HMDAలో పీఆర్సీ పరేషాన్.. మూడు నెలలుగా ఎదురుచూపు.. ఎందుకింత వివక్ష..!

ABN , First Publish Date - 2021-10-24T17:02:42+05:30 IST

హెచ్‌ఎండీఏలో కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులపై వివక్ష కొనసాగుతోంది. అన్ని శాఖల్లో...

HMDAలో పీఆర్సీ పరేషాన్.. మూడు నెలలుగా ఎదురుచూపు.. ఎందుకింత వివక్ష..!

  • అన్ని విభాగాల్లో కీలకంగా వీరే.. 
  • ఫైల్‌ కూడా పెట్టని విభాగాధిపతి
  • పట్టించుకోని ఉన్నతాధికారులు


హైదరాబాద్‌ సిటీ : హెచ్‌ఎండీఏలో కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులపై వివక్ష కొనసాగుతోంది. అన్ని శాఖల్లో ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులకు పీఆర్సీ వర్తిస్తుండగా, ఇక్కడ మాత్రం అందని ద్రాక్షగా మారుతోంది. రెగ్యులర్‌ ఉద్యోగులకు పీఆర్సీ అమలు చేస్తున్న అధికారులు ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులకు మొండిచేయి చూపిస్తున్నారు. పీఆర్సీ ప్రకారం పెరిగిన వేతనాలు చెల్లించేందుకు హెచ్‌ఎండీఏలోని ఉన్నతాధికారులు సిద్ధంగా ఉన్నా, ఎస్టాబ్లిష్‌మెంట్‌ విభాగం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఉద్యోగులు వాపోతున్నారు.


మహానగరంతో పాటు శివారు ప్రాంతాలలో మెరుగైన పట్టణ ప్రణాళికాభివృద్ధికి దోహదపడే హెచ్‌ఎండీఏలో రెగ్యులర్‌ ఉద్యోగులు సగానికి సగం తగ్గిపోయారు. కొన్నేళ్లుగా రెగ్యులర్‌ ఉద్యోగ నియమాకాలు లేవు. దీంతో అవసరానికి అనుగుణంగా అన్ని విభాగాల్లో ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులను నియమిస్తూ వచ్చారు. రెగ్యులర్‌ ఉద్యోగుల కంటే హెచ్‌ఎండీఏలో ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులే అధికం. హెచ్‌ఎండీఏలోని ప్లానింగ్‌, ఇంజనీరింగ్‌, అర్బన్‌ ఫారెస్ట్‌,  హెచ్‌జీసీఎల్‌, బీపీపీ, ఎస్టాబ్లిష్‌మెంట్‌ ఇలా అన్ని విభాగాల్లో కంప్యూటర్‌ ఆపరేటర్లందరూ ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులే. సెక్యూరిటీ గార్డులూ ఔట్‌ సోర్సింగ్‌ పద్ధతిలోనే పని చేస్తున్నారు.


రెగ్యులర్‌ ఉద్యోగులతో పాటు ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులకూ వేతనాలు ఈ ఏడాది ఆగస్ట్‌లో పెంచారు. హెచ్‌ఎండీఏలో ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల వేతనాల పెంపు కోసం ఎస్టాబ్లిష్‌మెంట్‌ విభాగం నుంచి ఫైల్‌ పెట్టాల్సి ఉండగా, మూడు నెలలుగా నాన్చుతున్నారు. ఈ విభాగ అధికారి రిటైర్‌ అయినా తన పలుకుబడిలో అదే సీటులో తిష్ఠవేశారు. ఆ విభాగంలో ఆయనను ప్రశ్నించే పరిస్థితి ఉండదు. ప్రశ్నిస్తే మరుసటి రోజు ఆ సీటులో కూర్చునే పరిస్థితి ఉండదు. ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులతో పాటు రెగ్యులర్‌ ఉద్యోగులనూ ఇష్టానుసారంగా బదిలీలు చేస్తుంటారని అంటున్నారు. దీంతో తమకు పీఆర్సీ ప్రకారం వేతనాలు చెల్లించాలని అడిగే పరిస్థితి లేకుండా పోయిందని పలువురు ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులు అంటున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి, హెచ్‌ఎండీఏలో పని చేస్తున్న ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులకు పీఆర్సీ వర్తించేలా చర్యలు  తీసుకోవాలని కోరుతున్నారు.


వాటర్‌ బోర్డులో రెగ్యులర్‌ ఉద్యోగులకూ...

వాటర్‌ బోర్డు ఉద్యోగులది మరో వింత పరిస్థితి. ఇక్కడ ఉద్యోగులకు ఇంత వరకు పీఆర్సీ ఊసే లేకుండా పోయింది. పీఆర్సీ అమలు చేయాలని యూనియన్లు విజ్ఞప్తి చేస్తున్నా పట్టించుకునే వారే లేకుండా పోయారు. ఇక్కడ సుమారు 4,500 మంది రెగ్యులర్‌, నాలుగు వేల మంది ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులు ఉండగా, పీఆర్సీ ప్రకారం వేతనాలు పెరగలేదు. వాటర్‌ బోర్డులో వేతనాలు పెరగాలంటే సంస్థకు చైర్మన్‌గా ఉన్న సీఎం ఆమోద ముద్ర వేయాల్సి ఉంటుంది. వాటర్‌బోర్డు ఉద్యోగుల వేతనాల పెంపునకు సంబంధించిన దస్త్రం ఇప్పటికే సీఎం పేషీకి చేరినా, అక్కడి నుంచి ఇంకా సీఎం వద్దకే చేరలేదని తెలుస్తోంది.

Updated Date - 2021-10-24T17:02:42+05:30 IST