దేవుడిని వేడుకోండి... వాడుకోవద్దు

ABN , First Publish Date - 2021-01-19T05:46:36+05:30 IST

రాజకీయంగా లబ్ధి పొందాలనుకునే వారు దేవుడిని వేడుకోవాలి తప్ప.. వాడుకోవద్దని విశాఖ రేంజ్‌ డీఐజీ రంగారావు హితవు పలికారు. సంతబొమ్మాళి పాలేశ్వరస్వామి ఆలయంలోని నంది విగ్రహాన్ని రోడ్డు జంక్షన్‌ మధ్య ఏర్పాటు చేయడంపై వివాదం రేగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సోమవారం ఆలయంలో నంది విగ్రహాన్ని డీఐజీ పరిశీలించారు.

దేవుడిని వేడుకోండి... వాడుకోవద్దు
పాలేశ్వరస్వామి ఆలయంలో నంది విగ్రహం పరిశీలిస్తున్న డీఐజీ రంగారావు

-డీఐజీ రంగారావు హితవు

సంతబొమ్మాళి, జనవరి 18: రాజకీయంగా లబ్ధి పొందాలనుకునే వారు  దేవుడిని వేడుకోవాలి తప్ప.. వాడుకోవద్దని విశాఖ రేంజ్‌ డీఐజీ రంగారావు హితవు పలికారు. సంతబొమ్మాళి పాలేశ్వరస్వామి ఆలయంలోని నంది విగ్రహాన్ని రోడ్డు జంక్షన్‌ మధ్య ఏర్పాటు చేయడంపై వివాదం రేగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సోమవారం ఆలయంలో నంది విగ్రహాన్ని డీఐజీ పరిశీలించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ‘రాజకీయ దురుద్దేశంతో సమాజంలో అశాంతి, అభద్రతాభావం నెలకొల్పేందుకు ఆలయంలోని నంది విగ్రహాన్ని నడిరోడ్డుపై పెట్టారు. వారిపై కేసు నమోదు చేశాం. ఇటువంటి పనులు ఎవరు.. ఎందుకు చేస్తున్నారనే విషయమై పూర్తిస్థాయిలో నిర్ధారించాల్సి ఉంది. కొన్ని వర్గాలు కావాలనే ఇటువంటి చర్యలు చేస్తున్నాయి. దీని వెనుక ఎవరెవరు ఉన్నారు. ఏ ఉద్దేశంతో చేస్తున్నారో ప్రజలు అర్థం చేసుకుని శాంతియుతంగా ఉండాలి’ అని కోరారు. ఇటువంటి చర్యలు మంచిది కాదని, దీని వెనుక ఎవరు ఉన్నా అరెస్టు చేస్తామని తెలిపారు. నంది విగ్రహం తరలింపులో ఓ రాజకీయ పార్టీ నేతలు ఉన్నట్లు ప్రాఽథమికంగా గుర్తించి సోమవారం ఆరుగురుని అరెస్టు చేశామన్నారు. డీజీపీ ఆదేశాల మేరకు దేవదాయ శాఖ ఆలయాలు, ప్రైవేటు ఆలయాలను గుర్తించామని తెలిపారు. ఆలయాల రక్షణ కోసం సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని కోరామన్నారు. గ్రామాల్లో యువకులతో రక్షణ స్క్వాడ్‌ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. డీఐజీ వెంట ఎస్పీ అమిత్‌బర్దర్‌, కాశీబుగ్గ డీఎస్పీ శివరామిరెడ్డి, టెక్కలి సీఐ నీలయ్య, సంతబొమ్మాళి, నౌపడ ఎస్‌ఐలు యం.గోవింద, మహ్మద్‌ యాసిన్‌లు  ఉన్నారు.                                                                      


Updated Date - 2021-01-19T05:46:36+05:30 IST