జీవోలు రద్దయితేనే చర్చలు

ABN , First Publish Date - 2022-01-26T08:56:39+05:30 IST

పీఆర్సీ జీవోల పై చర్చలకు రావాలంటూ పదేపదే ప్రభుత్వం చేస్తున్న ప్రకటనలకు ఉద్యోగ నాయకులు స్పందించారు. చర్చల కు వెళ్లలేదుకానీ..మంత్రుల కమిటీని సచివాలయంలో కలుసుకుని తమ డిమాండ్లను మరింత గట్టిగా వినిపిం చి బయటకువచ్చారు. పీఆర్సీ జీవోల రద్దు..

జీవోలు రద్దయితేనే చర్చలు

  • మంత్రుల కమిటీకి తేల్చిచెప్పిన ఉద్యోగులు
  • మూడు షరతులతో కమిటీకి లేఖ అందజేత
  • రేపు చర్చలకు రావాలని కమిటీ ఆహ్వానం


అమరావతి/విజయవాడ, జనవరి 25(ఆంధ్రజ్యోతి): పీఆర్సీ జీవోల పై చర్చలకు రావాలంటూ పదేపదే ప్రభుత్వం చేస్తున్న ప్రకటనలకు ఉద్యోగ నాయకులు స్పందించారు. చర్చల కు వెళ్లలేదుకానీ..మంత్రుల కమిటీని సచివాలయంలో కలుసుకుని తమ డిమాండ్లను మరింత గట్టిగా వినిపిం చి బయటకువచ్చారు. పీఆర్సీ జీవోల రద్దు లేదంటే అబయెన్సులో ఉంచితేనే చర్చలకు వస్తామని తెగేసి చెప్పా రు. అశుతోశ్‌ కమిషన్‌ నివేదికను విడుదల చేయాలని, జనవరి నెలకు పాత వేతనాలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఈ మూడు షరతులకు ప్రభుత్వం అంగీకరిస్తేనే గురువారం మంత్రుల కమిటీతో జరిగే చర్చల్లో పాల్గొంటామని స్పష్టం చేశారు. ఈ మేరకు పీఆర్సీ సాధన సమితి స్టీరింగ్‌ కమిటీ సభ్యులైన ఏపీ ఎన్జీవో సెక్రటరీ జనరల్‌ శివారెడ్డి, ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల జనరల్‌ సెక్రటరీ ఆస్కార్‌రావు, ఏపీ జేఏసీ సెక్రటరీ జనరల్‌ హృదయరాజు, ఏపీ జేఏసీ అమరావతి సెక్రటరీ జనరల్‌ వైవీరావు, ఫ్యాప్టో చైర్మన్‌ జోసెఫ్‌ సుధీర్‌బాబు, ఏపీజీఈఏ సెక్రటరీ జనరల్‌ అరవపాల్‌, సచివాలయ ఉద్యోగుల సంఘం తరఫున రాజేశ్‌ తదితరులు మం త్రుల కమిటీకి లేఖను అందజేశారు.


అంతకముందు... ప్రభుత్వం వేసిన మంత్రుల కమిటీని కలిసి చర్చలు జరపడానికి  సచివాలయానికి రావాల్సిందిగా ఉద్యోగ నేతలను జీఏడీ ముఖ్యకార్యదర్శి శశిభూషణ్‌కుమార్‌ ఆహ్వానించారు. ఈ ఆహ్వానంపై చర్చించడానికి విజయవాడలోని ఎన్జీవో హోమ్‌లో స్టీరింగ్‌ కమిటీ నేతలు సమావేశమయ్యారు. అయితే, ఇప్పటి వరకు తాము చెప్పిన ఏ అంశంపైనా ప్రభుత్వం నుంచి సానుకూల నిర్ణయం రాని కారణంగా చర్చలకు వెళ్లకూడదని తీర్మానించుకున్నారు. తమ డిమాండ్లను మరింత గట్టిగా తెలియజేస్తూ మంత్రుల కమిటీకి లేఖ రాయాలని నిర్ణయించారు. ఆ లేఖను స్టీరింగ్‌ కమిటీ సభ్యులు స్వయం గా వెళ్లి మంత్రుల కమిటీకి అందజేయాలని నిశ్చయించారు. ఈ నిర్ణయం మేరకు స్టీరింగ్‌ కమిటీలోని తొమ్మిదిమంది సభ్యులు సచివాలయానికి చేరుకుని మంత్రుల కమిటీని కలుసుకుని లేఖను అందించారు.  


సీఎ్‌సపై వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నా.. కేఆర్‌ 

 రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్‌ శర్మపై గతంలో చేసిన వ్యాఖ్యలకు ఇప్పటికీ కట్టుబడి ఉన్నానని ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం జేఏసీ అధ్యక్షుడు కేఆర్‌ సూర్యనారాయణ మరోసారి స్పష్టం చేశారు. తన వ్యాఖ్యలను ఐఏఎస్‌ అధికారుల సంఘం ఖండించిన నేపథ్యంలో, తాను కూడా స్పందించానని అన్నారు.


జీవోలను వెనక్కి తీసుకోలేం

ఉద్యోగ నాయకుల డిమాండ్‌ సరికాదు

రేపు చర్చలకు రావాలని కోరాం : సజ్జల

ఒకసారి జారీ చేసిన జీవోలను వెనక్కి తీసుకోవాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్‌ చేయడం సరికాదని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. మంగళవారం అమరావతి సచివాలయంలో స్టీరింగ్‌ కమిటీ నేతలు మంత్రుల కమిటీని కలిసిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘‘మాది ఉద్యోగుల ఫ్రెండ్లీ ప్రభుత్వం. అడిగినా అడగకపోయినా ఉద్యోగులకు చేయగలిగినదంతా చేస్తాం. ఎవ్వరికీ ఒక్కరూపాయి తగ్గకుండా ప్రయోజనాలు అందిస్తాం. సీఎం జగన్‌ ఉద్యోగులకు అన్నీ అడగకుండానే ఇచ్చారు. అయినా, ఈ రకమైన వాతావరణం తలెత్తడం సరికాదు. ఎక్కడ లోపాలు ఉన్నాయో చర్చించడానికి ఉద్యోగ సంఘాల నేతలు రావాలి’’ అని సజ్జల కోరారు. తమను కలిసిన స్టీరింగ్‌ కమిటీ నేతలకు ఇదే విషయం తెలియజేశామని ఆయన వివరించారు. ‘‘పీఆర్సీ జీవోలను రద్దుచేయాలని లేదంటే అబయెన్స్‌లో ఉంచాలని ఉద్యోగనేతలు కోరడం సబబు కాదు. ఇంతకాలం చేసిన ప్రక్రియను తిరగదోడటం సరికాదు. పీఆర్సీలో ఏమైనా మార్పులు చేయాలంటే.. వాటి గురించి మాట్లాడేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఈ నెల 27వ తేదీన చర్చలకు రావాలని ఉద్యోగ సంఘాల నేతలను కోరాం’’ అని సజ్జల తెలిపారు. 

Updated Date - 2022-01-26T08:56:39+05:30 IST