తెలంగాణపై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టిన ప్రశాంత్ కిషోర్

ABN , First Publish Date - 2022-02-27T21:04:35+05:30 IST

దుబ్బాక, గ్రేటర్‌ హైదరాబాద్‌, హుజూరాబాద్‌ ఎన్నికల్లో బీజేపీ జెండా ఎగరడంతో సీఎం కేసీఆర్‌ మనసు కీడు శంకించినట్టుంది.

తెలంగాణపై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టిన ప్రశాంత్ కిషోర్

హైదరాబాద్: దుబ్బాక, గ్రేటర్‌ హైదరాబాద్‌, హుజూరాబాద్‌ ఎన్నికల్లో బీజేపీ జెండా ఎగరడంతో సీఎం కేసీఆర్‌ మనసు కీడు శంకించినట్టుంది. అందువల్ల ఆయన మూడోసారి సీఎం పీఠాన్నిఅధిష్టించాలంటే తన బలం ఒకటే సరిపోదని భావించినట్లు ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌కిషోర్‌ను ఆశ్రయించినట్లు ప్రచారం జరుగుతోంది. ఇటీవల పీకేతో కేసీఆర్ రహస్యంగా సమావేశమయ్యారనే ప్రచారం కూడా ఉంది. ఈ ప్రచారానికి బలం చేకూర్చేలా ప్రశాంత్‌కిషోర్ తెలంగాణలో పర్యటిస్తున్నారు. ప్రశాంత్‌కిషోర్‌తో పాటు విలక్షణ నటుడు ప్రకాష్‌రాజ్ కూడా తెలంగాణను చుట్టేస్తున్నారు. శనివారం ప్రకాష్‌రాజ్‌తో పాటు ప్రశాంత్ కిషోర్ గజ్వేల్‌లో పర్యటించారు. తెలంగాణపై పూర్తిస్థాయిలో పీకే దృష్టి పెట్టారు. ఇప్పటికే తెలంగాణలో ఐప్యాక్ ప్రాథమిక సర్వే పూర్తి చేసింది. తెలంగాణ అభివృద్ధిని ప్రశాంత్ కిషోర్ టీమ్ పరిశీలిస్తోంది. గోవా ఎన్నికల తర్వాత  ప్రశాంత్‌ కిషోర్ తెలంగాణకు వచ్చారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిపై పీకే బృందం ఓ నివేదికను రూపొందించనుంది. అందులోభాగంగానే తెలంగాణలో పర్యటిస్తున్నారని గులాబీ నేతలు చెబుతున్నారు. నివేదికను తయారు చేయడంలో ప్రకాష్‌రాజ్ నూచనలు కూడా తీసుకుంటున్నారని సమాచారం. ఈ నివేదిక ఆధారంగా రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు పీకే టీమ్ వ్యూహాలు రచిస్తోందని చెబుతున్నారు. 


అటు రాష్ట్ర, ఢిల్లీ రాజకీయాలపై.. పీకే వ్యూహంలో భాగంగా కేసీఆర్ ముందగుడు వేస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. అందుకే కేసీఆర్, కేంద్రంపై యుద్ధాన్ని ప్రకటించారని చెబుతున్నారు. బీజేపీ ముక్త్‌ భారత్‌’ అంటూ నినదించిన కేసీఆర్‌.. జాతీయ స్థాయిలో వేదిక ఏర్పాటుకు సిద్ధమయ్యారు. ప్రధాని మోదీ వ్యతిరేక కూటమి కట్టే ప్రయత్నాలను ముమ్మరం చేశారు. బీజేపీ, కాంగ్రేసేతర పార్టీలతో జత కట్టేందుకు దేశాన్ని చుట్టేయాలని అనుకుంటున్నారు. ఇందులో భాగంగా ముంబైలో పర్యటించారు. తొలుత ఆయన మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్‌ ఠాక్రేతో సమావేశమయ్యారు. తదుపరి ఎన్సీపీ అధినేత శరద్‌ పవార్‌తోనూ భేటీ అయ్యారు. ఆ తర్వాత తమిళనాడు సీఎం స్టాలిన్‌తో కేసీఆర్ భేటీ అవుతారని టీఆర్‌ఎస్ నేతలు చెబుతున్నారు. 


అయితే ఇక్కడ ఓ చిక్కు వచ్చిపడుతోంది. దక్షిణాది రాష్ట్రాలతో పాటు ఉత్తరాది రాష్ట్రాల పాత్ర లేకుండా ఢిల్లీలో చక్రం తిప్పడం సాధ్యం కాదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఒక వేళ కిందా మీదా పడి ప్రత్యామ్నాయ వేదికను ఏర్పాటు చేసినా దానికి ఎవరు నాయకత్వం వహించాలన్న ప్రశ్న కూడా తలెత్తుతుంది. కాలం కలసి వస్తే ప్రధానమంత్రి కావాలని మమతా బెనర్జీ ఎప్పటి నుంచో కలలు కంటున్నారు. ఇక ఉత్తరప్రదేశ్‌ ఎన్నికల్లో అఖిలేశ్‌ యాదవ్‌ విజయం సాధిస్తే అతి పెద్ద రాష్ట్రానికి చెందిన తన సంగతేమిటని ఆయన కూడా ప్రశ్నిస్తారు. బిహార్‌ ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్‌ కూడా ప్రధానమంత్రి కావాలనుకుంటున్న నేతల జాబితాలో ఉన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా గొంతు కలుపుతున్న మహారాష్ట్ర, తమిళనాడు, పశ్చిమ బెంగాల్‌తో పోల్చితే తెలంగాణ చాలా చిన్న రాష్ట్రం. ఇక్కడ 17 లోక్‌సభ స్థానాలు మాత్రమే ఉన్నాయి. ఇందులో కేసీఆర్‌ ఎన్ని గెలుస్తారో తెలియదు. ఈ నేపథ్యంలో నరేంద్ర మోదీ వ్యతిరేక ఉద్యమానికి కేసీఆర్‌ నాయకత్వం వహించడానికి ఇతరులు అంగీకరించే అవకాశం కనిపించడం లేదు.

Updated Date - 2022-02-27T21:04:35+05:30 IST