Abn logo
Apr 12 2021 @ 00:34AM

ప్రణయ స్వేచ్ఛకు అటూ ఇటూ

పామర దశనుండి పురుషోత్తమాన్ని అందుకోవడానికి చేసే సంఘర్షణ విశ్వనాథ, చలం ఇద్దరి రచనలలో కనిపిస్తుంది. యాదృచ్ఛికంగా జరిగిన ఒక సంఘటనను లేక గతాన్ని ఒక పీడకలగా భావించి యథావిధిగా జీవితాన్ని ఆనందంగా గడపాలనే ప్రయోజనాత్మకమైన ఉత్తమ సందేశాన్ని చలం ‘మైదానం’, విశ్వనాథ ‘చెలియలకట్ట’ రెండు నవలలు అందించలేకపోయాయి. చలం ‘దైవ మిచ్చిన భార్య’, విశ్వనాథ ‘ఏకవీర’ నవలల్లో కూడా ఇదే జరిగింది. సాంఘిక సంప్రదాయాల ‘చెలియలకట్ట’ దాటిన రత్నావళి, అనుకోని పరిస్థితులలో సామాజిక నియమాల ఉల్లంఘనానికి గురయిన ఏకవీర లాంటి స్త్రీలకు ప్రాణత్యాగమే శరణ్యమని ప్రతిపాదించారు విశ్వనాథ. 


శాంతిసాధనకు స్వేచ్ఛా ప్రణయమే మార్గమన్నారు చలం. స్వేచ్ఛా ప్రణయమంటే సామాన్యార్థంలో విశృంఖల ప్రేమ కలాపం కాదు, ప్రేమించకుండా ఉండలేని మహత్తర ప్రణయంతో స్వేచ్ఛగా ప్రేమిం చటం. చలాన్ని కాల్పనికవాది అంటే ఆయన వాస్తవిక దృక్పథం లేకుండా రచనలు చేశాడని కాదు. చలం సమకాలిక సాంఘిక సమస్యలను లేవనెత్తి తనకనుగుణమైన కాల్పనిక జగత్తును మలచు కున్నారు. అన్ని సమస్యలకు వ్యవస్థ మూలం కనుక అది విచ్ఛిన్నం కావాలని చలం వాదన. ‘మైదానం’ నవలలో హద్దులనతిక్రమించిన కథానాయిక రాజేశ్వరికి చివరికి మరణమే శరణ్యమవుతుందన్నది అనివార్య సాంఘిక సత్య నిరూపణ.  


వివాహం స్త్రీ స్వేచ్ఛను హరిస్తుందని, అది స్త్రీని వ్యవస్థకు బలిపశువుగా మారుస్తుందని చలం తన నవలలో చెప్పాడు. వివాహం మన భారతీయ జీవన విధానానికి వెన్నెముక వంటి దని, భారతీయ ఆత్మకు, వైదిక వ్యవస్థకు జీవనాడి వంటిదని, అది అవిచ్ఛిన్నంగా కొనసాగితేనే జాతి మనుగడ సాగింపగలదని విశ్వనాథ తన నవలలో చెప్పాడు. ‘‘మనసులేని వివాహ వ్యవస్థ వ్యర్థం,’’ అని చలం భావన. ‘‘మనసు కోతి వంటిది. దాన్ని అదుపులో ఉంచాలి. వ్యవస్థ పటిష్టమైనది. వ్యక్తికి ఆత్మౌన్నత్యం అవసరం,’’ అని విశ్వనాథ అభిప్రాయం.


విశ్వనాథ పాత్రలు కట్టుబాట్లు, సంప్రదాయాల వల్ల సుఖ పడలేదు. చలం పాత్రలు స్వేచ్ఛాగానం వల్ల సుఖ పడలేదు సరికదా సంఘనీతికి బలైపోయాయి. విశ్వనాథ నవలల్లో మానవుని మూలతత్వానికి, అంతరంగానికి మధ్య సంఘర్షణ కనిపిస్తుంది. చలం నవలల్లో స్త్రీ తనకు సహజమైన ఆర్ద్ర ప్రవృత్తి కారణంగా సంఘనీతికి ఆహుతైపోతుంది. 


సిద్ధాంత ప్రతిపాదన విషయంలో పరస్పర విరుద్ధ భావాలను తమ రచనలల్లో ప్రకటించినా, కళాస్రష్టలుగా విశ్వనాథ, చలం ఇద్దరూ కూడా సార్వకాలిక జీవిత సత్యాలను తమ రచనలలో ప్రతిబింబించారు. సిద్ధాంత ప్రతిపాదనలో వ్యవస్థను తీవ్రంగా ధిక్కరించిన చలం తన రచనలలో అడుగడుగునా సామాజిక వ్యవస్థ స్త్రీకి కల్పించే భద్రతా కవచాన్ని కాదనలేకపోయారు. సార్వకాలిక జీవిత సత్యాలకు, వ్యక్తికి మధ్య ఉన్న సమకాలిక సమాజాన్ని చూస్తూనే విశ్వనాథ వెనుకటి యుగపు ఆదర్శాల బూజును పట్టుకు వేళ్ళాడితే, చలం వందేళ్ళయినా ఆచరణ సాధ్యం కాని విశృంఖలపు అంచున నిలిచిన వైయక్తిక స్వేచ్ఛను తన రచనలలో చిత్రించారు. వ్యక్తి ేస్వచ్ఛకు, ప్రేమకు మధ్య జరిగే సంఘర్షణను చలం ‘శశిరేఖ’ నవలలో చిత్రించారు. శశిరేఖకు ప్రేమ, స్వేచ్ఛా రెండూ ముఖ్యమే. ఒకదాని కోసం మరొకటి వదులుకోవడానికి సిద్ధంగా లేకపోవడమే ఆమె సమస్య. స్వచ్ఛమైన ప్రేమనూ స్వేచ్ఛనూ కోరిన స్త్రీ సమాజంలో ఇమడలేక పోతుందని చెప్పడం కోసమే చలం ఈ నవల వ్రాసినా వీటిని ఎలా సాధించడమో చెప్పలేదు. 


చలం ‘మైదానం’లో రాజేశ్వరి, విశ్వనాథ ‘చెలియలకట్ట’లో రత్నావళి ఇద్దరి జీవితాలు విశృంఖల వర్తనాన్ని ఎరిగినవే. ఇద్దరూ ముగ్ధలు. విశ్వనాథగారి రత్నావళి తొలుత ఎంత అమాయకురాలో తర్వాత అంత నెరజాణ. ఆమె విద్య నేర్చుకొని వివేకవంతురాలై చేసిన తప్పు తెలుసుకొని, పదిమందికి ఆ తప్పును చెప్పగలిగిన ముదితగా ఎదిగింది. జీవితేచ్ఛ నశించగా తనకు తానే ఉప్పెనకు లోనై పోయింది. ఇక్కడ ఉప్పెన ఆమె జీవితంలోని భావ సంఘర్షణకు సంకేతం. అస్తిత్వానికి, వ్యక్తితత్వానికి, అంతరంగానికి మధ్య సజీవ సంఘర్షణతో కూడిన పాత్ర రత్నావళి. తన్ను తాను ఉన్నతీకరించుకొని అంతరంగాన్ని అందుకోవటానికి ప్రయత్నించి తన బలహీనతకు పరిష్కారంగా, శిక్షగా అత్మాహుతి చేసుకొంది.


చలం ‘మైదానం’లో కథానాయిక రాజేశ్వరి కూడ అంతరంగంలోని సంఘర్షణల ఫలస్వరూపంగా మరణించింది. ఈ సంఘర్షణ వ్యక్తి స్వేచ్ఛకు వ్యవస్థకు మధ్య జరిగినది. ఏది ఎలా ఉన్నా వ్యవస్థను మన్నించితీరాలంటారు విశ్వనాథ. వ్యవస్థ విచ్ఛిన్నం కావల్సిందేనంటారు చలం. విశ్వనాథ ‘చెలియలకట్ట’, చలం ‘మైదానం’ వారి ఇద్దరి దృక్పథాలను ప్రతిబింబించే నవలలు. విశ్వనాథ పాత్రలు వ్యవస్థను కాపాడితే, చలం పాత్రలు వ్యవస్థలోని కుళ్ళును కడిగేసాయి. స్వేచ్ఛా ప్రణయంలో సుఖం ఉందని చలం చెప్పలేదు. స్వేచ్ఛగా బ్రతకమని మాత్రమే ఆయన చెప్పారు. 


ఏది ఏమైనా వ్యవస్థను కాదానటానికి వీలులేదనే విశ్వనాథ వ్యవస్థతో నిమిత్తంలేని ప్రణయాన్ని చూపించారు ‘తెరచిరాజు’ నవలలోని వాసంతి పాత్రచిత్రణలో. వ్యవస్థను ధిక్కరించాలనే దృఢసంకల్పంతో స్త్రీ నిస్స హయంగా వ్యవస్థకు ఎలా తలఒగ్గుతుందో చూపించారు చలం ‘వివాహం’ నవలలో. విశ్వనాథ, చలం ఇద్దరూ తమ భావాలకు ప్రతీకలుగా పాత్రలను సృష్టించి రచనలు చేసారు. విశ్వనాథ ‘వేయి పడగలు’ నవల్లో పాత్రలు చాలావరకు ప్రతీకలే. ప్రధాన పాత్రలైన అరుంధతీ, ధర్మారావులు దాంపత్యధర్మానికి ప్రతీకలు. చలం ‘అమీనా’ నవలలో అమీనా చలం అంతరంగానికి ప్రతీక. తన అంతరంగాన్ని తానే అందుకోలేకపోతున్న చలం ఆత్మ విమర్శ ‘అమీనా’ నవలలో అడుగడుగునా కనిపిస్తుంది. 


వ్యవస్థలో దంపతులు ధర్మాన్ని అనుసరించడం లేదు కనుక వ్యవస్థ నిరర్థకమవుతున్నది. అలాగాక ధర్మాన్ని అనుసరిస్తే అది సార్థకమవు తున్నది. అందుచేత వ్యవస్థ పతనావస్థ అనే లోపం వ్యక్తులది కాని వ్యవస్థది కాదని వ్యవస్థను సమర్థించారు విశ్వనాథ. అయితే ఇవే మాటలు చలం స్వేచ్ఛ ప్రణయ సిద్ధాంతాన్ని సమర్థించుకోవటానికి కూడా ఉపయోగించవచ్చు. మూర్ఖులు స్వార్థానికి, స్వప్రయోజనానికి అనుగుణంగా వ్యాఖానించుకోవటం వలన స్వేచ్ఛా ప్రణయం వ్యభిచారానికి పర్యాయపదంగా మారింది తప్ప సిద్ధాంతరీత్యా అది వ్యవస్థకు కట్టు బడటంకంటే మరింత క్లిష్టమైనదీ, పవిత్రమైనదీ అని చెప్పవచ్చు. చలం తన ‘జీవితాదర్శం’ నవల ద్వారా ఇదే చెప్పారు. స్త్రీ స్వేచ్ఛా భావాలను పురుషులు ఎలా స్వార్థానికి ఉపయోగించుకొంటున్నారో విశ్వనాథ చలం ఇద్దరూ చమత్కారభరితంగా రచనల్లో చూపించారు. 

మంగు శివరామ ప్రసాద్‌

91107 88060


Advertisement
Advertisement
Advertisement