దగాకోరు పీఆర్సీ... అందుకే సమ్మెలోకి

ABN , First Publish Date - 2022-01-25T07:05:57+05:30 IST

అర్ధరాత్రి జీవోలు విడుదల చేసి దగాకోరు పీఆర్సీ ప్రవేశపెట్టారని, ఆ జీవోలను తక్షణం రద్దు చేయాలని పీఆర్సీ సాధన సమితి నేతలు డిమాండ్‌ చేశారు.

దగాకోరు పీఆర్సీ... అందుకే సమ్మెలోకి
సమావేశంలో మాట్లాడుతున్న ఏఐటీయూసీ జిల్లా ఉపాధ్యక్షుడు తాటిపాక మధు

తప్పనిసరి పరిస్థితుల్లోనే నిర్ణయం...   ప్రజలు మద్దతు తెలపాలి

రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో పీఆర్సీ సాధన సమితి నేతలు

రాజమహేంద్రవరం అర్బన్‌, జనవరి 24: అర్ధరాత్రి జీవోలు విడుదల చేసి దగాకోరు పీఆర్సీ ప్రవేశపెట్టారని, ఆ జీవోలను తక్షణం రద్దు చేయాలని పీఆర్సీ సాధన సమితి నేతలు డిమాండ్‌ చేశారు. మెరుగైన పీఆర్సీ   ఇస్తామని చెప్పి రాష్ట్రవ్యాప్తంగా ఉద్యోగ, ఉపాధ్యాయ, కాంట్రాక్టు కార్మికులు, పింఛనుదారులను మోసం చేయడంతో తప్పని పరిస్థితుల్లో సమ్మెకు వెళ్తున్నామని, ప్రజలంతా మద్దతు ఇవ్వాలని కోరారు. సోమవారం  సాయంత్రం నగరంలోని ఎన్జీవో హోమ్‌లో పీఆర్సీ సాధన సమితి నాయకులతో రౌండు టేబుల్‌ సమావేశం నిర్వహించారు. ఏపీటీఎఫ్‌ నాయకుడు సత్యనారాయణ, ఏపీజీఈఏ నాయకుడుమాధవరావు, ఏయూఈఓఎస్‌  నాయకుడు వేణుమాధవ్‌, ఏఐటీయూసీ  జిల్లా ఉపాధ్యక్షుడు తాటిపాక మధు, ఏపీజేఏసీ నాయకులు విజయకృష్ణ, ఏపీసీపీఎస్‌ నాయకుడు  అనిల్‌కుమార్‌, సీఐటీయూ నాయకులు పవన్‌, నాగమణి, సత్యనారాయణ, అప్పారావు, మంగతాయారు, వీవీ రమణ మాట్లాడారు. పీఆర్సీ జీవోల రద్దు, మెరుగైన పీఆర్సీ, ఇతర డిమాండ్ల సాధనకు రాష్ట్ర స్టీరింగ్‌ కమిటీ ఇచ్చిన పిలుపును అందరూ అమలు చేయాలన్నారు. 25న కాకినాడ కలెక్టరేట్‌ వద్ద ఆందోళనకు ఉద్యోగులంతా   తరలిరావాలని పిలుపునిచ్చారు. 26న అన్ని  ప్రాంతాల్లో రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌  అంబేడ్కర్‌ విగ్రహాలకు వినతిపత్రాలు ఇస్తామని, వచ్చే నెల 3న ‘చలో విజయవాడ’ నిర్వహిస్తామని, 6వ తేదీ అర్ధరాత్రి నుంచి సమ్మెలోకి వెళ్తామని స్పష్టం చేశారు.

Updated Date - 2022-01-25T07:05:57+05:30 IST