యంలో టీడీపీ నేతలు, కార్యకర్తలు గ్రామాల్లో పర్యటిస్తున్నారు. వైసీపీ పాలనను వ్యతిరేకిస్తూ నిరసన ర్యాలీలు చేపడుతున్నారు. వైసీపీకి ఒక్క అవకాశం ఇస్తే రాష్ట్రం అధోగతి పాలైందని.. రానున్న ఎన్నికల్లో టీడీపీని ఆదరించాలని కోరుతున్నారు. మరోవైపు మళ్లీ అధికారం కోసం వైసీపీ ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా ‘గడప గడపకూ మన ప్రభుత్వం’ పేరిట గ్రామాల్లో పర్యటించాలని నేతలకు అధిష్ఠానం ఆదేశించింది. వైసీపీని మళ్లీ ఆదరించేలా లబ్ధిదారులకు ప్రభుత్వ పథకాల గురించి వివరించాలని స్పష్టం చేసింది. ఈ మేరకు వైసీపీ నేతలు గ్రామాల్లో పర్యటిస్తున్నారు. తాజాగా జిల్లా నుంచే ‘సామాజిక న్యాయభేరి బస్సుయాత్ర’కు మంత్రులు శ్రీకారం చుట్టారు. మరోవైపు బీజేపీ కూడా కాస్త జోరు పెంచింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఇప్పటికే జిల్లాకు రెండుసార్లు వచ్చారు. ముఖ్యమంత్రి జగన్‌ లక్ష్యంగా విమర్శలు చేశారు.  


ప్రభుత్వ తప్పిదాలే.. టీడీపీ లక్ష్యం

మూడేళ్ల కిందట జిల్లాలో భవన నిర్మాణ రంగం కళకళలాడేది. ప్రస్తుతం ఇసుక కొరత, నిర్మాణ సామగ్రి ధరలు పెరగడంతో భవన నిర్మాణ రంగానికి ఆదరణ తగ్గింది. మరోవైపు వైసీపీ పాలనలో నిత్యావసర వస్తువుల ధరలు భారీగా పెరిగాయి. విద్యుత్‌ బిల్లులు కూడా మూడేళ్లలో ఏడుసార్లు పెంచేశారు. ఆర్టీసీ చార్జీలు కూడా పెరిగాయి. పెట్రోల్‌, డీజిల్‌, గ్యాస్‌పై కేంద్రం వ్యాట్‌ తగ్గిస్తున్నా.. రాష్ట్రం మాత్రం తగ్గించడం లేదు. క్షేత్రస్థాయిలో సమస్యలను అధికారపార్టీ నాయకులు పట్టించుకున్న దాఖలాలు లేవు. దీంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. పాదయాత్ర సమయంలో ప్రతిపక్ష నేతగా వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి.. టీడీపీ హయాంలో ధరల ప్రభావంపై ‘బాదుడే బాదుడు’ అని విమర్శించారు. ఇప్పుడు అదే నినాదంతో టీడీపీ నిరసనలు చేపడుతోంది. టీడీపీ హయాంలోనూ, ప్రస్తుత వైసీపీ పాలనలో ధరల్లో ఉన్న వ్యత్యాసాలను ప్రజలకు వివరిస్తోంది.  2019 ఎన్నికల్లో ఓట్లపరంగా నష్టం వాటిల్లిన ప్రాంతాల్లో టీడీపీ నేతలు, కార్యకర్తలు మరింత పకడ్బందీగాపర్యటిస్తున్నారు. ‘గడప గడపకూ’ కార్యక్రమంలో అధికారులకు నిలదీతలు ఎదురవడంతో.. దానిని టీడీపీ నాయకులు అనుకూలంగా మార్చుకుని ముందుకు సాగుతున్నారు. గత ఎన్నికల్లో ఓటమికి గల కారణాలు, ప్రస్తుత ప్రభుత్వ లోపాలు, జిల్లాకు సీఎం జగన్‌ ఇచ్చిన హామీలపై టీడీపీ నేతలు విశ్లేషణ చేస్తున్నారు. కొనసాగని ప్రాజెక్టులపై ఆరా తీస్తూ.. ప్రభుత్వ అసమర్థతను వివరించే పనిలో నిమగ్నమయ్యారు. 


నవరత్నాలు రావంటూ ముందస్తు ప్రచారం

‘గడప గడపకూ’ కార్యక్రమంలో కొన్నిచోట్ల వైసీపీ నేతలకు నిలదీతలు ఎదురవుతున్నాయి. ఈ నేపథ్యంలో నేతలు వ్యూహం మార్చారు. ముందుగానే లబ్ధిదారుల వివరాలు సేకరిస్తున్నారు. నవరత్నాలలో ‘మీ కుటుంబానికి ఫలానా పథకం వర్తించింది’ అని వివరిస్తూ.. తమ ప్రభుత్వం వల్లనే ఇది సాధ్యమైందని చెబుతున్నారు. టీడీపీ అధికారంలోకి వస్తే.. నవరత్నాలు పథకాలు నిలిపివేస్తారని.. అప్పుడు మీకు అమ్మఒడి, రైతుభరోసా ఇతరత్రా పథకాల ద్వారా లబ్ధి ఉండదని ప్రచారం చేస్తున్నారు. కొంతమంది సీనియర్‌ నేతలు సైతం ఇటువంటి ప్రచారాలు చేయడం చర్చనీయాంశమవుతోంది. ఎన్నికలకు సమయం ఉండగానే.. టీడీపీ అధికారంలోకి వస్తే పథకాలు నిలిచిపోతాయనడం విడ్డూరంగా ఉందని పలువురు విమర్శిస్తున్నారు. ఇదిలా ఉండగా.. గుట్టుగా సర్వేల ఆధారంగా నాయకుల పనితీరును వైసీపీ అధిష్ఠానం బేరీజు వేస్తున్నట్లు తెలుస్తోంది.  ‘గడపగడపకూ మన ప్రభుత్వం’లో నిరసనలు ఎక్కువగా ఉన్న నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల పనితీరు... ఇతరత్రా అంశాలను ఆరా తీస్తున్నట్లు సమాచారం. అలాగే ఇటీవల జిల్లాకు చెందిన ఓ మహిళా నేతను రాజ్యసభకు పంపుతారని ఆశ చూపి.. నిరాశ మిగిల్చారు. ఈ నేపథ్యం ఆ సామాజికవర్గ ప్రజలు పార్టీకి దూరం కాకుండా వైసీపీ అధిష్ఠానం ప్రత్యేక కార్యాచరణ రూపొందించనున్నట్టు సమాచారం. 

Updated Date - 2022-05-27T04:41:40+05:30 IST