విషమంగానే ప్రణబ్‌ ఆరోగ్యం

ABN , First Publish Date - 2020-08-13T07:02:36+05:30 IST

మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉందని, ఆయన వెంటిలేటర్‌ మీదే ఉన్నారని ఢిల్లీ ఆర్మీ ఆస్పత్రి వర్గాలు బుధవారం ప్రకటించాయి. ఆయన శరీరంలో రక్తసరఫరా వ్యవస్థ పనితీరు ప్రస్తుతానికి స్థిరంగానే ఉన్నప్పటికీ ఆరోగ్య పరిస్థితిలో మెరుగుదల కనిపించడం లేదని వైద్యులు తెలిపారు...

విషమంగానే ప్రణబ్‌ ఆరోగ్యం

న్యూఢిల్లీ, ఆగస్టు 12: మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉందని, ఆయన వెంటిలేటర్‌ మీదే ఉన్నారని ఢిల్లీ ఆర్మీ ఆస్పత్రి వర్గాలు బుధవారం ప్రకటించాయి. ఆయన శరీరంలో రక్తసరఫరా వ్యవస్థ పనితీరు ప్రస్తుతానికి స్థిరంగానే ఉన్నప్పటికీ ఆరోగ్య పరిస్థితిలో మెరుగుదల కనిపించడం లేదని వైద్యులు తెలిపారు. మెదడు నాళాల్లో రక్తం గడ్డ కట్టడంతో ఆయన సోమవారం ఆస్పత్రిలో చేరగా.. వైద్యులు అదే రోజు సర్జరీ చేసి ఆ గడ్డను తొలగించిన విషయం తెలిసిందే. ఈనేపథ్యంలో ప్రణబ్‌ కుమారుడు, కాంగ్రెస్‌ ఎమ్మెల్యే అభిజిత్‌ ముఖర్జీ బుధవారం సాయంత్రం ఓ ట్వీట్‌ చేశారు.


‘‘మీ అందరి ప్రార్థనలు అందించిన బలంతో మా నాన్న క్షేమంగానే ఉన్నారు. ఆయన హెమోడైనమికల్లీ (అంటే గుండెకు రక్తప్రసరణ సజావుగా జరుగుతోంది) నిలకడగానే ఉన్నారు. నాన్న త్వరగా కోలుకోవాలని మీరందరూ ప్రార్థనలు కొనసాగించండి’’ అని ఆయన తన ట్వీట్‌లో ప్రస్తావించారు. ప్రణబ్‌ ఆరోగ్య స్థితిపై ఆయన కుమార్తె షర్మిష్ఠా.. బుధవారం ట్విటర్లో స్పందించారు. ‘‘గతేడాది ఆగస్టు 8 నాకు ఆనందకరమైన రోజు. ఆ రోజు నాన్న భారతరత్న అందుకున్నారు. ఏడాది తర్వాత ఆయన ఆరోగ్యం విషమంగా ఉంది. దేవుడికి ఏది సరైనదనిపిస్తుందో అది చేయాలని కోరుకుంటున్నాను. ఆనందాన్నయినా, బాధనయినా తట్టుకునే శక్తిని ప్రసాదించాల్సిందిగా వేడుకుంటున్నాను’’ అన్నారు. 


Updated Date - 2020-08-13T07:02:36+05:30 IST