సూర్యాపేట: కరోనా వ్యాధి కారణంగానే ఉద్యోగులకు పీఆర్సీ ప్రకటించడం ఆలస్యమైందని మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. సూర్యాపేటలో పెన్షనర్ల ఆత్మీయ సమ్మేళనం జరిగింది. ఈ సమ్మేళనంలో పాల్గొన్న మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ ఉద్యోగులను ఇబ్బంది పెట్టడం తమ ప్రభుత్వ అభిమతం కాదన్నారు. కరోనా కారణంగా ఆర్థికస్థితి బాగా లేకపోయినా ఉద్యోగులందరికి జీతాలు ఇచ్చామన్నారు.
విదేశాలలో ఉన్న నల్లడబ్బును తిరిగి దేశానికి రప్పిస్తామంటూ అధికారంలోకి వచ్చిన బీజేపీ దేశ ప్రజలను మోసం చేసిందని ఆయన విమర్శించారు. 70 ఏళ్లలో ఎన్నికల మ్యానిఫెస్టోను అమలు పరచింది టీఆర్ఎస్ పార్టీ ఒక్కటేనని జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. పెన్షనర్లు ఎదుర్కొంటున్న సమస్యలను తమ ప్రభుత్వం పరిష్కరిస్తుందని మంత్రి జగదీష్ రెడ్డి తెలిపారు.