లాక్డౌన్ వల్ల సామాన్య ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. సరైన ఆహారం లేకుండా ఇబ్బందులు పడుతున్న చాలా మందికి సినీ తారలు తిండిని అందించారు. హీరోయిన్స్ విషయానికి వస్తే హీరోయిన్ ప్రణీత పేదల కోసం ప్రత్యేకంగా ఆహారాన్ని తయారు చేయించి దగ్గరుండి అందరికీ పంపిణీ చేసింది. ప్రణీత సేవా భావాన్ని చూసి అందరూ అభినందించారు. ఈసారి ప్రణీత మరో అడుగు ముందుకేసి ఆటో డ్రైవర్స్‌కు సాయం అందించడానికి ముందుకు వచ్చింది. బెంగుళూరు సిటీలో ఆటోలు తిరగడం ప్రారంభించాయి. వీటి గురించి ప్రణీత ప్రస్తావిస్తూ ‘‘నగరంలో ఆటోలు తిరుగుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో మంచి ఆరోగ్య వాతావరణాన్ని పాటించాల్సిన అవసరం ఎంతో ముఖ్యం. ఆటోడ్రైవర్స్, కస్టమర్స్‌ను వేరు చేసేలా షీట్స్ ఉండటం ఎంతో ముఖ్యం. కాబట్టి 100కి పైగా ఆటోడ్రైవర్స్‌కు ఇలాంటి షీట్స్‌తో పాటు శానిటైజర్స్‌ను కూడా పంపిణీ చేశాం’’ అన్నారు. సంబంధిత వీడియో కూడా ప్రణీత తన ట్విట్టర్లో పోస్ట్ చేశారు.