ఉద్యోగులకు తాయిలాలు..

ABN , First Publish Date - 2021-11-14T15:38:52+05:30 IST

ఉద్యోగులకు..

ఉద్యోగులకు తాయిలాలు..

కంపెనీ షేర్ల నుంచి ప్రమోషన్ల వరకూ

వలసల కట్టడికి ఐటీ కంపెనీల చర్యలు


హైదరాబాద్‌(ఆంధ్రజ్యోతి): నిపుణులు కంపెనీని విడిచి వెళ్లకుండా ఉండేందుకు సాఫ్ట్‌వేర్‌ కంపెనీలు ఉద్యోగులకు రకరకాల తాయిలాలు ప్రకటిస్తున్నాయి. డిజిటల్‌ టెక్నాలజీలకు గిరాకీ.. సాఫ్ట్‌వేర్‌ కంపెనీలకు ఖాతాదారుల నుంచి కాంట్రాక్టులు పెరగడం, పెద్ద కాంట్రాక్టులు రావడంతో సాఫ్ట్‌వేర్‌ పరిశ్రమలో నిపుణులకు గత కొద్ది నెలలుగా గిరాకీ పెరిగింది. దీంతో నిపుణులను ఆకర్షించడానికి కంపెనీలు ఎక్కువ వేతనాలను ఆఫర్‌ చేస్తున్నాయి. కోర్‌ నైపుణ్యాలు ఉన్న నిపుణులను స్టార్ట్‌పలు ఆకర్షణీయ వేతనాలు చెల్లించి చేర్చుకుంటున్నాయి. ఈ పరిణామాలతో సాఫ్ట్‌వేర్‌ కంపెనీల్లో ఉద్యోగుల వలసల రేటు పెరిగింది. ప్రస్తుతం వలసల రేటు 20 శాతానికి పైగా మించింది. ఇది ఈ దశాబ్ద కాలంలోనే అత్యధికం కావటం గమనార్హం. కాగా తమ కంపెనీలో వలసల రేటు అత్యధికంగా 33 శాతానికి చేరినట్లు ఇటీవల కాగ్నిజెంట్‌ టెక్నాలజీస్‌ సొల్యూషన్స్‌ ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఉద్యోగులు కంపెనీని వదిలి వెళ్లకుండా పలు సాఫ్ట్‌వేర్‌ కంపెనీలు ఉద్యోగులకు రకరకాల తాయిలాలు ఇస్తున్నాయి. 


ఆఫర్ల మీద ఆఫర్లు..

ఉద్యోగులు కంపెనీని వదిలి వెళ్లకుండా ఉండేందుకు ఎంప్లాయిస్‌ స్టాక్‌ ఆప్షన్స్‌ (ఇసాప్స్‌) నుంచి ప్రమోషన్ల వరకూ సాఫ్ట్‌వేర్‌ కంపెనీలు రకరకాల ఆఫర్లు ఇస్తున్నాయి. ఇసాప్స్‌ చాలా కాలం నుంచి ఐటీ కంపెనీల్లో ఉన్నప్పటికీ.. వలసలను అరికట్టడానికి ఇప్పుడు దీన్ని ఒక సాధనంగా వాడుకుంటున్నాయని హైదరాబాద్‌కు చెందిన ఐటీ కంపెనీ ప్రతినిధి ఒకరు తెలిపారు. ఇసాప్స్‌, వేతనాలు పెంచడం, బోన్‌సలు ఇవ్వడం వంటి ద్రవ్యపరమైన ప్రయోజనాలతోపాటు ఉద్యోగులను ఎక్కువ గంటలు శ్రమపెట్టకుండా జాగ్రత్తలు తీసుకోవడం, పని గంటల్లో వెసులుబాటు వంటి అనేక చర్యలను ఐటీ కంపెనీలు తీసుకుంటున్నాయి. మరోవైపు ప్రమోషన్లు ఇస్తున్నాయి


కార్పస్‌ ఫండ్‌ ఏర్పాటు..

వలసలను కట్టడి చేయడానికి కార్పస్‌ ఫండ్స్‌ను ఐటీ కంపెనీలు ఏర్పాటు చేస్తున్నాయి. ప్రస్తుతం దాదాపు అన్ని ఐటీ కంపెనీలకు ఉద్యోగుల వలసల సమస్య ఉందని.. ఫ్రెషర్లను తీసుకుని వారికి శిక్షణ ఇచ్చి, వారు పని చేసే స్థాయికి చేరే వరకూ వలసల సమస్య ఉండనుందని హైదరాబాద్‌ సాఫ్ట్‌వేర్‌ ఎంటర్‌ప్రైజెస్‌ (హైసియా) సీఓఓ శ్రీనివాసరావు అన్నారు. సాధారణంగా ఉద్యోగుల పనితీరును అంచనా వేసి ఐటీ కంపెనీలు వేతనాలను పెంచుతాయి. ప్రస్తుతం వలసలను కట్టడి చేయడానికి కంపెనీలు మధ్యంతర వేతన పెంపు చేస్తున్నాయని.. ఇది 15-20 శాతం వరకూ ఉందన్నారు. ఇతర కంపెనీలకు మారుతున్న నిపుణుల్లో ఎక్కువ మంది 3-7 ఏళ్ల అనుభవం ఉన్నవారే అధికంగా ఉంటున్నారని చెప్పారు. కాగా ప్రస్తుతం నిపుణులకు గిరాకీ ఉండడంతో ఎంపిక చేసిన వారు కంపెనీలో చేరతారో లేదో అన్న అనుమానంతో ఒక ఉద్యోగం కోసం ఐదుగురిని షార్ట్‌లిస్ట్‌ చేస్తున్నాయని ఐటీ పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. 

Updated Date - 2021-11-14T15:38:52+05:30 IST