ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తున్నట్టు పీకే సంకేతాలు

ABN , First Publish Date - 2022-05-02T17:35:23+05:30 IST

ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ సోమవారంనాడు ఎవరూ ఊహించని విధంగా ఓ ట్వీట్‌తో..

ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తున్నట్టు పీకే సంకేతాలు

న్యూఢిల్లీ: ''టైమ్ టు గో టు ది రియల్ మాస్టర్స్''అంటూ ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ సోమవారంనాడు ఎవరూ ఊహించని విధంగా ఓ ట్వీట్‌తో 'ట్విస్ట్' ఇచ్చారు. ప్రజలే 'రియల్ మాస్టర్స్' అని అర్థం వచ్చే రీతిలో... ప్రజల ముందుకు వెళ్లేందుకు సమయం ఆసన్నమైందంటూ ట్వీట్ చేశారు. తద్వారా ప్రత్యక్ష రాజకీయాల్లోకి తాను అడుగుపెడుతున్నట్లు ఆయన సంకేతాలిచ్చారు. 


''పదేళ్ల రోలర్ కోస్టర్ ప్రయాణంలో ప్రజల పక్షాన విధివిధానాలు రూపొందించడం ద్వారా ప్రజాస్వామ్యంలో అర్థవంతమైన భాగస్వామ్యాన్ని కొనసాగిస్తూ వచ్చాను. ఇప్పుడు రియల్ మాస్టర్స్ వద్దకు వెళ్లే సమయం ఆసన్నమైంది. ప్రజలే రియల్ మాస్టర్లు. నేరుగా ప్రజల వద్దకు వెళ్లి వారిని మరింత బాగా అవగాహన చేసుకుని, సుపరిపాలన దిశగా అడుగులు వేయాలనుకుంటున్నాను'' అని  పీకే ఆ ట్వీట్‌లో తెలిపారు. బీహార్ నుంచే తన ప్రయాణం మొదలుపెడుతున్నట్టు చెప్పారు.


కాంగ్రెస్ పార్టీలో పీకే చేరుతారంటూ కొద్దికాలంగా ప్రచారం సాగుతూ వచ్చింది. కాంగ్రెస్ పార్టీలో కీలకమైన పదవిని ఆయన ఆశించినప్పటికీ ఎన్నికల వ్యూహాలకు సంబంధించిన గ్రూప్‌లో సభ్యుడిగా చేరమని ఆ పార్టీ అధిష్ఠానం కోరడంతో పీకే తిరస్కరించారు. ఈ నేపథ్యంలోనే పీకే సొంతంగా రాజకీయ పార్టీని పెట్టి, భావసారూప్యం కలిగిన పార్టీలతో కలిసి ప్రత్యక్ష రాజీయాల్లోకి అడుగుపెడతారానే ప్రచారం ఊపందుకుంది. తాజాగా, ఆయన ఇచ్చిన ట్వీట్‌తో ఈ ఊహాగానాలకు మరింత బలం చేకూరింది.

Updated Date - 2022-05-02T17:35:23+05:30 IST