‘ఉపాధి’ పనుల్లో ప్రైవేట్‌ ఉపాధ్యాయులు

ABN , First Publish Date - 2021-05-17T07:13:20+05:30 IST

కరోనా మహమ్మారి ప్రభావం ప్రైవేట్‌ పాఠశాలల్లో పనిచేసే ఉపాధ్యాయులపై తీవ్రంగా పడింది.

‘ఉపాధి’ పనుల్లో ప్రైవేట్‌ ఉపాధ్యాయులు

దొనకొండ, మే 16 : కరోనా మహమ్మారి ప్రభావం ప్రైవేట్‌ పాఠశాలల్లో పనిచేసే  ఉపాధ్యాయులపై తీవ్రంగా పడింది. గతేడాది కరోనా తగ్గుముఖం పట్టి పాఠశాలలు తిరిగి ప్రారంభమైనా రెండవ దశ కరోనా విజృంభిస్తుండటంతో పరిస్ధితి మళ్లీ మొదటికొచ్చింది. నిన్నటి వరకు విద్యార్ధులకు పాఠాలు నేర్పిన గురువులు నేడు పొట్టకూటి కోసం వివిధ పనులకు వెళ్తున్నారు. కరోనా వైరస్‌ ఉధృతంగా వ్యాప్తి చెందుతుండటంతో రాష్ట్ర ప్రభుత్వం విద్యాసంస్థలకు సెలవలు ప్రకటించటంతో పాఠశాలలు మూతబడ్డాయి. దీంతో ప్రైవేట్‌ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు, సిబ్బందికి ఉపాది కరువై జీవనోపాది నిమిత్తం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 

ప్రైవేట్‌ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు, కార్యాలయ సిబ్బంది, బస్సుల డ్రైవర్లు, క్లీనర్లు ఈ ఏడాది ప్రస్తుతం రెండు నెలలుగా ఉపాధిలేక  దిక్కుతోచని పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. పేరుకు ఉన్నత చదువులు చదివినా జీవనోపాధిలేక కుటుంబపోషణ కష్టంగా మారింది. ఫీజులు వసూళ్లు కాలేదనే కారణంతో యాజమాన్యం వేతనాలు చెల్లించటం లేదు. దీంతో కొందరు కుటుంబ పోషణ నిమిత్తం ఉపాధి పనులకు వెళుతున్నారు. మరికొందరు వివిధ రకాల దుఖాణాలు ఏర్పాటు చేసుకున్నారు. మరికొందరు ఎటువంటి పనులకు వెళ్లలేక నిరుత్సాహంతో ఇంటిపట్టున ఉంటూ మనోవేదన చెందుతున్నారు.

దొనకొండ మండలంలో నాలుగు ప్రైవేట్‌ పాఠశాలల్లో దాదాపు 120 మంది వరకు సిబ్బంది పనిచేస్తున్నారు. వీరందరూ ప్రస్తుతం ఉపాధి కొల్పోయి అల్లాడుతున్నారు. తెలంగాణ రాష్ట్రం ప్రైవేట్‌ టీచర్లకు రూ.2వేలు ఆర్థిక సహయం, 25 కేజీల బియ్యం అందజేస్తోంది. మన ప్రభుత్వం కూడా ఈ మేరకు చర్యలు చేపట్టి ప్రైవేట్‌ ఉపాధ్యాయులు, సిబ్బందిని తక్షణం ఆదుకోవాలని పలువురు ప్రైవేట్‌ పాఠశాలల సిబ్బంది కోరుతున్నారు.

Updated Date - 2021-05-17T07:13:20+05:30 IST