కాంగ్రెస్ ‎లోకి PK రాకను ఎవరు అడ్డుకున్నదెవరు..ఆయన మనసెందుకు మార్చుకున్నారు..అసలేం జరిగింది..!?

ABN , First Publish Date - 2022-05-03T17:52:30+05:30 IST

అంతా తారుమారైంది. ప్రశాంత్‌ కిషోర్‌ లెక్క తప్పింది. కాంగ్రెస్‌ను గుప్పిట పట్టాలనుకున్న పీకే ఆలోచనలు పటాపంచలయ్యాయి. తను అనుకున్నదొకటి...

కాంగ్రెస్ ‎లోకి PK రాకను ఎవరు అడ్డుకున్నదెవరు..ఆయన మనసెందుకు మార్చుకున్నారు..అసలేం జరిగింది..!?

ప్రశాంత్‌ కిషోర్‌ కాంగ్రెస్‌లో చేరకుండా రాహూల్‌ గాంధీ చక్రం అడ్డు వేశారా? రాహూల్‌ గాంధీ చెప్పుచేతుల్లో పార్టీ ఉండటం ప్రియాంక గాంధీకి ఇష్టం లేదా? నిజంగానే గాంధీలు కాంగ్రెస్‌ పార్టీకి దూరమైతే కార్యకర్తలు ఆ పార్టీని ఆదరించరా? పీకే మనసు మార్చుకోవడం వెనుక కారణమేంటి.. ఇప్పడీ ప్రశ్నలనే కాంగ్రెస్‌లో అంతర్గతంగా తెగ చర్చించుకుంటున్నారు. అనే మరిన్ని విషయాలు ఏబీఎన్ ఇన్‎సైడర్‎లో తెలుసుకుందాం..

పటాపంచలైన పీకే ఆలోచనలు
అంతా తారుమారైంది. ప్రశాంత్‌ కిషోర్‌ లెక్క తప్పింది. కాంగ్రెస్‌ను గుప్పిట పట్టాలనుకున్న పీకే ఆలోచనలు పటాపంచలయ్యాయి. తను అనుకున్నదొకటి... కాంగ్రెస్‌లో జరుగుతున్నదొకటి కావడంతో పీకే కాంగ్రెస్‌ చేరికపై వెనకడుగు వేశారు. పార్టీలోని అంతర్గత పోరు, నేతల కుతంత్రాలే పీకే దారులను మూసేశాయి. ముఖ్యంగా రాహూల్‌,ప్రియాంక విభేదాలే పీకే స్పీడుకు బ్రేకులు వేశాయంటున్నారు. 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత ప్రియాంక వాద్రా ద్వారా కాంగ్రెస్‌ పార్టీలో చేరాలని పీకే భావించారు. ప్రియాంక ఒత్తిడి మేరకే కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీ పార్టీ నేతలతో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. తొలి రోజు సమావేశంలో పాల్గొన్న తర్వాత రాహుల్‌ గాంధీ విదేశాలకు వెళ్లిపోయారు. పీకే నియామకం జరగదని తేలడంతో ప్రియాంక కూడా విదేశీ పర్యటనకు వెళ్లిపోయారు.


రాష్ట్రాలను గుప్పిట్లో పెట్టుకోవడం ప్రియాంకకు ఇష్టం లేదా..
రాహూల్‌ ప్రాధాన్యం తగ్గించేలా పీకే చేసిన ప్రతిపాదనల వెనుక  ప్రియాంక హస్తం ఉందని కొందరు నేతలు అభిప్రాయపడ్డారు. పార్టీపై పట్టు సాధించేందుకే పీకే ద్వారా ఆమె పావులు కదిపారు. ఒక దశలో ప్రియాంకను పార్టీ అధ్యక్షురాలు చేయాలని కూడా పీకే సూచించారుట. ఒకవేళ ఇది సాధ్యం కాని పక్షంలో సోనియాగాంధీని అధ్యక్షురాలిగా కొనసాగించాలని చెప్పారుట. అలాగే  మరొకరిని వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ చేయాలని సూచించారుట. రాహుల్‌ను మాత్రం కేవలం పార్లమెంటరీ బోర్డుకే పరిమితమయ్యేలా సూచించారని తెలుస్తోంది. ఇక రాహూల్‌గాంధీ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్ష బాధ్యతలు నిరాకరించాక ఆయన పార్టీలో చక్రం తిప్పడం, తన అనుయాయుల ద్వారా రాష్ట్రాలను గుప్పిట్లో పెట్టుకోవడం ప్రియాంకకు ఇష్టం లేదుట. పార్టీలో నాయకత్వ సమస్యను పరిష్కరించాలని ఆమె కోరినట్టు తెలుస్తోంది. కొందరు జీ-23 నేతల అసంతృప్తి వెనుక ప్రియాంక హస్తం ఉందంటున్నారు.


పీకేకు పొమ్మనకుండానే పొగపెట్టిన రాహూల్‌ వర్గం
ఇక ప్రశాంత్‌ కిషోర్‌ కాంగ్రెస్‌లో చేరకుండా రాహూల్‌గాంధీ విదేశాల నుంచే చక్రం తిప్పారుట.  పీకే  చేరికను జైరాం రమేశ్‌, దిగ్విజయ్‌ సింగ్‌, అశోక్‌ గెహ్లోత్‌ తదితరులు పార్టీ అంతర్గత సమావేశంలో గట్టిగా వ్యతిరేకించారుట. నేతలతో సోనియాగాంధీ చర్చిస్తున్నప్పుడే పార్టీ ప్రధా న కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ సూచన మేరకు పీకే కు వ్యతిరేకంగా పార్టీ కార్యదర్శి మాణిక్కం ఠాగూర్‌ ట్వీట్‌ చేశారని తెలుస్తోంది. చివరకు సోనియా నియమించిన సీనియర్‌ నేతల కమిటీ కూడా ప్రశాంత్‌ కిశోర్‌కు సాధికారిక కమిటీలో సాధారణ సభ్యుడిగా అవకాశం కల్పించాలని సూచించారుట. ఈ విధంగా పీకేకు రాహుల్‌ వర్గీయులు  పొమ్మనకుండానే పొగపెట్టారుట. కాంగ్రెస్‌లో అన్నాచెల్లెల్ల మధ్య అభిప్రాయ భేదాలు ప్రశాంత్‌ కిశోర్‌ మూలంగా తారా స్థాయికి చేరుకున్నాయని, సోనియా పుత్రప్రేమ వల్ల రాహుల్‌కు పరిస్థితులు అనుకూలంగా మారాయని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.


కాంగ్రెస్ పార్టీ లో పీకే మళ్లీ చేరతారా?
రాహుల్‌కు పార్టీపై పట్టున్నంత కాలం కాంగ్రెస్‌లో తనకు స్వేచ్ఛ ఉండదని గ్రహించిన తర్వాతే పీకే తప్పుకున్నారని కాంగ్రెస్‌ వర్గాల సమాచారం. కాంగ్రెస్‌లో చేరబోనని పీకే ప్రకటించిన మరుసటిరోజే పార్టీలో చేరాలనుకునే వారికి కాంగ్రెస్‌ తలుపులు తెరిచే ఉంటాయని ఆ పార్టీ ప్రకటించింది. దీంతో పార్టీ లో పీకే మళ్లీ చేరతారా? అన్న ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి.అయితే పీకే సలహాదారుగా ఉన్నా లేకపోయినా కాంగ్రెస్‌ పార్టీ తన సంస్థను చక్కదిద్దుకుంటుందని మరో సీనియర్‌ నేత దిగ్విజయ్‌ సింగ్‌ స్పష్టం చేశారు. సహజంగా కాంగ్రెస్‌లో తాడిని తన్నేవాడు ఒకడుంటే తలను తన్నేవాడు మరొకరు ఉంటారు. అందుకే పీకేను చాలాసులభంగా పక్కన పెట్టేయగలిగారు. దటీజ్‌ కాంగ్రెస్‌!

Read more