ప్రభుత్వ సూచనల మేరకు ప్రార్థనలు చేసుకోవాలి

ABN , First Publish Date - 2021-04-16T06:20:24+05:30 IST

జిల్లాలో కరోనా వైరస్‌ విజృంభిస్తున్న నేపథ్యంలో రంజాన్‌ మాసంలో ప్రభుత్వ సూచనల మేరకు ప్రార్థనలు చేసుకోవాలని కలెక్టర్‌ కె శశాంక తెలిపారు.

ప్రభుత్వ సూచనల మేరకు ప్రార్థనలు చేసుకోవాలి
సమావేశంలో మాట్లాతున్న జిల్లా కలెక్టర్‌ కె శశాంక

కలెక్టర్‌ కె శశాంక

కరీంనగర్‌, ఏప్రిల్‌ 15 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): జిల్లాలో కరోనా వైరస్‌ విజృంభిస్తున్న నేపథ్యంలో రంజాన్‌ మాసంలో ప్రభుత్వ సూచనల మేరకు ప్రార్థనలు చేసుకోవాలని  కలెక్టర్‌ కె శశాంక తెలిపారు. గురువారం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో రంజాన్‌ ఏర్పాట్లపై పోలీస్‌ కమిషనర్‌, మున్సిపల్‌ కమిషనర్‌, జిల్లా అధికారులు, ముస్లిం మత పెద్దలతో సమావేశం నిర్వహించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ముస్లింలు ప్రభుత్వ నిబంధనల మేరకు భౌతిక దూరం పాటిస్తూ మాస్కు ధరించి, శానిటైజర్‌ వినియోగించి ప్రార్థనలు జరుపుకోవాలని అన్నారు. మసీదుల వద్ద పారిశుధ్య పనులకు ప్రత్యేక డ్రైవ్‌ చేపట్టాలని, మసీదుల వద్ద స్ర్టీట్‌ లైట్లను ఏర్పాటు చేయాలని, తాగునీరు రోజు సరఫరా చేయాలని,  మున్సిపల్‌ కార్పొరేటర్లు కోరిన విధంగా సమస్యలను పరిష్కరించాలని మున్సిపల్‌ కమిషనర్లను ఆదేశించారు. గ్రామీణ ప్రాంతాల్లో నీటి సమస్య రాకుండా చూడాలని జిల్లా పంచాయతీ అధికారిని కలెక్టర్‌ ఆదేశించారు. నిరంతరాయంగా విద్యుత్‌ సరఫరా చేయాలని ప్రత్యేకించి ఉదయం 3 నుంచి 6 గంటల వరకు, సాయంత్రం 4:30 నుంచి రాత్రి 10 గంటల వరకు సరఫరాలో అంతరాయం లేకుండా చూడాలని ఎలక్ర్టీసిటీ డీఈని ఆదేశించారు. 45 సంవత్సరాలు పైబడిన వారందరూ తప్పనిసరిగా వ్యాక్సినేసన్‌ చేయించుకునేలా మసీదులలో ప్రచారం చేయాలని, వ్యాక్సినేషన్‌ చేసుకునేలా ముస్లిం మతపెద్దలకు కలెక్టర్‌ విజ్ఞప్తి చేశారు.  మోతాజ్‌ఖానా, బుట్టిరాజారాం కాలనీ, హౌజింగ్‌బోర్డు కాలనీలో వ్యాక్సినేషన్‌ కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. జిల్లాకు 7500 గిఫ్ట్‌ ప్యాకెట్లు వచ్చాయని, వాటిని ఆర్డీవో, తహసీల్దార్లు, మున్సిపల్‌ కమిషనర్ల ఆధ్వర్యంలో పంపిణీ చేయాలని కలెక్టర్‌ ఆదేశించారు. 

పోలీస్‌ కమిషనర్‌ వీబీ కమలాసన్‌ రెడ్డి మాట్లాడుతూ జిల్లాలో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరు ప్రభుత్వ నిబంధనలను పాటించి రంజాన్‌  ప్రార్థనలు చేసుకోవాలని సూచించారు. కరోనా నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వు నెం. 68, 69 జారీ చేసిందని, దానిలోని సూచనల మేరకు ప్రార్థనలు జరుపుకోవాలని ముస్లిం మతపెద్దలకు విజ్ఞప్తి చేశారు. ప్రార్థన సమయంలో, బయట సమూహం ఉండకుండా ప్రతి ఒక్కరూ తమని తాము కరోనా బారిన పడకుండా కాపాడుకోవాలని అన్నారు. ఇఫ్తార్‌ పార్టీలకు అవకాశం ఇవ్వవద్దని సూచించారు. మాస్కు లేకుండా తిరిగితే జరిమానా వేయడం జరుగుతుందన్నారు. వాహనదారులు ప్రతి ఒక్కరు హెల్మెట్‌ ధరించాలన్నారు. రాత్రిపూట పండ్లు అమ్ముకునేందుకు ఎలాంటి పరిమితులు విధించలేదని, గుంపులుగా లేకుండా చూసుకోవాలన్నారు. నెలాఖరు వరకు ప్రభుత్వ నిబంధనలు అమలులో ఉంటాయన్నారు. 

మున్సిపల్‌ కమిషనర్‌ వల్లూరి క్రాంతి మాట్లాడుతూ పట్టణంలోని అన్ని మసీదు ప్రాంతాలు శానిటైజేషన్‌, బ్లీచింగ్‌ పౌడర్‌ చల్లడం జరుగుతుందన్నారు. నీటి సమస్య తలెత్తకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటామన్నారు. మసీదుల వద్ద వీధి దీపాలు ఏర్పాటు, ప్రత్యేక శానిటేషన్‌ డ్రైవ్‌ చేపట్టనున్నట్లు ఆమె తెలిపారు. సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్‌ శ్యాంప్రసాద్‌లాల్‌, జిల్లా మైనార్టీ సంక్షేమాధికారి మధుసూదన్‌, మెప్మా పీడీ రవీందర్‌, ఇన్‌చార్జి పంచాయతీ అధికారి హరికిషన్‌, ఆర్డీవోలు ఆనంద్‌ కుమార్‌, పిబెన్‌ షలోమ్‌, ఎలక్ర్టిసిటీ డీఈ, మున్సిపల్‌ కమిషనర్లు, ముస్లిం మతపెద్దలు కరీంనగర్‌ సదర్‌ ఖాజీ అహ్మద్‌ ముఖయర్‌ షా ఖాన్‌, మాజీ మున్సిపల్‌ డిప్యూటీ మేయర్‌ అబ్బాస్‌ సమీ, కరీంనగర్‌ జమాతే ఇస్లామీ హింద్‌ ప్రెసిడెంట్‌ ఎంఏ హైలతీఫి, ఎంఏ సమద్‌ నవాబ్‌, యూసుఫ్‌, మీర్జా అస్మత్‌ అలీ బేగ్‌, సలీం తవక్కల్‌, ఎస్‌ఏ మోహసిన్‌, తదితరులు పాల్గొన్నారు. 


దాన్యం కొనుగోలు కేంద్రాలను వెంటనే ప్రారంభించాలి


కరీంనగర్‌, ఏప్రిల్‌ 15 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): యాసంగి ధాన్యం కొనుగోలు కేంద్రాలను వెంటనే ప్రారంభించాలని కలెక్టర్‌ కె శశాంక అన్నారు. గురువారం కలెక్టర్‌ క్యాంపు కార్యాలయం నుంచి ఆర్డీవోలు, తహసీల్దార్లు, సివిల్‌ సప్లయీస్‌ అధికారులతో ధాన్యం కొనుగోలు, వ్యాక్సినేషన్‌, భూ సమస్యల వివరాలు, తదితర అంశాలపై టెలీ కాన్ఫరెన్సు నిర్వహించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలో వరి కోతలు ప్రారంభమైనందున రైతులు ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకువస్తారని,  కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి కొనుగోళ్లకు పూర్తిస్థాయిలో సిద్ధంగా ఉంచాలని ఆదేశించారు. కొనుగోలు కేంద్రాల్లో రైతులు ఇబ్బందులు పడకుండా అన్ని ఏర్పాట్లు  చేయాలని ఆదేశించారు. వ్యవసాయాధికారులు నిర్ణయించిన తేదీలో రైతులు ధాన్యం తీసుకువచ్చేలా చూడాలన్నారు. రైతులకు వ్యవసాయాధికారులు టోకెన్లు జారీ చేస్తారని, వారితో సమన్వయం చేసుకోవాలని కలెక్టర్‌ తహసీల్దార్లకు సూచించారు. ధాన్యం కొనుగోలుకు సంబంధించి ధాన్యాన్ని రైస్‌మిల్లర్లకు కేటాయింపు, గన్నీ బ్యాగుల కొరత, రవాణా సమస్యలు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సివిల్‌ సప్లయీస్‌ డీఎంను ఆదేశించారు. రెవెన్యూ, సివిల్‌ సప్లయీస్‌ శాఖలలో పనిచేస్తున్న సిబ్బంది అందరికి శుక్రవారంలోగా వందశాతం వ్యాక్సినేషన్‌ చేయించాలని కలెక్టర్‌ అధికారులను ఆదేశించారు. రెవెన్యూలో పనిచేసే సిబ్బంది ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలులో ఎక్కువగా ప్రజలతో మమేకమవుతారని, వారందరికి వ్యాక్సినేషన్‌ చేయించాలని ప్రభుత్వం ఆదేశించిందన్నారు. షుగర్‌, బీపీ, డయాలసిస్‌తో బాధపడుతున్న వారికి తప్ప మిగిలిన ఉద్యోగులందరికి వ్యాక్సినేషన్‌ చేయించాలని కలెక్టర్‌ ఆదేశించారు. భూ సమస్యల సవరణలకు సంబంధించి కొత్త చెక్‌ లిస్టు ప్రకారం వివరాలను వెంటనే పంపించాలని కలెక్టర్‌ ఆదేశించారు. పట్టాదారు పాసుపుస్తకంలో తప్పుల సవరణకు ప్రభుత్వం వెసలుబాటు కల్పించిందని, దాని ప్రకారం మండలంలో పెండింగ్‌లో ఉన్న సమస్యల వివరాలను పంపించాలని కలెక్టర్‌ ఆదేశించారు. మండలాల్లో సవరణలకు సంబంధించిన ప్రతిపాదనలు పంపుటకు అదనంగా సిబ్బందిని ఏర్పర్చుకోవాలన్నారు. రోజు వివరాలు పంపించాలని, జిల్లాలో భూ సమస్యల పరిష్కారాల రేట్‌ పెరగాలన్నారు. టెలీ కాన్ఫరెన్సులో కరీంనగర్‌, హుజురాబాద్‌ ఆర్డీవోలు ఆనంద్‌ కుమార్‌, పి బెన్‌షలోమ్‌, జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి సురేష్‌, సివిల్‌ సప్లయీస్‌ డీఎం శ్రీకాంత్‌ రెడ్డి,  తహసీల్దార్లు, పాల్గొన్నారు. 


Updated Date - 2021-04-16T06:20:24+05:30 IST