చర్మం చుర్రు... చుర్రు!

ABN , First Publish Date - 2021-02-16T17:38:44+05:30 IST

వేసవి వచ్చేసింది. దీని ప్రతాపం, ప్రభావం ప్రధానంగా చర్మం మీదే ఎక్కువ. క్రమేపీ పెరుగుతున్న ఎండలకు తగ్గట్టుగా చర్మాన్ని పరిరక్షించుకునే జాగ్రత్తలు పాటిద్దాం!

చర్మం చుర్రు... చుర్రు!

ఆంధ్రజ్యోతి(16-02-2021)

వేసవి వచ్చేసింది. దీని ప్రతాపం, ప్రభావం ప్రధానంగా చర్మం మీదే ఎక్కువ. క్రమేపీ పెరుగుతున్న ఎండలకు తగ్గట్టుగా చర్మాన్ని పరిరక్షించుకునే జాగ్రత్తలు పాటిద్దాం!


వేసవిలో ఎండలో తిరగకుండా నీడపట్టున ఉంటే సన్‌ట్యాన్‌ నుంచి తప్పించుకోవచ్చు అనుకుంటాం. గొడుగులు, స్కార్ఫ్‌లు వాడితే చాలు ఎండ ప్రభావం పడకుండా చూసుకోవచ్చు అనీ అనుకుంటాం. కానీ   ఇంతకుమించి అదనపు జాగ్రత్తలు పాటించినప్పుడే వేసవి వెతల నుంచి చర్మాన్ని కాపాడుకోవచ్చు. చర్మ తత్వానికి తగ్గట్టు, వాతావరణంలో తేమకు తగ్గట్టు సన్‌స్ర్కీన్‌, మాయిశ్చరైజర్లు తప్పనిసరిగా ఉపయోగించాలి. 


స్కిన్‌ ఫుడ్‌

చర్మం నుంచి ఆవిరయ్యే నీటిని ఎప్పటికప్పుడు భర్తీ చేయగలిగితేనే చర్మం మృదువుగా, తాజాగా, ఆరోగ్యంగా ఉంటుంది. కాబట్టి ఈ సమయంలో పెరిగే వేడి వాతావరణానికి తగ్గట్టు చర్మాన్ని ఆహారంతో సిద్ధం చేయాలి. ఇందుకోసం పగటివేళ నీరు ఎక్కువగా ఉండే పుచ్చ, బత్తాయి, తర్బూజా లాంటి పళ్లు తినాలి. రాత్రివేళ ఆకుకూరలు, బీరకాయ, సొరకాయ లాంటి కూరగాయలు ఎక్కువగా తినాలి. క్యారెట్‌ ప్రతి రోజూ వంటల్లో లేదా జ్యూస్‌ రూపంలో తీసుకుంటూ ఉండాలి. చర్మానికి సరిపడా పోషకాలు అందడం కోసం మొలకలు తింటూ ఉండాలి. దానిమ్మ, పైనాపిల్‌ రసాలు చర్మానికి మేలు చేస్తాయి. అయితే ఇతర పళ్ల రసాలు కూడా తాగవచ్చు. అయితే తాజాగా తయారుచేసిన పళ్లరసాలతో ప్రయోజనం ఉంటుంది. 


విరుద్ధ వాతావరణం

పగలు వేడి, రాత్రి చలి... ఇలాంటి విరుద్ధమైన వాతావరణంలో ఉన్నాం. చలికాలం నుంచి ఎండాకాలంలోకి అడుగు పెడుతున్నా, చలి కాలంలో చర్మం పొడిబారినట్టే ఈ సమయంలో కూడా పొడిబారుతూ ఉంటుంది. ఉదయం వేళల్లో, రాత్రి వేళల్లో చల్లని గాలుల ప్రభావం నుంచి చర్మాన్ని పొడిబారకుండా కాపాడుకోవాలంటే తప్పనిసరిగా రాత్రి వేళల్లో, థిక్‌ బేస్‌డ్‌ మాయిశ్చరైజర్లు మరికొంత కాలం పాటు కొనసాగించాలి. అలాగే స్నానానికి మాయిశ్చరైజింగ్‌ సబ్బులు వాడుకోవాలి. వేసవిలోకి అడుగు పెట్టాం కాబట్టి చర్మాన్ని పొడిబార్చే లెమన్‌ బేస్‌డ్‌, ఘాటైన సువాసనలు కలిగి ఉండే బాడీ వాష్‌లు, సబ్బులు వాడకూడదు. ఉదయం వేళల్లో కూడా చర్మం పొడిబారినట్టు అనిపిస్తే, మాయిశ్చరైజర్‌ అప్లై చేసుకుని, దాని పైన సన్‌స్ర్కీన్‌ వాడుకోవాలి. ఎండలు పెరిగేకొద్దీ మాయిశ్చరైజర్‌ వాడకం తగ్గించి సన్‌స్ర్కీన్‌ ఒక్కటీ అప్లై చేసుకోవడం మొదలుపెట్టాలి.


యాంటీ ఏజింగ్‌ క్రీమ్స్‌, మొటిమలు తగ్గడం కోసం పింపుల్‌ క్రీమ్స్‌ వాడేవాళ్లు రెట్టింపు జాగ్రత్తగా ఉండాలి. ఏ కోవకు చెందినవాళ్లు క్రీమ్స్‌ వాడే సమయాన్ని తగ్గించుకోవాలి. వీటిని ముఖానికి పూసుకునే ముందు పైపూతగా మొదట మాయిశ్చరైజర్‌ అప్లై చేసుకోవాలి. కొలెస్ట్రాల్‌ తగ్గించే మాత్రలు వాడేవారి చర్మం తేలికగా పొడిబారుతుంది. కాబట్టి వీరికి అదనపు మాయిశ్చరైజర్లు అవసరం. అలాగే అలర్జీతో కూడిన అటోపిక్‌ డెర్మటైటిస్‌ ఉన్నవారు కూడా వైద్యులు సూచించే మాయిశ్చరైజర్లు ఈ సమయంలో వాడుకోవాలి.


పిల్లలకూ సన్‌స్ర్కీన్స్‌

ఈ కాలంలో పిల్లలు ఆరుబయట ఎక్కువగా ఆడుతూ ఉంటారు. ఎండ ప్రభవానికి గురవకుండా కెమికల్‌ కాంపొనెంట్లకు బదులుగా ఫిజికల్‌ కాంపొనెంట్లతో తయారైన ప్రత్యేకమైన సన్‌స్ర్కీన్స్‌ పిల్లల కోసం తయారవుతున్నాయి. వీటిని పిల్లలకు వాడాలి. ఎటువంటి దుష్ప్రభావాలు లేని ఈ సన్‌స్ర్కీన్స్‌ను పిల్లల ముఖం, మెడ, చేతులు... ఇలా ఎండ సోకే ప్రదేశాల్లో అప్లై చేయాలి.


మేకప్‌ ఇలా...

హైల్యురోనిక్‌ యాసిడ్‌ బేస్‌డ్‌, సెరమైడ్‌ బేస్‌డ్‌ సీరమ్స్‌, క్రీమ్స్‌ ముఖ చర్మం మీద అప్లై చేసిన తర్వాత మాత్రమే సౌందర్య సాధనాలు వాడుకోవాలి. ఇలా చేయడం ద్వారా మేకప్‌ ప్రొడక్ట్స్‌తో చర్మానికి హాని కలగకుండా చూసుకోవచ్చు. అలాగే పగలంతా మేకప్‌తో గడిపేవారు రాత్రి పడుకునే ముందు తప్పనిసరిగా మేకప్‌ను తొలగించుకున్న తర్వాతే నిద్రకు ఉపక్రమించాలి. మేకప్‌ తొలగించడానికి మన్నికైన క్లీన్సింగ్‌ మిల్క్‌ ఎంచుకోవాలి. ఐ మేకప్‌ తొలగించడానికి అందుకోసం ఉద్దేశించిన ప్రత్యేకమైన క్రీమ్స్‌ ఉపయోగించాలి. మేకప్‌ ఆనవాళ్లు ముఖ చర్మం మీద మిగిలిపోతే మొటిమలు తలెత్తే ప్రమాదం ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా వ్యవహరించాలి.


చక్కెరతో చర్మానికి చేటు

చక్కెరతో శరీరంలో అడ్వాన్స్‌డ్‌ గ్లైకొలేషన్‌ ప్రొడక్ట్స్‌ తయారవుతాయి. వీటి ప్రభావంతో చర్మం అడుగున ఉండే కొల్లాజెన్‌ తేలికగా విరిగిపోయి, చర్మం మీద ముడతలు త్వరగా, తేలికగా ఏర్పడతాయి. దాంతో చిన్న వయసు నుంచే చర్మపు ఏజింగ్‌ ప్రక్రియ పెరుగుతుంది. ఇలా జరగకుండా ఉండాలంటే చక్కెరతో తయారైన పదార్థాలు, శీతల పానీయాలను వీలైనంత పరిమితంగా తీసుకోవాలి. చక్కెర రహస్యంగా దాగి ఉండే ప్యాకేజ్‌డ్‌ ఫుడ్‌లకూ దూరంగా ఉండాలి. సహజసిద్ధ తేనె, బెల్లం, ఆర్టిఫిషియల్‌ షుగర్స్‌తో కూడా అంతే సమానమైన ప్రభావం ఉంటుంది. కాబట్టి వీటిని కూడా పరిమితంగానే తీసుకోవాలి.


మాస్క్‌లు వాడుతున్నారా?

ఎలాంటి మాస్క్‌లు వాడుతున్నాం అనే దాని కంటే ఎంత శుభ్రంగా వాటిని వాడుకుంటున్నాం? అనేది ముఖ్యం. ఫేస్‌ మాస్క్‌ను అదే పనిగా వారం రోజులు వాడి, ఆ తర్వాత ఉతికేస్తూ ఉంటారు. ఇది సరి కాదు. ప్రతి రోజూ వీటిని శుభ్రం చేసుకోక తప్పదు. అన్ని రకాల మెటీరియల్స్‌తో తయారయ్యే మాస్కులన్నింటికీ ఈ నియమం వర్తిస్తుంది. ఎన్‌95 మాస్క్‌ కేవలం నాలుగు సార్లు ఉపయోగించడానికి మాత్రమే ఉద్దేశించినది. ఆ తర్వాత నాలుగు రోజుల పాటు దాన్ని వాడకుండా పక్కన పెట్టి, నాలుగు రోజుల తర్వాత తిరిగి వాడుకోవాలి. అలా వాడకుండా ఉంచిన సమయంలో ఆ మాస్క్‌కు ఉన్న యాంటీబ్యాక్టీరియల్‌ గుణాల కారణంగా తిరిగి మరో నాలుగు రోజులు వాడుకోవడానికి అది సిద్ధమవుతుంది.


మిగతా మాస్క్‌లను సున్నితమైన సబ్బు నీటితో మాత్రమే శుభ్ర చేసుకోవాలి. ఘాటైన సబ్బులు, వాషింగ్‌ పౌడర్లు వాడడం సరికాదు. కాటన్‌ బేస్‌డ్‌ మాస్క్‌లతో చర్మానికి ఎటువంటి హానీ కలగదు. కాబట్టి వీటినే ఎంచుకోవడం మేలు. మాస్క్‌ రోజంతా ధరించేవారు ముక్కు దగ్గరి చర్మం గీసుకుపోకుండా, మెత్తని టిష్యూ పేపర్‌ను మాస్క్‌ ముక్కుకు తగిలే భాగంలో ఉంచి, దాని పైన మాస్క్‌ ధరించాలి. మాస్క్‌ వాడకంతో మొటిమల సమస్య ఎదుర్కొనేవారు సాలిసిలిక్‌ యాసిడ్‌తో తయారైన క్రీమ్‌ రాత్రివేళ వాడుకోవాలి.


సన్‌స్ర్కీన్స్‌ వాడకం ఇలా...

20 ఏళ్ల మొదలు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా సన్‌స్ర్కీన్స్‌ వాడాలి. ఈ వయసు వాళ్లు 30 నుంచి 50 ఎస్‌పిఎఫ్‌ కలిగిన సన్‌స్ర్కీన్స్‌ వాడుకోవాలి. పిగ్మెంటేషన్‌ సమస్య కలిగినవాళ్లు ఫౌండేషన్‌ బేస్‌డ్‌ సన్‌స్ర్కీన్స్‌ వాడుకోవాలి. విపరీతమైన పొడిచర్మం కలిగినవాళ్లు మాయిశ్చరైజర్‌ కలిసిన సన్‌స్ర్కీన్‌ ఎంచుకోవాలి. జిడ్డు చర్మం కలిగినవాళ్లు జెల్‌ బేస్‌డ్‌ లేదా మ్యాట్‌ ఫినిష్‌డ్‌ సన్‌స్ర్కీన్స్‌ వాడుకోవచ్చు. అలాగే ఎండలోకి వెళ్లే పావు గంట ముందు సన్‌స్ర్కీన్‌ అప్లై చేసుకోవాలి. రోజు పొడవునా ప్రతి నాలుగు గంటలకు ఒకసారి సన్‌స్ర్కీన్‌ అప్లై చేస్తూనే ఉండాలి. అప్పుడే సన్‌ట్యాన్‌ నుంచి రక్షణ దక్కుతుంది. లిక్విడ్‌ బేస్‌డ్‌ సన్‌స్ర్కీన్‌ అయితే ఒక టీస్పూన్‌ పరిమాణంలో ముఖం మొత్తం పరుచుకునేలా అప్లై చేసుకోవాలి. క్రీమ్‌ బేస్‌డ్ అయితే వేలి బొటనవేలి మీద సరిపడేటంత వాడుకోవాలి.


గ్లిజరిన్‌, సెరమైడ్‌, ఆలొవేరా, హైడ్రాలిక్‌ యాసిడ్‌, ఒమేగా ఫ్యాటీ యాసిడ్‌ కలిగిఉండే సన్‌స్కీన్స్‌, మాయిశ్చరైజర్లు ఈ కాలంలో ఉత్తమమైనవి. 


డాక్టర్‌ స్వప్న ప్రియ

కన్సల్టెంట్‌ డెర్మటాలజిస్ట్‌,

కేర్‌ హాస్పిటల్స్‌, 

బంజారాహిల్స్‌, హైదరాబాద్‌.

Updated Date - 2021-02-16T17:38:44+05:30 IST