ప్రత్తిపాడులో.. వ్యాక్సిన్‌ రచ్చ

ABN , First Publish Date - 2022-01-19T05:54:17+05:30 IST

ఒకపక్క కరోనా వైరస్‌ వ్యాప్తి భయం గొల్పుతున్నా.. ఆరోగ్యశాఖలో అంతర్గత కలహాలతో ప్రజలకు సకాలంలో టీకాలు అందించడంపై వైద్యధికారులు నిర్లక్ష్యం చూపుతుండటంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

ప్రత్తిపాడులో.. వ్యాక్సిన్‌ రచ్చ
వ్యాక్సిన్‌ విధులకు హాజరుకాకుండా ఆరోగ్య ఉప కేంద్రంలో రికార్డులు రాసుకుంటున్న సిబ్బంది

వ్యాక్సిన్‌ విధులకు దూరంగా ఏఎన్‌ఎంలు

అంతర్గత కలహాలతో ప్రజలకు అందని టీకా

ప్రత్తిపాడు, జనవరి 18: ఒకపక్క కరోనా వైరస్‌ వ్యాప్తి భయం గొల్పుతున్నా.. ఆరోగ్యశాఖలో అంతర్గత కలహాలతో ప్రజలకు సకాలంలో టీకాలు అందించడంపై వైద్యధికారులు నిర్లక్ష్యం చూపుతుండటంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కొంతకాలంగా స్థానిక పీహెచ్‌సీ  పరిధిలో ఉన్న కలహాలతో అధికారులు, సిబ్బంది గ్రూపులుగా ఏర్పడ్డారు. ఈ పరిస్థితుల్లో వ్యాక్సిన్‌కి దూరంగా ఉండాలంటూ ఏఎన్‌ఎంలను  వైద్యులు ఆదేశాలు జారీ చేశారు. దీంతో మంగళవారం మండలంలో వ్యాక్సినేషన్‌ జరగలేదు. వ్యాక్సిన్‌ బాధ్యతను వైద్యులు 


ఎంఎల్‌హెచ్‌పీలకు అప్పగించారు. వారేమో తమ వద్దకు వ్యాక్సిన్‌ వస్తేనే వేస్తామంటూ సబ్‌సెంటర్లకే పరిమితమయ్యారు.   ఏఎన్‌ఎంలు  వ్యాక్సిన్‌ తెచ్చి ఇస్తే వేస్తామంటూ ఎంపీహెచ్‌వోలు,  మాకు ఆ బాధ్యతలు లేనప్పుడు వ్యాక్సిన్‌తో మాకు పనేంటి అంటూ ఏఎన్‌ఎంలు ఎవరికివారు పంతం పట్టిఉన్నారు.  దీంతో టీకాలు ఎక్కడ వేస్తున్నారో తెలియక ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. 

సిబ్బందిపై డీఎంహెచ్‌వో ఆగ్రహం

వ్యాక్సిన్‌ రచ్చ డీఎంఅండ్‌హెచ్‌వోకి ఫిర్యాదు చేయడంతో ఆమె సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.    ఏఎన్‌ఎంలను గుంటూరు కార్యాలయానికి పిలిపించి మాట్లాడారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా వ్యాక్సిన్‌ ఆగడానికి వీలులేదని ఆదేశించారు. ప్రత్తిపాడు వైద్యశాఖ అధికారులు ఈ విధంగా డ్యూటీలను విభజించడంపై ఆమె తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటామన్నారు. 

పంపిస్తే వేస్తామని చెప్పాను

వ్యాక్సిన్‌ వేయడానికి వ్యాక్సిన్‌ లేదు. ఏఎన్‌ఎంలు  ఇవ్వలేదు. మా జాబ్‌ చార్ట్‌లో లేకపోయినా కో ఆర్డినేషన్‌తో పనిచేయాలి కాబట్టి వేస్తున్నాం. వ్యాక్సిన్‌ వేయమన్నారు కాని తీసుకొచ్చుకోమనలేదు. ఎంపీహెచ్‌వోలు ఎవరూ వ్యాక్సిన్‌ తీసుకొచ్చి వేయరు.  -  నాగఅనుదీప్‌, ఎంపీహెచ్‌వో

 

Updated Date - 2022-01-19T05:54:17+05:30 IST