పక్కా ప్లాన్‌తోనే నిధుల గోల్‌మాల్‌!

ABN , First Publish Date - 2021-07-26T05:24:29+05:30 IST

ది వేటపాలెం కోఆపరేటివ్‌ క్రెడిట్‌ సొసైటీ లిమిటెడ్‌కు సంబంధించిన నిధుల గోల్‌మాల్‌ పక్కాప్రణాళిక ప్రకారమే జరిగింది. సొసైటీలో డిపాజిట్లు, ఇచ్చిన రుణాలు, ఇతరత్రా వ్యవహారాలను పరిశీలిస్తే ఈ విషయం అర్థమవుతుంది. సుమారు రూ.25 కోట్లకుపైగా డిపాజిట్లు సేకరించిన సొసైటీ నిర్వాహకులు, అప్పులు ఇచ్చింది కేవలం సుమారు రూ.15 లక్షలు మాత్రమే కావటం అందుకు నిదర్శనం. ఇదిలా ఉండగా సొసైటీలో స్వాహాపర్వంపై ప్రభుత్వం స్పందించింది. దీంతో ఉన్నతాధికారులు రంగంలోకి దిగారు. విచారణ ప్రారంభించారు.

పక్కా ప్లాన్‌తోనే   నిధుల గోల్‌మాల్‌!
ది వేటపాలెం కోఆపరేటివ్‌ క్రెడిట్‌ సొసైటీ కార్యాలయ భవనం

సేకరించిన డిపాజిట్లు రూ.25 కోట్లు 

ఇచ్చిన రుణాలు రూ.15 లక్షలు

వేటపాలెం సొసైటీలో 

బయటపడుతున్న బాగోతం 

విచారణకు మంత్రి కన్నబాబు ఆదేశం 

కదలిన యంత్రాంగం 

చీరాల, జూలై 25 : ది వేటపాలెం కోఆపరేటివ్‌ క్రెడిట్‌ సొసైటీ లిమిటెడ్‌కు సంబంధించిన నిధుల గోల్‌మాల్‌ పక్కాప్రణాళిక ప్రకారమే జరిగింది. సొసైటీలో డిపాజిట్లు, ఇచ్చిన రుణాలు, ఇతరత్రా వ్యవహారాలను పరిశీలిస్తే ఈ విషయం అర్థమవుతుంది. సుమారు రూ.25 కోట్లకుపైగా డిపాజిట్లు సేకరించిన సొసైటీ నిర్వాహకులు, అప్పులు ఇచ్చింది కేవలం సుమారు రూ.15 లక్షలు మాత్రమే కావటం అందుకు నిదర్శనం. ఇదిలా ఉండగా సొసైటీలో స్వాహాపర్వంపై ప్రభుత్వం స్పందించింది. దీంతో ఉన్నతాధికారులు రంగంలోకి దిగారు. విచారణ ప్రారంభించారు. పోలీసులు కూడా కేసు నమోదు చేశారు. ప్రత్యేక బృందాలతో దర్యాప్తు చేయించనున్నట్లు ఎస్పీ మలికగర్గ్‌ వెల్లడించారు. 


మంత్రి ఆదేశంతో కదిలిన యంత్రాంగం  

ది వేటపాలెం కోఆపరేటివ్‌ క్రెడిట్‌ సొసైటీ లిమిటెడ్‌కు సంబంధించిన ఆర్ధిక వ్యవహారలపై వచ్చిన అభియోగాలు, అవకతవకలపై వత్రికల్లో వచ్చిన కథనాలపై వెంటనే విచారణ చేపట్టి నివేదిక సమర్పించాలని రాష్ట్ర వ్యవసాయ, సహకార శాఖ మంత్రి కన్నబాబు సంబంధిత అఽధికారులను ఆదేశించారు. దీంతో ఆదివారం డీసీవో రాజశేఖర్‌, డీఎస్పీ శ్రీకాంత్‌, రూరల్‌ సీఐ రోశయ్య సొసైటీలో విచారణ నిర్వహించారు. కమిటీ సభ్యులను విచారించి, వివరాలు సేకరించారు. సెక్రటరీ కం మేనేజర్‌ శ్రీనివాసరావు, మరికొంతమందిపై కేసు నమోదుచేసి ఎఫ్‌ఐఆర్‌ దాఖలు చేశారు. ఈ క్రమంలో సొసైటీ ఆర్థిక వ్యవహారాల అవకతవకలకు సంబంధించి ఇద్దరు సీనియర్‌ అసిస్టెంట్‌ రిజిస్ట్రార్‌లతో ప్రాథమిక దర్యాప్తునకు డీసీవో ఆదేశించారు.  


 ఆదాయం గోరంత... వ్యయం కొండంత

సొసైటీ ఆదాయం గోరంత.. వ్యయం కొండంతలా ఉంది. సొసైటీలో సుమారు రూ.25కోట్లకు పైగా డిపాజిట్‌ సొమ్ము ఉండగా, సేవింగ్‌ ఖాతాల్లో మరికొంత ఉంది. సొసైటీలో డిపాజిట్‌ చేసినవారికి ఇతర బ్యాంకుల కంటే ఒకశాతం అదనంగా ఒక్క శాతం వడ్డీ ఇస్తారు. సేకరించిన డిపాజిట్‌ సొమ్ములో కొంత మదర్‌ బ్యాంకులో డిపాజిట్‌ చేస్తూ, మరికొంత తిరిగి ఖాతాదారులకు ఎక్కువ వడ్డీకి రుణాలు ఇస్తుంటారు. అలా వచ్చిన అధిక మొత్తాలు సొసైటీ నిర్వహణకు, సిబ్బంది జీతభత్యాలకు వినియోగిస్తుంటారు. అయితే, తాజాగా అధికారుల విచారణలో డిపాజిట్లు సుమారు రూ.25 కోట్లకు పైగా ఉంటే, ఇచ్చిన రుణాలు కేవలం రూ.15 లక్షలు మాత్రమే ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో పక్కా ప్రణాళికతో, ఉద్దేశపూర్వకంగానే మోసం చేసినట్లు స్పష్టమవుతోంది. 

ఆదినుంచి ఇంతేనా..

సుమారు రెండు సంవత్సరాల క్రితం సొసైటీ కమిటీలో మార్పులు, చేర్పులు జరిగాయి. వలివేటి నాగేశ్వరరావు నూతన చైర్మన్‌గా ఎన్నికయ్యారు. ఇతర కమిటీ సభ్యులతో కలసి ఆయన బాధ్యతలు స్వీకరించారు. సొసైటీ మేనేజర్‌ శ్రీరామ్‌ శ్రీనివాసరావు కమిటీలో సెక్రటరీగా కూడా ఉన్నారు. సాధారణంగా కమిటీ మారినప్పుడు అప్పటివరకు సొసైటీకి ఉన్న స్థిర, చరాస్థులు, ఆదాయ, వ్యయాలకు సంబంధించి పూర్తిస్థాయిలో లెక్కలు తేల్చిన తరువాత వాటిని సరిసూచుకుని కొత్త కమిటీ బాధ్యతలు స్వీకరిస్తుంది. ఈ ప్రక్రియ ఆనాడు జరిగిందా? జరిగితే అప్పటికే నిధుల వినియోగంలో అవకతలు ఉన్నట్లు గుర్తించి ఊరుకున్నారా? లేదా కొత్త కమిటీ హయాంలోనే అవకతవకలు జరిగాయా? సుమారు 30 సంవత్సరాలకు పైబడి అదే సొసైటీలో మేనేజర్‌గా పనిచేస్తున్న శ్రీరామ్‌ శ్రీనివాసరావుకు వాస్తవాలు తెలీవా? తదితర అంశాలకు సంబంధించి పోలీసులు పూర్తిస్థాయిలో విచారణ జరిపితే అన్ని విషయాలు వెలుగుచూస్తాయి.


డిపాజిట్‌ దారులు వివరాలు తెలపాలి : ఎస్పీ మలిక గర్గ్‌

ది వేటపాలెం కోఆపరేటివ్‌ క్రెడిట్‌ సొసైటీ లిమిటెడ్‌లో జరిగిన అవకతవకలపై వేటపాలెం పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదు చేసినట్లు ఎస్పీ మలిక గర్గ్‌ తెలిపారు. ఇప్పటివరకు వేటపాలెం, పరిసర ప్రాంతాలకు చెందిన సుమారు 300 మంది బాధితులు  తమ ఫిక్స్‌డ్‌, రికరింగ్‌ డిపాజిట్స్‌, సేవింగ్స్‌ ఖాతాలకు సంబంధించిన వివరాలను పోలీసు స్టేషన్‌లో ఇచ్చారన్నారు. ఇంకా ఎవరైనా బాధితులు ఉంటే సొసైటీలో తమ లావాదేవీలకు సంబంధించిన వివరాలను వేటపాలెం పోలీసులకు తెలపాలని ఎస్పీ కోరారు. ఈకేసుపై విచారణకు సీనియర్‌ స్థాయి పోలీసు అధికారులతో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేస్తున్నట్లు ఆమె చెప్పారు. 


డిపాజిట్‌దారులకు న్యాయం చేస్తాం : మంత్రి కన్నబాబు 

వేటపాలెం కోఆపరేటివ్‌ సొసైటీలో డబ్బులు డిపాజిట్‌ చేసిన వారు ఎలాంటి ఆందోళన చెందవద్దని, అధైర్యపడొద్దని మంత్రి కన్నబాబు ఒక ప్రకటనలో తెలిపారు. పోలీసు శాఖ, సహకార శాఖ సమన్వయంతో పని చేస్తుందన్నారు. పూర్తిస్థాయిలో విచారణ చేయించి డిపాజిట్‌దారులకు న్యాయం చేస్తామన్నారు. 




Updated Date - 2021-07-26T05:24:29+05:30 IST