ఇంటిలోనే ప్రార్థన చేద్దాం!

ABN , First Publish Date - 2020-04-03T06:35:47+05:30 IST

కఠినమైన విపత్కర పరిస్థితులు ఉన్నప్పుడు... అంటే భారీ వరదలు, వర్షాలు, భయాందోళనలు, అంటువ్యాధులు ప్రబలుతున్నప్పుడు ఇంట్లోనే నమాజ్‌ చేసుకోవాలని దైవప్రవక్త మహమ్మద్‌...

ఇంటిలోనే ప్రార్థన చేద్దాం!

  • సందేశం


కఠినమైన విపత్కర పరిస్థితులు ఉన్నప్పుడు... అంటే భారీ వరదలు, వర్షాలు, భయాందోళనలు, అంటువ్యాధులు ప్రబలుతున్నప్పుడు ఇంట్లోనే నమాజ్‌ చేసుకోవాలని దైవప్రవక్త మహమ్మద్‌ సూచించారు. అలాంటి పరిస్థితులలో ఇంట్లో చేసే నమాజుకు మసీదులో జమా అత్‌తో కలిసి చేసే పుణ్యాలకు సమానమైన పుణ్యం లభిస్తుందని స్పష్టం చేశారు. 


ప్రస్తుతం ప్రపంచాన్ని భయపెడుతున్న కరోనా వైరస్‌ కారణంగా కొద్ది నెలలపాటు ఉమ్రాలను తాత్కాలికంగా ఆపుచేస్తున్నారు. అంటువ్యాధుల కారణంగా మసీదులను కూడా కొంతకాలం మూసేస్తున్నారు. వ్యక్తుల మధ్య సామాజిక దూరం పెంచి, కరోనాను కట్టడి చెయ్యడానికి గృహ నిర్బంధాన్ని ప్రపంచ వ్యాప్తంగా ప్రభుత్వాలు ప్రకటించాయి. దానిలో అందరూ భాగస్వాములు కావలసిందే! కొద్దికాలం శుక్రవారం నమాజుల కోసం మసీదులకు వెళ్ళకుండా, ఇళ్ళలోనే నమాజ్‌ చదువుకోవచ్చు. ఎందుకంటే ఎదురుగా ప్రమాదకరమైన కారణం ఉంది కాబట్టి! అల్లాహ్‌ ఈ విధంగా తెలిపారు:

‘‘మనం ఒకరి ప్రాణం కాపాడినా సకల మానవాళి ప్రాణాలూ కాపాడినట్టే.’’ (దివ్య ఖుర్‌ఆన్‌- అల్‌ మాయిదా 5:32)

‘‘చేతులారా! మిమ్మల్ని మీరు వినాశనం పాలు చేసుకోకండి. మేలు చేయండి. మేలు చేసేవారిని అల్లాహ్‌ ప్రేమిస్తాడు.’’ (దివ్య ఖుర్‌ఆన్‌- అల్‌ బఖర 2:195)

దేవునిపై బలమైన విశ్వాసాలు ఉండడంలో తప్పులేదు. అయితే అవి మొండిగా ఉండకూడదు. పరిస్థితులు సహకరించనప్పుడు మన ప్రాణాలనూ, ఇతరుల ప్రాణాలనూ అపాయంలో పడేసి, విశ్వాస నిరూపణ చేసుకోవాలని దేవుడు ఎక్కడా చెప్పలేదు. ఎందుకంటే మనిషి శ్రేయస్సు కోసమే ధర్మం ఉంది. దీనికి సంబంధించి ఇస్లామ్‌ సంప్రదాయంలో రెండు సంఘటనలున్నాయి.


మసీదులోనే చేయనక్కరలేదు!

ఒకరోజు రాత్రి తీవ్రమైన ఈదురుగాలులు వీస్తున్నాయి. మహాప్రవక్తకు అనుయాయుడైన హజ్రత్‌ అబ్దుల్లా బిన్‌ ఉమర్‌ ప్రార్థనకు అందరినీ పిలిచే (అజాన్‌) సమయం అది. ఆయన ‘‘నమాజ్‌ కోసం అందరూ మసీదుకు రండి’’ అని పిలవడానికి బదులు ‘‘ప్రజలారా! మీరు మీ ఇళ్ళలోనే నమాజ్‌ చేసుకోండి’’ అని ప్రకటించారు. ‘‘రాత్రివేళ బాగా చలిగా ఉన్నప్పుడు కానీ, కుండపోత వర్షం కురుస్తున్నప్పుడు కానీ ప్రజలు వారి ఇళ్ళలోనే ఉండి నమాజ్‌ చేసుకోవాలని ప్రకటించాల్సిందిగా ముఅజ్జిన్‌ను (నమాజ్‌కు పిలిచేవారిని) దైవ ప్రవక్త ఆదేశించేవారు’’ అని ఉమర్‌ వెల్లడించారు. (హదీస్‌ గ్రంథం: బుఖారీ ముస్లిమ్‌)


గతంలోనూ మూసేశారు!

విపత్కర పరిస్థితులు తలెత్తినప్పుడు ప్రార్థనా మందిరాలు మూతపడడం చరిత్రలో కొత్త విషయమేమీ కాదు. గత 1400 ఏళ్ళ కాలంలో మక్కాలో ఉన్న కాబా మసీదును వివిధ కారణాలతో దాదాపు 40 సార్లు మూసివేశారు. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది వాస్తవం. ఇప్పుడు విలయతాండవం చేస్తున్న కరోనా లాంటి వైరస్‌ల వల్ల ఉమ్రాలను మాత్రమే కాదు, హజ్‌ యాత్రలను సైతం ఆపేసి, మొత్తం కాబా మసీదునే మూసెయ్యడం (లాక్‌డౌన్‌) గతంలో జరిగింది. వాటిలో కొన్ని సందర్భాలు:

  • మక్కాలో 1814లో ప్లేగు వ్యాధి ప్రబలి, సుమారు 8 వేల మంది మరణించారు. అప్పుడు తవ్వాఫ్‌, సామూహిక నమాజ్‌లను కొన్నాళ్ళు ఆపేశారు. మస్జిదే హరామ్‌ను కొంతకాలం పూర్తిగా లాక్‌డౌన్‌ చేశారు.
  • మక్కా, మదీనా పట్టణాల్లో 1837లో ఒక ప్రమాదకరమైన వైరస్‌ వీరవిహారం చేసింది. అది దాదాపు మూడేళ్ళపాటు అనేకమందిని పొట్టన పెట్టుకొని, 1840లో తగ్గుముఖం పట్టింది. అప్పుడు కూడా మస్జిదే హరామ్‌ మూతపడింది.
  • మక్కాలో 1845లో ‘కొలిరా’ అనే వైరస్‌ వ్యాప్తి చెందింది. ఆ తరువాత 1864, 1892 సంవత్సరాల్లో సైతం వైరస్‌ల వ్యాప్తి కారణంగా వేల కొద్దీ హజ్‌ యాత్రికులు మరణించారు. ఆ సంవత్సరాల్లో సైతం కాబా మసీదును మూసేశారు.

ఇటువంటిదే మరో సంఘటన...

‘‘మీ మీ ఇళ్ళలోనే ఉండి నమాజ్‌ చేసుకోండి’’ అని అజాన్‌ చెప్పాల్సిందిగా ఒక శుక్రవారం రోజున ముఅజ్జిన్‌ను మహా ప్రవక్త బంధువు, తొలినాటి ఖుర్‌ఆన్‌ పండితుల్లో ఒకరు అయిన హజ్రత్‌ ఇబ్నే అబ్బాస్‌ ఆజ్ఞాపించారు. ఇది విని ప్రజలు ఆశ్చర్యపోయారు. అప్పుడు ఇబ్నె అబ్బాస్‌ మాట్లాడుతూ ‘‘నాకన్నా ఎంతో శ్రేష్ఠుడైన దైవ ప్రవక్త ఈ విధంగానే ఆచరించారు. జమా నమాజ్‌ అనేది విధిగా చేయవలసిన ప్రార్థన అనేది నిజమే. అయితే మిమ్మల్ని  ఇబ్బందులకు గురి చేయడం నాకు ఇష్టం లేదు’’ అని చెప్పారు. (హదీస్‌ గ్రంథం: బుఖారీ)

‘‘ఒక దేశంలో (ప్లేగు) వ్యాధి వ్యాపించి ఉందని మీరు విన్నట్టయితే అక్కడకు వెళ్ళవద్దు. మీరు ఉన్న దేశంలో అది విస్ఫోటనం చెందితే అక్కడి నుంచీ కదలకూడదు’’ అని (హదీస్‌ గ్రంథం: బుఖారీ) దైవప్రవక్త తెలిపారు.  ఎక్కడైనా అంటువ్యాధులు వ్యాపించి ఉంటే అక్కడికి వెళ్ళకూడదనీ, ఉన్న చోటు నుంచి మరొక ప్రదేశానికి పోకూడదనీ ఆయన చెప్పిన నీతిని మరచిపోకూడదు.

-మహమ్మద్‌ వహీదుద్దీన్‌



Updated Date - 2020-04-03T06:35:47+05:30 IST