HYD : రెండు వారాలుగా ‘అమ్మో దగ్గు’.. రోజుల తరబడి నయం కాని జ్వరమా.. అయితే ఇలా చేయండి..!

ABN , First Publish Date - 2021-10-21T14:48:53+05:30 IST

వారం రెండు వారాలుగా ఒకటే దగ్గు.. ఎన్ని మందులు వాడినా తగ్గడం లేదు. కాసేపు ఉపశమనం ఇచ్చినట్లే ఇచ్చి.. మళ్లీ వస్తోంది. కొవిడ్‌ వచ్చిందేమోనన్న భయంతో..

HYD : రెండు వారాలుగా ‘అమ్మో దగ్గు’.. రోజుల తరబడి నయం కాని జ్వరమా.. అయితే ఇలా చేయండి..!

  • రోజుల తరబడి నయం కాని జ్వరం
  • పరీక్షల్లో నార్మల్‌... పరిస్థితి ఇబ్బందికరం
  • యాంటిబయోటిక్స్‌కూ లొంగని సమస్య
  • ఆస్పత్రులకు పరుగులు పెడుతున్న జనం
  • ఓపీల్లో ఎక్కువగా జ్వరం, దగ్గు, గొంతునొప్పి, 
  • ఆయాసం, ఫ్లూ వంటి శ్వాసకోశ బాధితులే
  • వాతావరణ కాలుష్యం, గాలిలో తేమ వల్లే!
  • జీవన విధానాన్ని మార్చుకోవడం ద్వారా
  • జాగ్రత్త పడవచ్చంటున్న వైద్యులు

హైదరాబాద్‌ సిటీ : వారం రెండు వారాలుగా ఒకటే దగ్గు.. ఎన్ని మందులు వాడినా తగ్గడం లేదు. కాసేపు ఉపశమనం ఇచ్చినట్లే ఇచ్చి.. మళ్లీ వస్తోంది. కొవిడ్‌ వచ్చిందేమోనన్న భయంతో పరీక్ష చేయించుకుంటే నెగిటివ్‌గా నిర్ధారణ అవుతోంది. వైద్యుల వద్దకు వెళ్తే టెస్టుల మీద టెస్టులు చేస్తూ నార్మల్‌ అని తేలుస్తున్నారు. మరోవైపు జ్వరంతో బాధపడేవారు కూడా రోజుల తరబడి అస్వస్థతతో ఇబ్బంది పడుతున్నారు. ఆస్పత్రిలో చేరితే తప్ప నయం కాని పరిస్థితి తలెత్తుతోంది. నగరంలో ప్రస్తుతం చాలా మంది ఈ రకమైన సమస్యలు ఎదుర్కొంటున్నారు. జ్వరం, దగ్గు, గొంతునొప్పి, ఆయాసం, ఫ్లూ వంటి శ్వాసకోశ వ్యాధులతో బాధ పడుతున్నారు. ప్రధానంగా రోడ్లపై ఎక్కువగా తిరిగేవారు, ట్రాఫిక్‌ కానిస్టేబుళ్లు, రసాయనిక, మందుల పరిశ్రమల్లో పనిచేసే వారు ఈ తరహా జబ్బుల బారిన పడుతున్నారని వైద్యులు చెబుతున్నారు. వీరు దగ్గు, ఆయాసం, గొంతునొప్పితోపాటు గొంతులో గరగర, ఆహారాన్ని మింగలేని పరిస్థితి వంటి సమస్యలను ఎదుర్కొంటున్నారని పేర్కొంటున్నారు. గృహిణులు, పిల్లలకు కూడా ఈ సమస్యలు తప్పడం లేదు. ఈ వ్యాధులు యాంటీబయోటిక్‌ మందులకూ లొంగడం లేదు. వారం, రెండు వారాలపాటు హైపవర్‌ మందులు వేసుకోవాల్సి వస్తోంది. ఆస్పత్రిలోనూ చేరాల్సివస్తోంది. 


వాహనచోదకులకే ఎక్కువ...

గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో 30 నుంచి 35 శాతం వరకు వాహన చోదకులు జబ్బుల బారిన పడుతున్నట్లు వైద్యులు అంచనా వేస్తున్నారు. ఇందులో ఎక్కువగా 25 నుంచి 40 ఏళ్ల వయసువారే ఉంటున్నట్లు చెబుతున్నారు. పాదచారుల్లో కూడా 20 శాతం మేరకు దగ్గు, ఆయాసం, గొంతు నొప్పులతో బాధపడుతున్నారని, గృహిణుల్లోనూ 30 శాతానికిపైగా వీటి బారిన పడుతున్నారని పేర్కొంటున్నారు. సీజన్‌కు అనుగుణంగా వైరస్‌ మార్పులు చెందుతుండడం, ఎక్కువ సమయం ఇంట్లో గడపడం, రోగ నిరోధక శక్తి స్థాయి తగ్గిపోవడం వల్ల చాలా మంది వైర్‌సల బారిన పడుతున్నారని వివరిస్తున్నారు. నగరంలో నెలకొంటున్న వాతావరణ కాలుష్యం, బహిరంగ ధూమపానం వల్ల కూడా గొంతు సంబంధిత వ్యాధులు పెరుగుతున్నాయని వైద్యులు అంటున్నారు. గాలిలో తేమ, వాతావరణ కాలుష్యం వల్ల గొంతులో మార్పులు చోటుచేసుకుంటున్నట్లు చెబుతున్నారు. గొంతులో ఫంగస్‌ ఇన్‌ఫెక్షన్‌ వల్ల వాయిస్‌ బాక్స్‌ దెబ్బతినడం, మాటలు గరగరగా రావడం, గొంతులో నొప్పి, వాపు వంటి ఇబ్బందులు ఉంటాయని వివరిస్తున్నారు.


ఇతర సమస్యలు కూడా...

వైరల్‌ ఫీవర్లతోపాటు ఇతర వైరస్‌, బ్యాక్టీరియాల ద్వారా సంక్రమించే జబ్బుల నుంచి కోలుకునేందుకు ఎక్కువ రోజులు పడుతుంది. గతంలో రెండు రోజులు చికిత్స తీసుకున్న సమస్యకు ఇప్పుడు ఐదారు రోజుల వరకు చికిత్స పొందాల్సి వస్తోంది. ప్రస్తుతం వైరల్‌ ఫీవర్లతో ఆస్పత్రిలో చేరుతున్నవారి సంఖ్య పెరిగిపోతోంది. ప్రభుత్వ ఆస్పత్రుల కన్నా ప్రైవేటు ఆస్పత్రుల్లో ఈ సంఖ్య ఎక్కువగా ఉంటోంది. రోజూ వంద మందికి పైగానే దగ్గు, ఆయాసం, ఫ్లూ వంటి సమస్యలతో రోగులు వస్తున్నారని వైద్యులు పేర్కొంటున్నారు. చెస్ట్‌ ఆస్పత్రి ఓపీ విభాగానికి వచ్చే రోగుల్లో 20 శాతం వీరే ఉంటున్నారని చెబుతున్నారు. ఈ సమస్యలు వారాలు, నెలల తరబడి జబ్బు తగ్గకపోతే అది ఆస్తమా, బ్రాంకైటిస్‌ వ్యాధులకు దారితీస్తుందని వైద్యులు చెబుతున్నారు. పెద్దవారిలో ఆస్తమా, బ్రాంకైటిస్‌, పిల్లల్లో న్యుమోనియా వ్యాధులు వస్తాయని పేర్కొంటున్నారు. మొదటి దశలో అతి తక్కువ స్థాయి ఉంటుందని, రెండో దశకు వచ్చేసరికి ఆస్తమా లక్షణాలు చోటుచేసుకుంటున్నాయని చెప్పారు. మూడు, నాలుగు దశల్లో వారానికి రెండు, మూడు సార్లు రాత్రిపూట దగ్గు, ఆయాసం వంటి సమస్యలతో బాధపడుతుంటారని తెలిపారు.


4 నుంచి 6 వారాలపాటు సమస్య...

వైరల్‌ ఫీవర్‌, దగ్గు కొన్నిసార్లు వారాల తరబడి ఉంటుంది. కొంత మందిలో వైరల్‌ ఇన్‌ఫెక్షన్‌ ఉంటుండగా, మరికొందరిలో చెస్ట్‌ ఇన్‌ఫెక్షన్‌ ఉంటుంది. కొందరిలో ఈ సమస్యలు 4 నుంచి 6 వారాల పాటు ఉండొచ్చు. మందులు, సిరప్‌తో జబ్బు తీవ్రతను తగ్గించే ప్రయత్నం చేస్తున్నాం. తగ్గకపోతే ఎక్స్‌రే, ఇతర పరీక్షలు చేసి నిర్ధారణకు వస్తున్నాం. కొంత మందిలో ఎసిడిటీ వల్ల గ్యాస్‌ ఉత్పత్తి అయి అది పైవరకు వ్యాపిస్తుండడంతో దగ్గు పెరిగి ఇబ్బంది పడుతున్నారు. కొందరిలో ఆస్తమా ఉన్నప్పటికీ గుర్తించడం కష్టం. సమయానికి తినడం, సరైన సమయంలో పడుకోవడం అలవాటు చేసుకోవాలి. 

- డాక్టర్‌ ప్రదీ‌ప్‌సింహ, సీనియర్‌ పల్మనాలజిస్టు, కాంటినెంటల్‌ ఆస్పత్రి.


చల్లటి వాతావరణంలో...

రోగ కారకమైన వైరస్‌, బ్యాక్టీరియా చల్లటి వాతావరణంలో బాగా బలపడతాయి. గాలిలో తేమ శాతం ఎక్కువగా ఉంటే ఈ ఇవి చాలా చురుకుగా ఉంటాయి. చల్లటి ప్రదేశంలో ఈ వైరస్‌ కదలికలు తక్కువగా ఉంటాయని, దీంతో శ్వాస తీసుకుంటున్న సమయంలో ఊపిరిత్తుల్లోకి చేరే ప్రమాదముందని వైద్యులు వివరిస్తున్నారు. ఎండ వేడిమి ఎంత ఎక్కువ ఉంటే అంత త్వరగా ఈ వైరస్‌, బ్యాక్టీరియా చనిపోతాయన్నారు. చలికాలంలో వైరస్‌ శరీరంలో ప్రవేశించిన తరువాత 5-6 రోజుల వరకు నిద్రావస్థలో ఉంటుందని, అనంతరం తన ప్రభావాన్ని చూపుతుందని పేర్కొన్నారు. చల్లటి వాతావరణంలో దగ్గు, ఆయాసం, సీవోపీడీ వంటి శ్వాసకోస జబ్బులు వస్తే చికిత్సకు లొంగడంలేదు. సాధారణ మందులకు ఈ జబ్బులు లొంగకపోతే కొన్నిసార్లు మందుల డోస్‌ పెంచాల్సి వస్తోందని వైద్యులు చెబుతున్నారు. అప్పటికీ తగ్గకపోతే జబ్బు తీవ్రతను బట్టి వారం పది రోజుల పాటు ఆస్పత్రిలో చేర్చుకుని ప్రత్యేక మందులతో చికిత్సను అందిచాల్సి వస్తోందని, దీనికితోడు రెండు నెలలపాటు ఇన్‌హేలర్‌ వంటివి వాడాల్సి వస్తోందని వివరిస్తున్నారు.

Updated Date - 2021-10-21T14:48:53+05:30 IST