షర్మిల పార్టీ వ్యూహకర్తగా ప్రశాంత్‌‌కిషోర్.. సెప్టెంబర్ నుంచి రంగంలోకి..!

ABN , First Publish Date - 2021-08-26T23:35:30+05:30 IST

రాష్ట్రంలో రాజన్న సంక్షేమ రాజ్యాన్ని స్థాపించేందుకు వైఎస్‌ఆర్‌టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల వ్యూహాత్మకంగా ముందుకు పోతున్నారు.

షర్మిల పార్టీ వ్యూహకర్తగా ప్రశాంత్‌‌కిషోర్.. సెప్టెంబర్ నుంచి రంగంలోకి..!

హైదరాబాద్: రాష్ట్రంలో రాజన్న రాజ్యాన్ని స్థాపించేందుకు వైఎస్‌ఆర్‌టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల వ్యూహాత్మకంగా ముందుకు పోతున్నారు. ఆమె నిత్యం ప్రజల నోళ్లల్లో నానేందుకు ప్రజా సమస్యలను కేంద్రంగా చేసుకుని పనిచేస్తున్నారు. నిరుద్యోగ నిరాహరదీక్ష పేరుతో ప్రతి వారం జిల్లాల్లో కార్యక్రమాలు చేస్తున్నారు. ఈ కార్యక్రమాలకు అనూహ్య మద్దతు కూడా వస్తోంది. ఇదంతా వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా షర్మిల టీం పనిచేస్తోంది. సంస్థాగతంగా పార్టీని బలపర్చుకుంటూనే మరోవైపు పార్టీ వ్యూహాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌కిషోర్‌ను షర్మిల నియమించుకున్నట్లు ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. ఇదే విషయాన్ని షర్మిల ఓ మీడియా సమావేశంలో నర్మగర్భంగా ప్రస్తావించారు.


అయితే పశ్చిమ బెంగాల్ ఎన్నికల అనంతరం ప్రశాంత్ కిశోర్ ఇక ఎన్నికల వ్యూహకర్తగా పనిచేయబోనని స్పష్టం చేశారు. అయితే అంతకుముందే షర్మిలతో పీకే బృందం ఒప్పందం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఆ ఒప్పందంలో భాగంగానే షర్మిల పార్టీతో పీకే టీం పనిచేయబోతుందనే చర్చ నడుస్తుంది. ప్రశాంత్ కిశోర్ సంస్థ ఇండియన్ పొలిటికల్ యాక్షన్ కమిటీ(ఐపీఏసీ) సెప్టెంబర్ 1 నుంచి పూర్తిస్థాయిలో కార్యకలాపాలు సాగించనుందని పార్టీవర్గాల్లో జోరుగా చర్చ నడుస్తుంది. ప్రశాంత్ కిశోర్ నేరుగా తెర ముందుకు రాకున్నా అయన టీంతో పరోక్షంగా  షర్మిల కోసం పనిచేయబోతున్నారని సమాచారం. ఏపీ ముఖ్యమంత్రి జగన్ కోసం ప్రశాంత్ కిశోర్ ఎన్నికల వ్యూహకర్తగా పనిచేసిన సమయంలోనే తెలంగాణలో షర్మిల పార్టీ ఏర్పాటుకు సంబంధించి బీజం పడినట్లు సమాచారం.


వైఎస్‌ఆర్‌టీపీకి ప్రశాంత్ కిశోర్ పనిచేస్తారని గతంలో ఒకానొక సందర్భంలో పార్టీకి చెందిన ముఖ్య నేతలతో షర్మిల, తల్లి విజయమ్మ చెప్పినట్లుగా తెలుస్తోంది. ఇదే విషయంపై షర్మిల కూడా క్లారిటీ ఇచ్చారు. లోటస్‌పాండ్‌లో నిర్వహించిన మీట్ ది ప్రెస్‌లో ప్రశాంత్ కిశోర్ లాంటి వ్యక్తుల సలహాలు, సూచనలు తీసుకోవడంలో తప్పేంటని తేల్చేశారు. అయితే ఇదంతా ముందుగానే కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారమే జరుగుతున్నట్లు వైఎస్‌ఆర్‌టీపీ వర్గీయులు చర్చించుకుంటున్నారు. 

Updated Date - 2021-08-26T23:35:30+05:30 IST