ఈ పీఆర్‌సీ.. మాకొద్దు!

ABN , First Publish Date - 2022-01-19T05:33:39+05:30 IST

తమ జీతాల విషయంలో ప్రభుత్వం ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తోందని ఉద్యోగ, ఉపాఽధ్యాయలు, పెన్షనర్లు మండిపడుతున్నారు.

ఈ పీఆర్‌సీ.. మాకొద్దు!
మాచర్లలో జీవో ప్రతులను దగ్ధం చేస్తున్న ఉద్యోగులు

అర్ధరాత్రి జీవోలపై మిన్నంటిన ఆందోళనలు

ప్రభుత్వం ఏకపక్షంగా జీవోలివ్వటం సరికాదు

ఉద్యోగులు జీతాలతో చెలగాటం ఆడతారా?

భగ్గుమంటున్న ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లు

జిల్లావ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు 

జీవో ప్రతులను దగ్ధం చేసిన ఉద్యోగులు 

20వ తేదీ నుంచి ఉద్యమాలకు శ్రీకారం


   పీఆర్‌సీ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపై ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు భగ్గుమంటున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా వేతనాలు తగ్గించడం వంచన చేయడమే అని ఆరోపిస్తున్నాయి. ఏ రాష్ట్రంలోనూ లేని నిర్ణయాలను ఇక్కడి ప్రభుత్వం అమలు చేయాలని చూడటం దుర్మార్గం అంటున్నాయి. ఈ మేరకు జిల్లావ్యాప్తంగా మంగళవారం నిరసనలు మిన్నంటాయి. అర్ధరాత్రి ఇచ్చిన జీవోలు రద్దు చేసేవరకు పోరాడతాం అంటూ నేతలు స్పష్టం చేశారు. 


గుంటూరు(విద్య), జనవరి 18: తమ జీతాల విషయంలో ప్రభుత్వం ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తోందని ఉద్యోగ, ఉపాఽధ్యాయలు, పెన్షనర్లు మండిపడుతున్నారు. జీతాలకు కోతలు పెడుతున్నారని ఆవేదన చెందుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం సోమవారం రాత్రి పీఆర్‌సీ జీవోలను వెలువరించిన విషయం తెలిసిందే. ఐఆర్‌ కంటే తక్కువగా ఫిట్‌మెంట్‌ ఇవ్వడం, హెచ్‌ఆర్‌ఏ స్లాబుల్లో కనివీని ఎరుగని రీతిలో మార్పులు చేయడం, ఐఆర్‌ మోనిటర్‌ బెనిఫిట్‌లో మాయం చేయడం, సీపీఎస్‌ రద్దుకోరితే సిటీ కాంపెన్సేటరీ (సీసీఏ)రద్దు చేయడం వంటి నిర్ణయాలు ఉద్యోగులను కలవరపెట్టాయి. దీంతోపాటు ఐదేళ్లకు ఒకసారి అమలు చేసే పీఆర్‌సీని పదేళ్లకు పొడిగించడం వంటి నిర్ణయాలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అశితోష్‌మిశ్రా కమిటీ రిపోర్టును బహిర్గతం చేయకుండా సీఎస్‌ కమిటీ సిఫార్సులను అమలు చేసే ప్రయత్నాలను ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. శాస్త్రీయంగా ఏర్పాటుచేసిన హెచ్‌ఆర్‌ఏ రేట్ల శ్లాబ్‌లు ఏకపక్షంగా తగ్గించడం వల్ల ఒక్కో ఉద్యోగికి నెలకు రెండు నుంచి నాలుగు వేల వరకు నష్టం వాటిల్లుతుందని చెబుతున్నారు. ఆయా జీవోలను వ్యతిరేకిస్తూ ఈనెల 20 నుంచి పెద్దఎత్తున ఉద్యమాలకు శ్రీకారం చుడుతున్నారు. ఇందులో భాగంగా తొలుత రాష్ట్రవ్యాప్తంగా కలెక్టరేట్ల ముట్టడి నిర్వహించనున్నారు. 


జిల్లావ్యాప్తంగా ఆందోళనలు

 రాష్ట్రప్రభుత్వం తక్షణమే పీఆర్‌సీ జీవోలను రద్దుచేయాలని ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నేతలు ముక్తకంఠంతో డిమాండ్‌ చేశారు.  ఫ్యాఫ్టో ఇచ్చిన పిలుపు మేరకు జిల్లావ్యాప్తంగా అన్ని మండలాల్లో జీవో కాపీలను దగ్ధం చేసిన నిరసనలు తెలిపారు. అమరావతి, అచ్చంపేట మండలాల్లో నిరసన ర్యాలీలు నిర్వహించారు. క్రోసూరులో హైస్కూల్‌ వద్ద నుంచి తహసీల్దార్‌ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్ళి ధర్నా చేశారు. అనంతరం అంబేద్కర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అక్కడే పీఆర్‌సీ ప్రతులను దగ్ధం చేశారు. అమృతలూరు, వేమూరులో ఆందోళనలు చేపట్టారు. కర్లపాలెం మండల పరిషత్‌ కార్యాలయం వద్ద ఉపాధ్యాయులు నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన ప్రదర్శన చేశారు. అక్కడి నుంచి కర్లపాలెం సెంటర్‌ వరకు ర్యాలీ చేసి జీవో ప్రతులను దగ్ధం చేశారు. చిలకలూరిపేటలో ఉపాధ్యాయ సంఘాల నాయకులు, ఉపాధ్యాయులు పెద్దఎత్తున నిరసన కార్యక్రమం నిర్వహించారు. పట్టణంలోని ఎన్‌ఆర్‌టీ సెంటర్‌ నుంచి తహసీల్దార్‌ కార్యాలయం వరకు నిరసన ర్యాలీ చేపట్టారు. తాడికొండ అడ్డరోడ్డు సెంటర్‌లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రేపల్లె ఏబీఆర్‌ డిగ్రీ కళాశాల ఆవరణలో ఉపాధ్యాయులు, ఫ్యాఫ్టో ఆధ్వర్యంలో నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలియజేశారు. కాకుమానులో జీవో ప్రతులను తగలబెట్టారు. పిడుగురాళ్లలో ఉద్యోగ, ఉపాధ్యాయ, ఎన్జీవో సంఘ నేతలు ర్యాలీ, నిరసన కార్యక్రమాలు చేపట్టి, జీవో కాపీలను దగ్ధం చేశారు. నరసరావుపేటలో ఉపాధ్యాయ సంఘాలు నిరసన ప్రదర్శన చేపట్టాయి. మాచర్ల, వినుకొండ నియోజకవర్గాల్లో ఆందోళనలు కొనసాగాయి. 

 

చీకటి జీవోలను రద్దుచేసే వరకు పోరాటం

ప్రభుత్వ ఉద్యోగ సంఘాలతో చర్చించకుండా అర్ధరాత్రి జారీచేసిన చీకటి జీవోలను తక్షణం రద్దుచేయాలి. ఈ పీఆర్‌సీని ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అందరినీ ప్రభుత్వం మోసం చేసింది. సీఎం స్పందించి జీవోల్ని రద్దుచేసేలా చర్యలు తీసుకోకుంటే ఉద్యమ బాట పట్టక తప్పదు.  

- ఘంటసాల శ్రీనివాసరావు, ఎన్జీవో అసోసియేషన్‌ జిల్లా అధ్యక్షులు 


జీతంలో తగ్గుదల ఈ పీఆర్‌సీకే చెల్లింది.. 

ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లు పోరాడి సాధించుకున్న హక్కు పీఆర్‌సీ. పీఆర్‌సీ అమలులో తీవ్రజాప్యం చేయడం మాత్రమే కాకుండా  27శాతం ఐఆర్‌ కంటే ఫిట్‌మెంట్‌ తక్కువ ప్రకటించడం, హెచ్‌ఆర్‌ఏ స్లాబుల్లో కోతలు విధించడం అన్యాయం. అశితోష్‌మిశ్రా కమిటీ రిపోర్టును బహిర్గతం చేయకుండా సీఎస్‌ కమిటీ సిఫార్సులను పరిగణనలోకి తీసుకోవడం శోచనీయం.  

- పి.ప్రేమ్‌కుమార్‌, యూటీఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు  


పదేళ్లకు పీఆర్‌సీ అనడం అన్యాయం..

 పది సంవత్సరాలకు ఒకసారి పీఆర్‌సీ అమలు చేస్తామని ప్రకటించడం దారుణం. హెచ్‌ఆర్‌ఎను 20శాతం నుంచి తగ్గించడం వల్ల ఉద్యోగులు నెలకు దాదాపు రూ.4వేలు కోల్పోతున్నారు. పీఆర్‌సీ మోనిటర్‌ బెనిఫిట్‌ 1-4-2020 నుంచి అని చెప్పి తొమ్మిది నెలలు వెనక్కు తీసుకెళ్ళారు. అదనపు క్వాంటమ్‌ ఆఫ్‌ పెన్షన్‌ 70 నుంచి 80 సంవత్సరాలు చేయడం అన్యాయం.

- ఎస్‌.రామకృష్ణ, ఎంటీఏ రాష్ట్ర అధ్యక్షుడు 


ఇది మోసపూరితం.. 

 రాష్ట్ర చరిత్రంలో ఎన్నడూ లేనివిధంగా ఈ ప్రభుత్వం, ముఖ్యమంత్రి 23శాతం ఫిట్‌మెంట్‌ ఇచ్చి హెచ్‌ఆర్‌ఎలో కోత విఽధించారు. రివర్స్‌ పీఆర్‌సీ అమలుచేసి రాష్ట్రంలోని 13లక్షల ఉద్యోగు, ఉపాధ్యాయ, పెన్షర్లను మోసం చేశారు. ఎట్టి పరిస్థితితుల్లోనూ దీనిని అంగీకరించేది లేదు. అన్ని సంఘాలతో కలిసి ఉద్యమాలకు శ్రీకారం చుడతాం.

- మక్కెన శ్రీనివాసరావు, ఏపీటీఎఫ్‌ జిల్లా కార్యదర్శి 


ఉద్యోగ, ఉపాధ్యాయులకు చీకటి రోజు

ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల వల్ల ఉద్యోగ, ఉపాధ్యాయులకు ఇవి చీకటి రోజులు. ఇప్పటికే 27శాతం ఐఆర్‌ ఇస్తున్నప్పటికీ ఫిట్‌మెంట్‌ను 23శాతం ప్రకటించడాన్ని ఉద్యోగ, ఉపాధ్యాయులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. దీనికి తోడు హెచ్‌ఆర్‌ఏ విషయంలో తీవ్ర అన్యాయం చేస్తున్నారు. ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలతో ఎటువంటి చర్చలు జరపకుడా ఇష్టారాజ్యంగా పీఆర్‌సీ ప్రకటించారు. 

- దారపనేని శ్రీనివాసరావు, ఏపీయూఎస్‌ జిల్లా కార్యదర్శి 

 

 మిశ్రా కమిటీ రిపోర్టు బయట పెట్టాలి..

 రాష్ట్ర ప్రభుత్వ అర్ధరాత్రి జీవోలు కుట్రపూరితం. ముందు పీఆర్‌సీ కోసం వేసిన అసుతోష్‌ మిశ్రా కమిటీ రిపోర్టు బయట పెట్టాలి. వేతనాలు పెరగాల్సింది పోయి తగ్గించడం రాష్ట్ర ప్రభుత్వ రివర్స్‌ విధానాలకు నిదర్శనమన్నారు. వెంటనే జీవోలను ఉపసంహరించుకుని ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘ నాయకులతో చర్చించాలి. రాష్ట్ర ఆదాయం బాగున్నప్పటికీ కావాలనే ఉద్యోగులకు ఫిట్‌మెంట్‌ను తగ్గించారు. హెచ్‌ఆర్‌ఏ విషయంలో కూడా దారుణమైన నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వం దిగి రాకుంటే ఉద్యోగ, ఉపాధ్యాయులంతా సమ్మెబాట పడతాం. 

- జీవీఎస్‌ రామకృష్ణ, పీఆర్‌టీయూ జిల్లా అధ్యక్షుడు  

Updated Date - 2022-01-19T05:33:39+05:30 IST