Advertisement
Advertisement
Latest Telugu News
Advertisement
Published: Tue, 29 Mar 2022 15:17:42 IST

వేసవి ప్రభావానికి గురవకుండా పాటించాల్సిన జాగ్రత్తలు!

twitter-iconwatsapp-iconfb-icon
వేసవి ప్రభావానికి గురవకుండా పాటించాల్సిన జాగ్రత్తలు!

ఆంధ్రజ్యోతి(29-03-2022)

సోడియం, పొటాషియం, క్లోరైడ్‌... ఇవి ప్రయోగశాలల్లోనే కాదు. మన శరీరాల్లో కూడా ఉంటాయి. వేసవిలో ఈ ఎలక్ర్టొలైట్లలో ఏర్పడే తరుగు మీద ఓ కన్నేసి ఉంచడంతో పాటు వాడుతున్న మందులు, వాటి మోతాదుల విషయంలో వైద్యుల సూచనలనే పరిగణించాలి. 


వేసవి వేడిమిని తట్టుకోవాలంటే ఒంట్లో నీళ్లు తగ్గిపోకుండా చూసుకోవడంతో పాటు ఎండ దెబ్బ నుంచి రక్షణ కల్పించే అలవాట్లను అలవరుచుకోవాలి. మరీ ముఖ్యంగా కొవిడ్‌ నుంచి కోలుకున్నప్పటికీ పూర్తిగా ఆరోగ్యాన్ని పుంజుకోని వాళ్లూ, మధుమేహం, అధిక రక్తపోటు, ఇతరత్రా దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వాళ్లు వేసవి ప్రభావానికి గురవకుండా తగిన జాగ్రత్తలు పాటించాలి. 


వాడుతున్న మందులను బట్టి....

బ్లడ్‌ థిన్నర్లు: కొవిడ్‌ చికిత్సలో భాగంగా రక్తం పలుచబడే మందులు వాడుకున్న వాళ్లు, డీహైడ్రేషన్‌కు గురవకుండా చూసుకోవాలి. అందుకోసం వీలైనంత ఎక్కువగా ద్రవ పదార్థాలు తీసుకుంటూ ఉండాలి. 


డయూరిటిక్స్‌: గుండెజబ్బులు ఉన్నవాళ్లు, హార్ట్‌ ఫెయిల్యూర్‌కు గురైనవాళ్లకు గుండె మీద భారాన్ని తగ్గించడం కోసం మూత్రం ఎక్కువగా బయటకు వెళ్లిపోయే డయూరిటిక్‌ మందులు వాడవలసి ఉంటుంది. చమట రూపంలో శరీరం నుంచి ఎక్కువగా ద్రవాలు బయటకు వెళ్లిపోతూ ఉంటాయి. దానికి తోడు ఈ మందుల కారణంగా శరీరంలో నీరు తరిగిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. దాంతో డీహైడ్రేషన్‌కు గురయ్యే అవకాశాలు పెరుగుతాయి. కాబట్టి డయూరిటిక్‌ మందులు వాడుకుంటున్నవాళ్లు వైద్యులను సంప్రతించి తక్కువ మోతాదుతో కూడిన డయూరిటిక్స్‌ను తీసుకోవాలి. అలాగే నీళ్లు ఎక్కువగా తాగుతూ ఉండాలి.  


మధుమేహులు: రక్తంలో చక్కెర స్థాయిలను నిలకడగా ఉంచే మందుల మోతాదులను జాగ్రత్తగా అనుసరించాలి. క్రమం తప్పక వైద్యులను సంప్రతిస్తూ వాడుతున్న మందుల్లో మోతాదులను మార్చవలసి ఉందేమో వైద్యులను అడిగి తెలుసుకుంటూ ఉండాలి. 


మూత్రపిండాల సమస్యలు: తీవ్రమైన మూత్రపిండాల సమస్యలు (ఎండ్‌ స్టేజ్‌ రీనల్‌ ఫెయిల్యూర్‌) ఉన్నవాళ్లు నీళ్లు పరిమితంగా తాగవలసి ఉంటుంది. కానీ వేసవిలో దాహార్తి పెరుగుతుంది కాబట్టి ఈ కోవకు చెందిన వాళ్లు వైద్యుల సూచన మేరకు నీటి పరిమాణాన్ని కొంత పెంచుకోవచ్చు. అలాగే ఎండ సోకకుండా, నీడ పట్టున ఉంటూ, డీహైడ్రేషన్‌కు గురి కాకుండా చూసుకోవాలి. 


అదుపులోకొస్తే అలక్ష్యం

గాయం తగ్గిన తర్వాత పైపూత మందులు ఆపేసినట్టు చక్కెర, బిపి అదుపులోకొస్తే, మందులు సగానికి తగ్గించవచ్చనీ, లేదా పూర్తిగా ఆపేయవచ్చని చాలా మంది భావిస్తూ ఉంటారు. మరికొందరు యూట్యూబ్‌ వీడియోలు చూసి, ఇంటర్నెట్‌లో చదివి సొంత వైద్యాన్ని అనుసరిస్తూ ఉంటారు. ఇంకొందరు నెలల తరబడి వైద్య పరీక్షలు చేయించుకోకుండా, ఒకే మందులు కొనసాగిస్తూ ఉంటారు. ఈ ధోరణులన్నీ ఆరోగ్యాన్ని నష్టపరిచేవే! వైద్యులను ప్రతి మూడు నెలలకోసారి క్రమం తప్పక సంప్రతిస్తూ, సూచించిన వైద్య పరీక్షలు చేయించుకుంటూ, సూచించిన మోతాదుల్లో, చెప్పినంత కాలం పాటు మందులను వాడుకోవాలి. అలాగే వేసవికి సంబంధించిన జాగ్రత్తలను కూడా వైద్యులను అడిగి తెలుసుకోవాలి. 


విదేశీ సలహాలు స్వదేశంలో...

విదేశాల్లో స్థిరపడిన కుటుంబ సభ్యులు అక్కడి వైద్య విధానాలు, మందుల గురించిన సమాచారాన్ని స్వదేశంలో ఉన్న వాళ్లకు ఫోన్ల ద్వారా అందిస్తూ ఉంటారు. కానీ స్థానిక వాతావరణాన్ని బట్టి, పరిస్థితులను బట్టి చేయించుకోవలసిన పరీక్షలు, వాడుకోవలసిన మందుల గురించి స్థానిక వైద్యులే కచ్చితంగా చెప్పగలుగుతారు. అవసరాన్ని బట్టి వైద్యులే మందులను మారుస్తారు, మోతాదులను సరిచేయగలుగుతారు. విదేశాల్లో కొత్తగా అందుబాటులోకి వచ్చిన మందులు, స్వదేశంలో దొరకకపోవచ్చు. చాలా మందికి ఆ మందుల అవసరం కూడా ఉండకపోవచ్చు. అయినప్పటికీ, వాటి గురించి ఇక్కడి వాళ్లకు చెప్పి, వైద్యులను అడిగి ఆ మందులను రాయించుకోమని ఒత్తిడి చేసే విదేశీ కుటుంబసభ్యులు కూడా ఉంటారు. ఇలాంటి ధోరణి వల్ల వ్యాధిగ్రస్థులు కొంత అయోమయానికి, ఆందోళనకు లోనయ్యే ప్రమాదం ఉంటుంది. 


టెస్ట్‌ రిపోర్టులతో తంటాలు

పరీక్షా ఫలితాలను చూసుకుని కంగారు పడిపోయే ధోరణి కూడా పెరుగుతోంది. ఉదాహరణకు సోడియం పరిమాణం సాధారణ స్థాయికి మించి 130కి చేరుకుని ఉంటే, దాన్ని తగ్గించే మందులు సూచించమని వైద్యుల మీద ఒత్తిడి తెచ్చేవారూ ఉంటారు. అలాగే ఎరిత్రోమైసిన్‌ సెడిమెంటేషన్‌ రేట్‌ (ఈ్‌సఆర్‌) వయసుతో పాటు పెరుగుతూ ఉంటుంది. ఈ విషయం తెలియని వాళ్లు టెస్టు రిపోర్టులు చూసుకుని కంగారు పడిపోతూ ఉంటారు. 60 ఏళ్ల వయసులో శరీరంలో ఇన్‌ఫెక్షన్‌ రేటు 30 ఉండడం అనేది సర్వసాధారణం. ల్యాబ్‌ రిపోర్టుల్లో 0 - 20 నార్మల్‌ అని రాసి ఉంటే, దాన్ని అన్ని వయసుల వాళ్లూ  తమకు వర్తింపచేసుకోకూడదు. టెస్టు రిపోర్టుల ఆధారంగా కాకుండా, వ్యక్తిని బట్టి, ఆరోగ్య స్థితిని బట్టి వైద్యులు చికిత్సను ఎంచుకుంటారనే విషయాన్ని ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాలి. 


వ్యక్తిని బట్టి వైద్యం

పొరుగింటివాళ్లు, బంధువులు వాడుకుంటున్న మందులతో తమ మందులను సరిపోల్చుకోవడం కూడా సరికాదు. ఏ ఇద్దరు వ్యక్తుల జన్యు నిర్మాణం ఒకేలా ఉండదు. అలాంటప్పుడు అందరికీ ఒకే రకమైన మందులను వైద్యులు ఎలా సూచించగలుగుతారు? అనే విషయాన్ని అర్థం చేసుకోవాలి. అందరికీ ఒకే రకమైన మందులు పని చేయవు. కాబట్టి శరీర తత్వాన్ని బట్టి ఒకే వ్యాధితో బాధపడుతున్న వారికి భిన్నమైన మందులను వైద్యులు సూచిస్తూ ఉంటారు. కాబట్టి మందుల మోతాదును తగ్గించడం, లేదా ఆపేయడం చేయకూడదు. వేసవి ఇబ్బందులు వేధిస్తూ ఉన్నా, రుగ్మత లక్షణాలు పెరుగుతున్నట్టు అనిపించినా వైద్యులను సంప్రతించి, వారి సూచన మేరకు నడుచుకోవాలి.


వేసవి ఆహారం ఇలా...

బత్తాయి, పుచ్చ లాంటి నీటి శాతం ఎక్కువగా ఉన్న పండ్లు తినాలి. కారం, మసాలాలు, నూనెలో వేయించిన పదార్థాలకు బదులుగా తేలికగా అరిగే పదార్థాలు తినాలి. తాజాగా వండిన ఆహారమే తీసుకోవాలి. సొర, బీర, టమాటా లాంటి నీటి శాతం ఎక్కువగా ఉన్న కూరగాయలను వాడుకోవాలి. 


ఎలకొ్ట్రలైట్‌ పరీక్ష అత్యవసరం

మధుమేహులు ప్రతి ఆరు నెలలకోసారి చేయించుకునే మూత్రపిండాల పరీక్షలు, కొలెస్ట్రాల్‌ పరీక్షలు, మూడు నెలలకోసారి చేయించుకునే మధుమేహ పరీక్షలతో పాటు వేసవిలో అదనంగా ఎలకొ్ట్రలైట్‌ పరీక్ష చేయించుకోవాలి. మరీ ముఖ్యంగా మధుమేహులైన పెద్దలకు ఈ పరీక్ష అవసరం. ఈ పరీక్షతో సోడియం, పొటాషియం, క్లోరైడ్‌ స్థాయిలు తెలుస్తాయి. వేసవిలో చమట ద్వారా ఒంట్లోని లవణాలు బయటకు వెళ్లిపోతూ ఉంటాయి. కాబట్టి వాటి మోతాదును ఈ పరీక్షతో తెలుసుకుని, తరుగును ఎప్పటికప్పుడు భర్తీ చేసుకుంటూ ఉండాలి. 


డాక్టర్‌ ఎస్‌.మనోహర్‌

రిటైర్డ్‌ హెచ్‌ఒడి అండ్‌ ప్రొఫెసర్‌ ఆప్‌ మెడిసిన్‌,

ఉస్మానియా మెడికల్‌ కాలేజి, హైదరాబాద్‌.

Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
OpinionPoll
Advertisement
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.