Advertisement
Advertisement
Latest Telugu News
Advertisement

కులానికి కోణాలున్నాయి!

twitter-iconwatsapp-iconfb-icon
కులానికి కోణాలున్నాయి!

అమెరికాలో పుట్టి పెరిగిన ఆ అమ్మాయి భారతదేశంలోని కుల వివక్షను ప్రత్యక్షంగా చూసింది. కాలేజీ చదువులో భాగంగా రిజర్వేషన్లపై థీసీస్‌ సమర్పించి ఉత్తమ పరిశోధన అవార్డు అందుకుంది. రెండు పదుల వయసైనా నిండని ఆ అమ్మాయి పేరు ప్రణతి చరసాల. కులరహిత భారతదేశం కోసం తన వంతు ప్రయత్నం చేస్తానంటున్న ప్రణతి ‘నవ్య’తో పంచుకున్న విశేషాలు...


‘‘మా సొంత ఊరు కడప జిల్లాలోని కల్పనాయిని చెరువు. మా నాన్న ప్రసాద్‌ చరసాల పాతికేళ్ల కిందటే అమెరికాలో స్థిరపడ్డారు. నేను పుట్టిందీ, పెరిగిందీ అమెరికాలోనే. రెండు, మూడేళ్ళకు ఒకసారి మా కుటుంబం స్వగ్రామానికి వెళుతూ ఉంటుంది. భారతదేశంలోని కుల వ్యవస్థ గురించి నాకు కొంత అవగాహన ఉంది. కానీ, ఆ కుల వివక్షను కళ్లారా చూసిన తర్వాత నేను తెలుసుకోవాల్సింది చాలా ఉందని అర్థమయింది. నాలుగేళ్ల కిందట ఇండియాకి వచ్చినప్పుడు మా నాన్న స్నేహితుడిని కలవడానికి మా ఊరిలోని దళితవాడకు వెళ్ళారు. నన్నూ తన వెంట తీసుకువెళ్ళారు. మాతో నా నాయనమ్మ కూడా వచ్చింది. మమ్మల్ని దూరం నుంచి చూసిన నాన్న స్నేహితుడు లేచి, నిలబడడం గమనించాను. ఆయన మాకు ఎదురు వచ్చి ఆప్యాయంగా పలకరించారు. కానీ వాళ్ళ ఇంటి లోపలికి మాత్రం మమ్మల్ని తీసుకెళ్లలేదు. వసారాలోని మంచం వాల్చి, కూర్చొమని మాకు మర్యాద చేశారు. ఆయన, ఆయన  కుటుంబ సభ్యులు నేల మీదే కూర్చున్నారు. వాళ్ల ప్రవర్తన నాకు విచిత్రంగా అనిపించింది. నేను వాళ్ల పక్కన కూర్చోబోయాను. మా నాయనమ్మ వద్దని వారించింది. ఆమె మాట వినకుండా, నేలమీద కూర్చున్నాను. అప్పుడు మా నాన్న ఫ్రెండ్‌, ఆయన కుటుంబ సభ్యులూ  చాలా ఇబ్బంది పడ్డారు. అది నన్ను తీవ్రంగా ఆలోచింపజేసింది. అదే సమయంలో, మా ఊర్లో దళితుల పట్ల అగ్రకులాలు చూపే అస్పృశ్యతను కళ్లారా చూశాను. ‘ఇదేం సంస్కృతి?’  అని మా నాయనమ్మను అడిగితే, ‘‘కుల వ్యత్యాసం అమ్మా! ఇక్కడ పద్ధతులు ఇలాగే ఉంటాయి. వాటిని బట్టే మనమూ నడుచుకోవాలి’’ అంది. ఒక మనిషిని మనిషిగా కాకుండా, పుట్టుక ఆధారంగా గౌరవించడం నన్ను బాధించింది. కులవివక్షపై నావంతుగా పోరాడాలని అప్పుడే నిశ్చయించుకున్నాను.  


ఉత్తమ పరిశోధనగా...

ప్రస్తుతం నేను వాషింగ్టన్‌ డీసీకి కొంచెం దూరంలో ఉన్న గ్లెనెల్‌ హైస్కూల్లో పన్నెండో తరగతి చదువుతున్నాను. నా స్టడీ్‌సలో ‘గిఫ్టెడ్‌ అండ్‌ టాలెంటెడ్‌ రీసెర్చ్‌’ అనే ప్రోగ్రాం ఒకటి ఉంది.. అందులో భాగంగా ఎవరికి నచ్చిన అంశం మీద వారు పరిశోధన చేసి, థీసీస్‌ సమర్పించాలి.  ఉత్తమ పరిశోధనలను ఎంపికచేసి, విద్యార్థులకు ప్రత్యేక అవార్డు ఇస్తారు.. నేను ‘అఫెర్మేటివ్‌ యాక్షన్‌ ఇన్‌ ఇండియా’ పేరుతో... రిజర్వేషన్ల వల్ల దళితులకు నిజంగానే లబ్ది చేకూరిందా?,  ‘రిజర్వేషన్లు దేశాభివృద్ధికి అడ్డంకి’ అని ఓపెన్‌ కేటగిరీకి చెందిన కొందరి వాదనల్లో వాస్తవమెంత?’ అనే అంశాలపై పరిశోధన చేశాను. మేము నివసించే ప్రాంతానికి దగ్గరలోనే ఉన్న సీనియర్‌ జర్నలిస్టు నరిసెట్టి గారిని నా పరిశోధనకు గైడ్‌ చేయమని కోరాను. అందుకు ఆయన అంగీకరించారు. అప్పటికే ఇంటర్నెట్‌లో ఈ అంశాలకు సంబంధించిన కొంత డేటాను సేకరించాను. డాక్టర్‌ బి.ఆర్‌.అంబేద్కర్‌ రాసిన వ్యాసాలు కొన్ని చదివాను. క్షేత్రస్థాయి పరిశీలన కోసం ఇండియాకి వచ్చి, ప్రొఫెసర్‌ కంచె ఐలయ్య, ప్రొఫెసర్‌ సూరేపల్లి సుజాత, రచయితలు ఇండస్‌ మార్టిన్‌, అరుణాంక్‌ లత తదితరులను కలిశాను. కరీంనగర్‌, పశ్చిమగోదావరి జిల్లాల్లోని కొన్ని దళితవాడలకు వెళ్లాను. అక్కడ కుల అహంకారానికి బలైన కొన్ని కుటుంబాలతో మాట్లాడాను. మామిడికాయలు దొంగిలించాడనే కారణంగా అగ్రకులస్థులు కొందరు కలిసి ఒక దళిత వ్యక్తిని చంపిన ఘటన వినగానే నాకు ఆగ్రహం వచ్చింది. కులానికి వేరు వేరు కోణాలు ఉంటాయని అప్పుడే అర్థమయింది. అదే సమయంలో భారతదేశంలోని మతతత్వ దాడులగురించీ, ముఖ్యంగా ముస్లింలపై కొనసాగుతున్న దుష్ప్రచారం గురించీ విన్నాను. అవన్నీ తెలుసుకున్న నాలో కుల, మత విద్వేషాలకు వ్యతిరేకంగా పనిచేయాలనే కోరిక పెరిగింది. రిజర్వేషన్ల కారణంగా దళితుల జీవితాలు పూర్తిగా మారకున్నా, కొంత లబ్ది అయితే జరిగిందని నా పరిశోధన ద్వారా తెలుసుకున్నా. రిజర్వేషన్లే దేశాభివృద్ధికి ప్రధాన అడ్డంకి అని కొందరు వాదిస్తూ ఉంటారు. కొన్నివేల ఏళ్లుగా సామాజికంగా, ఆర్థికంగా అణచివేత, దోపిడీలకు గురైన దళిత, బహుజనులకు రిజర్వేషన్లు కల్పించడం ద్వారానే దేశం ఆర్థికంగానూ బలపడుతుందనీ, తద్వారా సామాజిక ప్రగతి సాధ్యమవుతుందని గుర్తించాలి.  ఇన్నయ్య గారి మార్గనిర్దేశకత్వంలో అవే అంశాలను విశ్లేషిస్తూ నేను రూపొందించిన పరిశోధనా పత్రాన్ని మా స్కూల్‌లో సమర్పించాను. దానికి ఈ ఏడాది ‘ఉత్తమ పరిశోధన’  అవార్డు లభించింది. 


అగ్రరాజ్యంలో నిరసన...

అమెరికాలోని జాత్యహంకారాన్నీ, ఇండియాలోని కులవివక్షనూ ఒక్కటిగా చూడలేం. అక్కడ తరతరాలుగా చెలామణిలో ఉన్న జాత్యహంకారానికి మతం ఆమోదం లేదు. భారతీయ సమాజంలో కులవివక్షకు మతమే పునాది. జార్జిఫ్లాయిడ్‌ హత్యను నిరసిస్తూ, పలు కార్యక్రమాలు నిర్వహించాం. జాత్యహంకారాన్నీ, కులవివక్షనూ సరిపోలుస్తూ ‘బోర్న్‌ క్యాస్ట్‌లెస్‌’ పేరుతో ఒక వ్యాసం రాసి అమెరికాలో పత్రికలకు పంపాను. అది కొన్ని చోట్ల ప్రచురితమైంది కూడా. అదే విధంగా మోదీ ప్రభుత్వం తీసుకొచ్చిన సీఏఏ, ఎన్నార్సీలకు వ్యతిరేకంగా అగ్రరాజ్యంలోని భారత రాయబార కార్యాలయం వద్ద ఉద్యమించాం. పుట్టుకతో నేను అమెరికన్‌ అయినా, నా అస్తిత్వం భారతదేశంతో ముడిపడి ఉంది.  భారతీయ మహిళ అనగానే సహజంగా కొంత స్టీరియోటైపు ఆలోచనలు చాలామంది మదిలో మెదులుతాయి. నన్నూ ఆ కోణం నుంచి చూసే వ్యక్తులు కొందరు నాకు అప్పుడప్పుడు తారసపడుతుంటారు. అలాంటి వ్యక్తులతో నేనూ గట్టిగా పోరాడుతుంటాను. అంతర్జాతీయ వాదంగొప్పదని నమ్ముతాను. దేశంకాని దేశంలోనూ ‘నా దేశం’ అంటూ సంకుచిత ధోరణితో మాట్లాడటం నాకు ఇష్టం ఉండదు. బాగా చదువుకొని, అమెరికా వచ్చి పెద్ద పెద్ద ఉద్యోగాల్లో స్థిరపడిన వాళ్లు సైతం తమ కులాలను, పాత భావాలను పట్టుకొని వేలాడటం చూస్తుంటే నవ్వొస్తుంది.


‘వెలిసిపోయిన’ కథ...

శరీర చాయకు మన సమాజంలో అధికంగా ప్రాధాన్యత ఇస్తాం. ఆ క్రమంలో నలుపు రంగు పట్ల చాలామందిలో ఒక చులకన భావం. సౌందర్య లేపనాల ప్రకటనలన్నిటికీ మహిళల శరీర చాయే ఇతివృత్తంగా సాగుతుంటాయి. కొన్నివందల కోట్ల రూపాయల క్రీములు, పౌడర్ల వ్యాపారం జరుగుతోంది. పైగా నలుపు రంగును అశుభంగా పరిగణించడం మన సంప్రదాయంలో భాగం. ఈ నేపథ్యంలో తెల్లదనంమీద వ్యామోహాన్ని ప్రశ్నిస్తూ ‘బ్లీచ్డ్‌’ పేరుతో ఒక కథ రాశాను. అది అమెరికాలోని ‘బ్రిడ్జ్‌’ పత్రికలో ప్రచురితమైంది. ఇదే కథను ఇండస్‌ మార్టిన్‌ ‘వెలిసిపోయిన’ పేరుతో తెలుగులోకి అనువదించారు. 


బైడెన్‌ గెలుపు కోసం...

మా స్కూల్‌లోని యంగ్‌ డెమోక్రాట్స్‌ క్లబ్‌లో నేనూ సభ్యురాలిని. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో బైడెన్‌ గెలుపు కోసం మా గ్రూపు తరపున నేనూ ప్రచారం చేశాను. మరో నెల రోజుల్లో నా స్కూలు చదువు పూర్తి అవుతుంది. అమెరికాలోని ప్రతిష్టాత్మకమైన కార్నెల్‌ యూనివర్సిటీలో నాకు సీటు వచ్చింది. అందులో ‘ఇండస్ట్రీస్‌ అండ్‌ లేబర్‌ రిలేషన్స్‌’ ప్రత్యేక సబ్జెక్టుగా డిగ్రీలో చేరబోతున్నా. నాకు ‘లా’ ప్రాక్టీసు చేయాలని కోరిక. ఆ దిశగా నా కెరీర్‌ను ప్లాన్‌ చేసుకుంటున్నాను. కొద్దిరోజులుగా ‘వాషింగ్టన్‌ పోస్ట్‌’, ‘న్యూయార్క్‌టైమ్స్‌’ పతాకశీర్షికలుగా భారత్‌లోని కొవిడ్‌ వార్తలే ఉంటున్నాయి. ఆక్సిజన్‌ అందక, ఆస్పత్రుల్లో బెడ్లు లేక చాలామంది చనిపోవడం చూస్తుంటే గుండె ద్రవించిపోతోంది.


మరో పరిశోధన చేస్తా...

ఒక జీవితకాల పోరాటంతోనైనా కులనిర్మూలన సాధ్యం కాదు. కులవివక్షకు వ్యతిరేకంగా నిరంతర పోరాటం అవసరం. ముందుగా కులం అనేది ‘ఒక సమస్య’ అని భారతీయులు గుర్తించాలి. కులనిర్మూలన కోసం పనిచేసే నాయకులను ఎన్నుకోవాలి. సామాజిక ఉద్యమాలు బలోపేతం కావాలి. అప్పుడే కులనిర్మూలన దిశగా భారతదేశం పయనిస్తుంది. దీని కోసం నా వంతుపోరాటాన్ని కొనసాగిస్తాను. కార్నెల్‌ యూనివర్సిటీ ప్రత్యేక పరిశోధన కోసం నాకు నాలుగువేల డాలర్లను ఉపకారవేతనంగా ప్రకటించింది. తద్వారా కులానికి సంబంధించిన కొత్త కోణంపై మరో పరిశోధన కొనసాగించే అవకాశం లభించింది. ఇలా నాకు అందివచ్చే ప్రతి అవకాశాన్నీ కులనిర్మూలనా పోరాటానికి తోడ్పడేలా మలుచుకుంటాను.’’


- కురసాల వెంకటేష్‌

Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
OpinionPoll
Advertisement
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.