Bihar Politics : నితీశ్ కుమార్‌పై ప్రశాంత్ కిశోర్ సంచలన వ్యాఖ్యలు

ABN , First Publish Date - 2022-10-05T00:20:12+05:30 IST

బిహార్ ముఖ్యమంత్రి, జేడీయూ చీఫ్ నితీశ్ కుమార్

Bihar Politics : నితీశ్ కుమార్‌పై ప్రశాంత్ కిశోర్ సంచలన వ్యాఖ్యలు

పాట్నా : బిహార్ ముఖ్యమంత్రి, జేడీయూ చీఫ్ నితీశ్ కుమార్ (Nitish Kumar) మళ్లీ తనను ఆహ్వానించారని ఎన్నికల ప్రచార వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ (Prashant Kishor) చెప్పారు. అయితే తాను జన సురాజ్ యాత్ర (Jan Suraaj Yatra) చేస్తున్నానని, తాను జేడీయూ (JDU)  కోసం పని చేయలేనని చెప్పానని తెలిపారు. 


ప్రశాంత్ కిశోర్ జన సురాజ్ యాత్ర మూడో రోజైన మంగళవారం బిహార్‌లోని పశ్చిమ చంపారన్‌, జమునియా గ్రామంలో మాట్లాడారు. ఇటీవల పాట్నాలో తాను ముఖ్యమంత్రి నితీశ్ కుమార్‌ను కలిశానని చెప్పారు. 2014 లోక్‌సభ ఎన్నికల్లో నితీశ్ కుమార్ పరాజయాన్ని చవి చూశారన్నారు. ఆ తర్వాత 2015 శాసన సభ ఎన్నికల కోసం తామిద్దరమూ చేతులు కలిపామన్నారు. పది, పదిహేను రోజుల క్రితం ఆయన తనను పిలిచారన్నారు. మళ్లీ ఆయన కోసం (జేడీయూ కోసం) పని చేయాలని కోరారన్నారు. అయితే తాను జన సురాజ్ యాత్ర చేయాలని గట్టిగా నిర్ణయించుకున్నానని, అందువల్ల మళ్ళీ జేడీయూ కోసం పని చేయడం సాధ్యం కాదని చెప్పానని తెలిపారు.  తాను చేపట్టిన యాత్ర కోసం గతంలో తాను సేవలందించినవారి నుంచి నిధులు తీసుకోలేదన్నారు. తాను పదేళ్ళపాటు తన ప్రతిభతో పని చేశానన్నారు. దళారీతనం చేయలేదన్నారు. 


జేడీయూ అధికార ప్రతినిధి నీరజ్ కుమార్ మాట్లాడుతూ, నితీశ్‌తో సమావేశమైనట్లు వచ్చిన వార్తలను ప్రశాంత్ మొదట్లో తిరస్కరించారని, నితీశ్ ధ్రువీకరించిన తర్వాత ఆయన అంగీకరించారని గుర్తు చేశారు. జన సురాజ్ యాత్ర చేయాలన్న పట్టుదల ఉంటే నితీశ్‌ను కలిసేందుకు ఎందుకు అంగీకరించారని ప్రశ్నించారు. వీరిద్దరి మధ్య జరిగిన సమావేశం మర్యాదపూర్వక సమావేశం కాదన్నారు. యాత్ర కోసం చేస్తున్న ఖర్చులు, వార్తా పత్రికల్లో ఇస్తున్న ప్రకటనల కోసం చేస్తున్న ఖర్చుల గురించి వివరాలను వెల్లడించాలని డిమాండ్ చేశారు. సిద్దాంతాల పరంగా కాకుండా ఆచరణలో గాంధేయవాదిగా ప్రవర్తించాలని హితవు పలికారు. ఇంత పెద్ద యాత్రకు నిధులు ఎక్కడి నుంచి వస్తున్నాయో తెలుసుకోవాలని ఆసక్తిగా ఉందన్నారు. 


జన సురాజ్ యాత్ర

ప్రశాంత్ కిశోర్ దాదాపు 3,500 కిలోమీటర్ల మేరకు పాదయాత్ర చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ యాత్ర అక్టోబరు 2న ప్రారంభమైంది. ఈ యాత్ర పూర్తయిన తర్వాత రాజకీయ పార్టీని ఏర్పాటు చేస్తానని ఆయన ప్రకటించారు. అయితే నితీశ్ కుమార్ జాతీయ రాజకీయాల్లో అడుగులు వేయాలని ప్రయత్నిస్తున్నారు. గతంలో వీరిద్దరి మధ్య సత్సంబంధాలు ఉండేవి. అప్పట్లో ప్రశాంత్ కిశోర్‌కు జేడీయూ ఉపాధ్యక్ష పదవిని నితీశ్ కట్టబెట్టారు. 


Updated Date - 2022-10-05T00:20:12+05:30 IST