ప్రికాషన్‌ డోస్‌పై పట్టింపేదీ?

ABN , First Publish Date - 2022-07-02T05:16:53+05:30 IST

కరోనాకు సంబంధించి ఒకటి, రెండు డోసులను కేంద్ర ప్రభుత్వం ఫ్రీగా ఇవ్వడంతో టార్గెట్‌కు మించి ఇంజక్షన్‌ వేయించుకున్న ప్రజలు, డబ్బులు పెట్టి వేయించుకోవాలన్న ప్రికాషన్‌ డోస్‌ విషయానికి వచ్చే సరికి వెనుకడుగు వేశారు.

ప్రికాషన్‌ డోస్‌పై పట్టింపేదీ?
కొవిడ్‌ వ్యాక్సిన్‌ వేయించుకుంటున్న వ్యక్తి(ఫైల్‌)

కొవిడ్‌ మొదటి, రెండో డోస్‌లతో సరిపెట్టుకున్న జనం

మూడో డోస్‌పై అనాసక్తి


కరోనాకు సంబంధించి ఒకటి, రెండు డోసులను కేంద్ర ప్రభుత్వం ఫ్రీగా ఇవ్వడంతో టార్గెట్‌కు మించి ఇంజక్షన్‌ వేయించుకున్న ప్రజలు, డబ్బులు పెట్టి వేయించుకోవాలన్న ప్రికాషన్‌ డోస్‌ విషయానికి వచ్చే సరికి వెనుకడుగు వేశారు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 27,15,974 మందికిగానూ కేవలం 83,833 మంది మాత్రమే ప్రికాషన్‌ డోస్‌ వేసుకున్నారు. ధర నిర్ణయించినందున ఆ డోస్‌ వేసుకోలేదని తెలుస్తోంది. అది వేసుకున్న వారికి యాంటిబాడీలు పెరిగే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు. 

- మహబూబ్‌నగర్‌(వైద్యవిభాగం)


కరోనాను అరికట్టాలంటే కచ్చితంగా వ్యాక్సిన్‌ వేసుకోవాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెప్పడంతో ఒకటి, రెండు డోసులను లక్ష్యానికి మించి వేయించుకున్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా 26,20,891 మంది జనాభా ఉండగా, ఇతర జిల్లాల వారూ ఇక్కడ టీకా వేయించుకోవడంతో మొదటి డోసు 27,07,951 మంది, రెండో డోసు 27,37,235 మంది వేయించుకు న్నట్లు నమోదైంది. అంటే టార్గెట్‌కు మించి అన్ని జిల్లాల్లో 103 శాతం నుంచి 106 శాతం వరకు టీకాలు వేయించుకున్నారు.


ప్రికాషన్‌ డోస్‌పై అనాసక్తి

మొదటి, రెండో డోస్‌ వేసుకున్న మూడు నెలల తర్వాత ప్రికాషన్‌ డోస్‌ వేసు కోవాలని నిర్ణయించారు. దీని ప్రకారం ఉమ్మడి జిల్లాలో 27,15,974 మందికి ఆ డోస్‌ ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. కానీ ఐదు జిల్లాల్లో కలిపి కేవలం 83,833 మంది మాత్రమే ఆ టీకా తీసుకున్నారు. అందులో 60 ఏళ్లు పైబడిన వారు 45,986 మంది ఉండగా, మిగతా వయసుల వారు 37,847 మంది మాత్రమే ఉన్నారు. ఇంకా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 26,32,141 మంది ప్రికాషన్‌ డోసు వేసుకోవాల్సి ఉంది. ప్రికాషన్‌ డోస్‌కు ధర నిర్ణయించడం, కరోనా ఉధృతి తగ్గడంతో ఆ టీకా వేయించుకోవడంలో జనం ఆసక్తి చూపడం లేదని తెలుస్తోంది. సామాన్య జనం కొంతవరకు ఈ డోసు వేసుకున్నప్పటికీ, ఫ్రంట్‌లైన్‌ వర్కర్లు, హెల్త్‌కేర్‌ వర్కర్లు పెద్దగా ఆసక్తి చూపడం లేదు. 


ధర నిర్ణయించినందుకేనా..

 ఒకటి, రెండు డోసులకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం వ్యాక్సిన్‌ను ఉచితంగా అందజేసింది. ప్రికాషన్‌ డోస్‌ మాత్రం 60 ఏళ్లు పైబడిన వారికే ఉచితంగా ఇస్తామని, మిగతా వయసుల వారు ప్రైవేటులో రూ.300 నుంచి రూ.400 వరకు చెల్లించి వ్యాక్సిన్‌ తీసుకోవాలని చెప్పింది. దాంతో ప్రజ ల్లో ఆసక్తి తగ్గింది. ప్రైవేటు యాజమాన్యాలు వ్యాక్సిన్‌ తెచ్చుకొని తమ ఆస్పత్రికి వస్తే డబ్బులు తీసుకొని వేస్తామని చెప్పాయి. అయినా వెళ్లకపోవడంతో పలువురికి వాటినీ ఉచితంగానే ఇచ్చారు. ఈ లెక్కన ఉమ్మడి జిల్లాలో 98 శాతం మంది ప్రికాషన్‌ డోసు వేసుకోలేదు. కరోనా అంత తీవ్ర స్థాయిలో లేకపోవడం, ఉన్నా లక్షణాలు పెద్దగా లేకపోవడంతో ప్రికాషన్‌ డోసుపై పెద్దగా ఆసక్తి చూపడం లేదు. ప్రస్తుతం ఏ ప్రైవేట్‌ ఆస్పత్రిలోనూ ప్రికాషన్‌ డోసు ఇవ్వడం లేదు. 

Updated Date - 2022-07-02T05:16:53+05:30 IST