రాజీనామా చేసిన గోవా ముఖ్యమంత్రి

ABN , First Publish Date - 2022-03-12T19:06:52+05:30 IST

గోవాలో భారతీయ జనతా పార్టీ కొత్త ప్రభుత్వం ఏర్పడేందుకు మార్గం సుగమం చేస్తూ..

రాజీనామా చేసిన గోవా ముఖ్యమంత్రి

పనజి: గోవాలో భారతీయ జనతా పార్టీ కొత్త ప్రభుత్వం ఏర్పడేందుకు మార్గం సుగమం చేస్తూ ఆ పార్టీ నేత, ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ తన పదవికి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను గవర్నర్ పీఎస్ శ్రీధరన్ పిళ్లైకి శనివారంనాడు ఆయన అందజేశారు. కొత్త ప్రభుత్వం ఏర్పడేంత వరకూ ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగాల్సిందిగా ఈ సందర్భంగా సావంత్‌ను గవర్నర్ కోరారు. గవర్నర్‌ను కలుసుకునేందుకు సావంత్‌తో పాటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సదానంద్ షెట్ తనవడే రాజ్‌భవన్‌కు వెళ్లారు.


పరిశీలకులు వస్తున్నారు...

అనంతరం, ప్రమోద్ సావంత్ మీడియాతో మాట్లాడుతూ, కొత్త ప్రభుత్వం ఏర్పడేంతవరకూ తనను ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగమని కోరుతూ నియామక పత్రాన్ని తనకు గవర్నర్ ఇచ్చారని చెప్పారు. గోవాలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేసే తేదీని పార్టీ ఇంకా పార్టీ నిర్ణయించ లేదని చెప్పారు. పార్టీ కేంద్ర పరిశీలకులు గోవాతో పాటు ఇతర మూడు రాష్ట్రాల్లో (ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, మణిపూర్) పర్యటిస్తారని, ఆ తర్వాత సంబంధిత రాష్ట్రాల్లో ఎప్పుడు ప్రమాణస్వీకారోత్సవం ఉంటుందో ప్రకటిస్తారని చెప్పారు. గోవాకు కేంద్ర పరిశీలకులు ఎప్పుడు వస్తారనేది ఆయన చెప్పడానికి నిరాకరించారు. కాగా, ఈనెల 15వ తేదీతో గోవా అసెంబ్లీ పదవీకాలం ముగియనుంది.


Updated Date - 2022-03-12T19:06:52+05:30 IST