‘రొయ్యి’రయ్యిన..

ABN , First Publish Date - 2022-08-18T06:18:45+05:30 IST

‘రొయ్యి’రయ్యిన..

‘రొయ్యి’రయ్యిన..
వనామీ రొయ్యలను ప్యాకింగ్‌ చేస్తూ..

వనామీ రొయ్యలు అ‘ధర’హో

కిలోకు 100 కౌంట్‌ ఉన్నవాటి రేటులో భారీ పెరుగుదల

సాగు విస్తీర్ణం తగ్గడంతో పెరిగిన డిమాండ్‌ 

మిగతా కౌంట్‌ రొయ్యల ధరల్లోనూ పెంపు

30 కౌంట్‌ ఉన్నవి మాత్రం తగ్గుదల

అమెరికా నుంచి బ్రూడర్‌ రొయ్యలు తెచ్చి సీడ్‌ ఉత్పత్తి 


ఎన్నడూ లేనంతగా రొయ్యల ధరలు రయ్యిరయ్యిన దూసుకుపోతున్నాయి. వర్షాకాలం సాగు విస్తీర్ణం తగ్గడంతో, ఎక్కువ కౌంట్‌ ఉన్న రొయ్యల ధరలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. ఈ వాతావరణం ఎగుమతులకు అనుకూలమని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 


ఆంధ్రజ్యోతి-మచిలీపట్నం : వనామీ రొయ్యల ధర మునుపెన్నడూ లేని విధంగా గరిష్ట స్థాయికి చేరింది. గత ఐదేళ్లలో ఎన్నడూ లేని విధంగా చిన్న కౌంట్‌ వనామీ రొయ్యలకు మంచి ధర పలుకుతోంది. కిలోకు వంద కౌంట్‌ ఉన్న రొయ్యల ధర ప్రస్తుతం రూ.290కు చేరింది. రెండు వారాలుగా చిన్నసైజు రొయ్యల ధరల్లో పెరుగుదల కనిపిస్తోంది. కిలోకు 60 నుంచి 100 కౌంట్‌ ఉన్న రొయ్యల ధరలు పెరుగుతుండగా, 30 కౌంట్‌ ఉన్న రొయ్యల ధర తగ్గింది. మేలో 100 కౌంట్‌ ఉన్న వనామీ రొయ్యల ధర కిలో రూ.220 ధర పలికింది. ప్రస్తుతం రూ.290కు చేరింది. వనామీ సాగుకు అనుకూలమైన వాతావరణం వేసవి. వర్షాకాలం ప్రారంభమయ్యాక ఈ సాగును చాలావరకు నిలిపివేస్తారు. సాగు విస్తీర్ణం తగ్గడంతో రొయ్యలకు ధరను పెంచి వ్యాపారులు కొంటున్నారు. 

విదేశాలకు ఎగుమతులు

జిల్లాలో లక్ష ఎకరాలకు పైగా వనామీ, టైగర్‌ రొయ్యల సాగు జరుగుతోంది. ఈ ఏడాది వేసవికాలం పంటకు నాణ్యమైన సీడ్‌ దొరక్క ఆశించిన మేర దిగుబడులు రాలేదు. 110 రోజుల వ్యవధిలో 30 కౌంటుకు రావాల్సిన రొయ్యల్లో ఎదుగుదల తగ్గింది. ఆశించిన మేర కౌంట్‌ వచ్చే వరకూ అంటే.. మరో నెల అదనపు ఖర్చులు భరించి రొయ్యలను పెంచాల్సి వచ్చింది. ప్రస్తుతం చైనాలో చిన్న కౌంట్‌ రొయ్యలకు డిమాండ్‌ ఉంది. 60 నుంచి 100 కౌంట్‌ ఉన్న రొయ్యల ఎగుమతులకు పరిస్థితులు అనుకూలంగా ఉండటంతో ధరలు పెరుగుతున్నాయని వ్యాపారులు చెబుతున్నారు. కరోనా సమయంలో రెండేళ్ల పాటు విదేశాలకు ఎగుమతులు నిలిచిపోవడంతో రొయ్యల ధరలు గణనీయంగా తగ్గాయి. ఈ ఏడాది జనవరి నుంచి ధరలు స్థిరంగా ఉండటంతో ఆక్వా రైతులకు కొంతమేర ఊరట లభించింది.

అమెరికా నుంచి బ్రూడర్‌

కరోనా నేపథ్యంలో రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో ఉన్న హేచరీల్లో బ్రూడర్‌ రొయ్యల నుంచి పదేపదే సీడ్‌ను ఉత్పత్తి చేశారు. దీంతో నాణ్యమైన సీడ్‌ లభించక ఆక్వా రైతులు నష్టపోతూ వచ్చారు. బ్రూడర్‌ నుంచి మొదటి, రెండో దశల్లో తీసిన రొయ్య పిల్లలు ఆరోగ్యంగా ఉంటాయి. అధిక కాలం జీవించి  రైతులకు లాభాల పంట పండిస్తాయి. కరోనా కారణంగా బ్రూడర్‌ రొయ్యలను సేకరించి వాటి నుంచి నాణ్యమైన సీడ్‌ను ఉత్పత్తి చేయడం ఇటీవల కాలంలో తగ్గిపోయింది. ఈ నేపథ్యంలో ఎంపెడా ద్వారా అమెరికా నుంచి బ్రూడర్‌ రొయ్యలను తెచ్చి జబ్బుల బారిన పడని సీడ్‌ను ఉత్పత్తి చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. అమెరికా నుంచి తెచ్చిన బ్రూడర్‌ రొయ్యల నుంచి సీడ్‌ ఉత్పత్తి జరుగుతుందని, జనవరి నాటికి  రైతులకు అందుబాటులో ఉంచుతామని ఎంపెడా అధికారులు చెబుతున్నారు. స్థానికంగా లభించే బ్రూడర్‌ రొయ్యల నుంచి మూడు, నాలుగు, ఐదు దశల్లో తీసిన సీడ్‌ తక్కువ రోజులు జీవించడంతో పాటు రోగాల బారిన పడి త్వరగా చనిపోయే ప్రమాదం ఉంది. 

బ్రూడర్‌పైనే ఆశలు

నాణ్యత లేని సీడ్‌ కారణంగా రొయ్యల సాగులో విశేష అనుభవం ఉన్న రైతులు గత ఏడాదిన్నర కాలంగా నష్టాలు చవిచూశారు. అమెరికా నుంచి  తెచ్చిన బ్రూడర్ల విత్తనోత్పత్తి జరిగి, ఎలాంటి ఇబ్బందులు లేకుండా రొయ్యల సాగు చేపడితే ఆక్వా సాగు ద్వారా జిల్లా నుంచి విదేశాలకు రొయ్యలను పెద్దఎత్తున ఎగుమతులు చేసే వీలుంటుంది. ఉమ్మడి కృష్ణాజిల్లాలో మచిలీపట్నం, పెడన, కృత్తివెన్ను, బంటుమిల్లి, కైకలూరు, ముదినేపల్లి, కలిదిండి, నందివాడ, అవనిగడ్డ, కోడూరు, నాగాయలంక తదితర మండలాల్లో లక్ష ఎకరాల్లో వనామీ, టైగర్‌ రొయ్యల సాగు జరుగుతోంది. ఏటా జనవరి, ఫిబ్రవరిలో వనామీ, టైగర్‌ రొయ్యల సాగు ఊపందుకుంటుంది. అమెరికా నుంచి తెచ్చిన బ్రూడర్‌ రొయ్యల నుంచి ఉత్పత్తి చేసిన ఈ సీడ్‌ ఈ ప్రాంతంలోని భూముల్లో సాగుకు అనుకూలంగా ఉంటే రొయ్యల సాగు మరింతగా విస్తరించే అవకాశాలు లేకపోలేదు. 

ప్రస్తుతం రొయ్యల ధరల పెరుగుదల ఇలా..

ఈ ఏడాది మేలో రొయ్యల ధరలకు, ఆగస్టులో పెరిగిన ధరలకు వ్యత్యాసం ఇలా ఉంది. కిలోకు 100 కౌంట్‌ ఉన్న రొయ్యలకు మేలో ధర రూ.220 ఉండగా, నేడు రూ.290కు చేరింది. 90 కౌంట్‌ ఉన్నవి రూ.230 నుంచి రూ.300కు చేరాయి. 80 కౌంట్‌ రొయ్యలు రూ.250 నుంచి రూ.320కు, 70 కౌంట్‌ ఉన్నవి రూ.270 నుంచి రూ.340కు, 60 కౌంట్‌ ఉన్నవి రూ.290 నుంచి రూ.350కు, 50 కౌంట్‌ ఉన్నవి రూ.320 నుంచి రూ.370కు, 40 కౌంట్‌ ఉన్నవి రూ.390 నుంచి రూ.410కు, 30 కౌంట్‌ ఉన్న రొయ్యలు మేలో రూ.510 ధర పలకగా, నేడు రూ.460కు తగ్గాయి.


Updated Date - 2022-08-18T06:18:45+05:30 IST