సీఎంవోలో సునామీ!

ABN , First Publish Date - 2020-07-09T08:26:58+05:30 IST

నిన్నటి వరకూ ఆయనో సూపర్‌ బాస్‌. సీఎంవోలో ఆయనకు ఎదురు లేదు. అధికారులకు ఆయన మాటే శాసనం. అంతటి స్థాయిలో చక్రం తిప్పిన ఆయన ఇప్పుడు నామ్‌ కే ..

సీఎంవోలో సునామీ!

  • అజేయ కల్లం, పీవీ రమేశ్‌ శాఖలు కట్‌!
  • ఇద్దరూ నామ్‌ కే వాస్తే సలహాదారు పాత్రలకే పరిమితం 
  • కొత్త సూపర్‌ బాస్‌గా ప్రవీణ్‌ ప్రకాశ్‌
  • కల్లం శాఖలు ప్రవీణ్‌కు, రమేశ్‌వి ఆరోఖ్యరాజ్‌కు

అమరావతి, జూలై 8(ఆంధ్రజ్యోతి): నిన్నటి వరకూ ఆయనో సూపర్‌ బాస్‌. సీఎంవోలో ఆయనకు ఎదురు లేదు. అధికారులకు ఆయన మాటే శాసనం. అంతటి స్థాయిలో చక్రం తిప్పిన ఆయన ఇప్పుడు నామ్‌ కే వాస్తేగా మారిపోయారు. కీలక బాధ్యతల నుంచి ఆయన్ను హఠాత్తుగా తప్పించడం, వాటిని సీఎం ముఖ్య కార్యదర్శి ప్రవీణ్‌ ప్రకాశ్‌కు అప్పగించడం అఖిల భారత సర్వీసు వర్గాలను ఆశ్చర్యానికి గురిచేసింది. ఆయనే అజేయ కల్లం! వైసీపీ అధికారం చేపట్టిన నాటినుంచి ఓ వెలుగు వెలిగిన సీఎంవో ప్రధాన సలహాదారు అయిన కల్లం ఇప్పుడు శాఖల్లేని సలహాదారు పాత్రకు పరిమితమైపోయారు. ఆయనతో పాటు మరో సలహాదారు పీవీ రమేశ్‌ను కూడా గతంలో కేటాయించిన శాఖల నుంచి తప్పించారు. అప్పట్లో ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్‌కు అనునిత్యం సలహాలిచ్చిన వీరిద్దరి ప్రాధాన్యం..


ప్రభుత్వం ఏర్పడిన ఏడాదిలోనే ఇలా తగ్గిపోవడం పెను సంచలనం సృష్టిస్తోంది. ఈ వ్యవహారం సీఎంవోతో పాటు సచివాలయంలోనూ, ప్రభుత్వ అధికార వర్గాలు, ఉద్యోగుల్లోనూ చర్చనీయాంశంగా మారింది. రిటైర్‌ అయిన అధికారులు కీలక ఫైళ్లపై సంతకాలు పెడితే న్యాయపరమైన ప్రతిబంధకాలు వస్తాయనే ఉద్దేశంతోనే వీరిని పక్కన పెడుతున్నట్లు సీఎంవో వర్గాలు చెబుతున్నాయి. అయితే తెలంగాణలో సీఎం ప్రిన్సిపల్‌ సెక్రటరీగా రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి నరసింగరావు సీంఎంవోలో కీలకంగా వ్యవహరిస్తూ, వివిధ ప్రభుత్వ శాఖల వ్యవహారాలు చూస్తున్నారు.


అక్కడ ఆయనకు లేని చట్టపరమైన, న్యాయపరమైన ప్రతిబంధకాలు వీరిద్దరి విషయంలో మాత్రం ఎందుకొస్తాయని పలువురు ప్రశ్నిస్తున్నారు. అలాగే గతంలో యూపీ ముఖ్యమంత్రిగా మాయావతి ఉన్న సమయంలో ఓ ప్రైవేట్‌ వ్యక్తిని ప్రిన్సిపల్‌ సెక్రటరీగా నియమించుకున్నా ఎలాంటి ఇబ్బందులూ రాలేదని గుర్తుచేస్తున్నారు. అసలు సలహాదారులుగా నియమితులైనవారు ఫైళ్లపై సంతకాలు పెట్టాల్సిన అవసరమే ఉండదు. వారు తమకు కేటాయించిన శాఖలకు సంబంధించి వివిధ అంశాలపై అధ్యయనం చేయడం, ఆయా అధికారుల నుంచి సమాచారం సేకరించడం, వాటిని గుదిగుచ్చి, సీఎంకు తగిన సలహాలు ఇవ్వడం వరకే వారి బాధ్యత. అయినా వీరిద్దరి విషయంలో ఏడాదిగా లేని సాంకేతిక అభ్యంతరాలు కొత్తగా ఇప్పుడెందుకొచ్చాయి? ఏడాది గడిచాక ఇవి హఠాత్తుగా గుర్తుకురావడం వెనుక ఉన్న మతలబు ఏమిటనే చర్చ అధికార వర్గాల్లో మొదలైంది. 


నాడు సేవలకు నజరానా

ఎన్నికల ముందునుంచీ అజేయ కల్లం, పీవీ రమేశ్‌లు జగన్‌కు అత్యంత సన్నిహితంగా మెలిగేవారు. జగన్‌కు అన్ని వేళలా సలహాలు ఇస్తూ వచ్చిన కల్లంకు ఆతర్వాత ప్రభుత్వ ప్రధాన సలహాదారుగానూ, పీవీ రమేశ్‌కు సలహాదారుగా బాధ్యతలు అప్పగించారు. సీఎంగా జగన్‌ బాధ్యతలు స్వీకరించిన తొలినాళ్లలో ప్రభుత్వ శాఖలన్నీ కల్లం చుట్టూనే తిరిగేవి. తనను ఎవరన్నా కలవాలనుకున్నప్పుడు, ‘కల్లం అన్నతో మాట్లాడండి.. ఆయనకు చెప్పండి’ అని జగనే అప్పట్లో స్వయంగా చెప్పేవారు. కల్లం కు హోం, ఫైనాన్స్‌ అండ్‌ ప్లానింగ్‌, రెవెన్యూ లాఅండ్‌లెజిస్లేటివ్‌ అఫైర్స్‌ తదితర శాఖలు అప్పగించారు. హోంశాఖ వ్యవహారాలను సహజంగా ముఖ్యమంత్రి పర్యవేక్షిస్తుంటారు. ఈ బాధ్యతను కూడా కల్లంకు అప్పగించడంతో... సీఎంవోలో అయన స్థానం అత్యంత కీలకంగా అందరూ భావించారు. కానీ బుధవారం సీఎంవో శాఖల కొత్త బాధ్యతల జాబితాను విడుదల చేసింది. అందులో అజేయ కల్లంతోపాటు మరో సలహాదారు పీవీ రమేశ్‌ పేరు కూడా గల్లంతయింది. 


ఇప్పుడు ఎవరికి ఏమిటి?: హెల్త్‌, మెడికల్‌ అండ్‌ ఫ్యామిలీ వెల్ఫేర్‌ డిపార్ట్‌మెంట్‌, ఎడ్యుకేషన్‌, హయ్యర్‌ అండ్‌ టెక్నికల్‌ శాఖలను ఇప్పటిదాకా రమేశ్‌ చూసేవారు. కానీ ఇప్పుడు అవేమీ ఆయనకు ఇవ్వలేదు. వాటిని సీఎంవో కార్యదర్శి సాల్మన్‌ ఆరోఖ్యరాజ్‌, అదనపు కార్యదర్శి కె.ధనుంజయరెడ్డికి అప్పగించారు. ఇప్పటి వరకూ అజేయ కల్లం చూస్తున్న శాఖలను సీఎం ముఖ్య కార్యదర్శి ప్రవీణ్‌ ప్రకాశ్‌కు అప్పగించారు. ప్రస్తుతం ప్రవీణ్‌... జీఏడీ, కేంద్ర-రాష్ట్ర సత్సంబంధాలు, సీఎంవో ఎస్టాబ్లి్‌షమెంట్‌, రెసిడెన్షియల్‌ సబ్జెక్ట్‌, రాష్ట్ర విభజన చట్టం అంశాలు, ప్రధానమంత్రికి సీఎం రాసిన లేఖలు, అభ్యర్థనల పర్యవేక్షణ, ముఖ్యమైన వారితో నిర్వహిచే లావాదేవీలు, కేబినెట్‌ మినిస్టర్లు, రాజ్యాంగ సంస్థలు, ప్రాజెక్టుల ఫాలో అప్‌, ప్రాజెక్టులు, ఫైనాన్షియల్‌, నాన్‌ ఫైనాన్షియల్‌ అంశాలు, కేంద్ర ప్రభుత్వ అధికారులతో సమన్వయం, సీఎం ఇచ్చిన హామీలకు ఉత్తర్వులు ఇవ్వడంలో సహాయం, జీవో 128లోని అంశాలను కూడా నిర్వహిస్తున్నారు.


ఆరోఖ్యరాజ్‌కు రవాణా, ఆర్‌అండ్‌బీ, ఆర్టీసీ, హౌసింగ్‌, ఆహార, పౌర సరఫరా, వినియోగదారుల అంశాలు, పంచాయతీరాజ్‌, రూరల్‌ డెవల్‌పమెంట్‌, సెర్ప్‌, పాఠశాల విద్య, ఉన్నత సాంకేతిక విద్య, మౌలిక సదుపాయాలు, సాంకేతిక నైపుణ్యం, ఎలకా్ట్రనిక్స్‌, కమ్యూనికేషన్స్‌, మైన్స్‌ జియాలజీ, కార్మిక ఉపాధి శాఖలు అప్పగించారు. ధనుంజయరెడ్డికి జల వనరులు, పర్యావరణం, అటవీ, సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ, మునిసిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌, పట్టణాభివృద్ధి, వ్యవసాయం, కుటుంబ సంక్షేమం, వైద్య ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం, ఇంధనం, పర్యాటక, సాంస్కృతిక, క్రీడలు, మార్కెటింగ్‌, సహకార శాఖలను అప్పగించారు.


నేడు ప్రవీణ్‌వైపే మొగ్గు?

అజేయ కల్లంపై సీఎం జగన్‌ గత కొంతకాలంగా అసంతృప్తితో ఉన్నట్లు చెబుతున్నారు. వాస్తవానికి ప్రవీణ్‌ ప్రకాశ్‌ పేషీలోకి వచ్చాక కల్లం ప్రాధాన్యం నానాటికీ పడిపోతూ వచ్చింది. ప్రవీణ్‌ నిర్ణయాలు కొన్నింటిని కల్లం వ్యతిరేకించడం కూడా ఆయన ఇప్పుడిలా నామ్‌ కే వాస్తే సలహాదారుగా మిగిలిపోవడానికి కారణమైందన్న వాదన సచివాలయ వర్గాల్లో వినిపిస్తోంది. మొత్తంగా చూస్తే ప్రవీణ్‌ వైపే జగన్‌ మొగ్గు చూపి కల్లం అధికారాలకు పూర్తిస్థాయి కత్తెర వేసినట్లు చెబుతున్నారు. అదీగాక కొత్తగా మరో ఇద్దరు ఐఏఎ్‌సలను పేషీలోకి తీసుకునే సన్నాహాల్లో సీఎం ఉన్నట్లు కూడా సమాచారం.

Updated Date - 2020-07-09T08:26:58+05:30 IST