టోక్యో పారాలింపిక్స్.. భారత్‌ ఖాతాలో మరో రెండు పతకాలు, భగత్‌కు బంగారం

ABN , First Publish Date - 2021-09-04T22:43:59+05:30 IST

పారాలింపిక్స్‌లో భారత అథ్లెట్లు పతకాల జడివాన కురిపిస్తున్నారు. వరుస పతకాలతో త్రివర్ణ పతకాన్ని

టోక్యో పారాలింపిక్స్.. భారత్‌ ఖాతాలో మరో రెండు పతకాలు, భగత్‌కు బంగారం

టోక్యో: పారాలింపిక్స్‌లో భారత అథ్లెట్లు పతకాల జడివాన కురిపిస్తున్నారు. వరుస పతకాలతో త్రివర్ణ పతకాన్ని రెపరెపలాడిస్తున్నారు. ఈ (శనివారం) ఉదయం ఇప్పటికే రెండు పతకాలను కైవసం చేసుకున్న భారత క్రీడాకారులు తాజాగా మరో రెండు పతకాలను సాధించిపెట్టారు.


ప్రమోద్ భగత్ పారా-బ్యాడ్మింటన్‌లో భారత్‌కు తొలి పతకాన్ని అందించి రికార్డులకెక్కాడు. సింగిల్స్ బ్యాడ్మింటన్ ఎస్ఎల్3 ఈవెంట్‌లో 33 ఏళ్ల భగత్.. గ్రేట్ బ్రిటన్ ఆటగాడు డేనియల్ బెథల్‌ను ఓడించి పసిడి పతకం సొంతం చేసుకున్నాడు.  


నాలుగుసార్లు ప్రపంచ చాంపియన్‌షిప్ బంగారు పతక విజేత అయిన ప్రమోద్ భగత్.. 45 నిమిషాల్లోనే డేనియల్‌పై 21-14, 21-17 వరుస సెట్లతో విజయం సాధించాడు. ఐదేళ్ల వయసులోనే పోలియో బారినపడిన భగత్ దేశంలోని అత్యుత్తమ పారా షట్లర్లలో ఒకడిగా పేరుగాంచాడు. 45 అంతర్జాతీయ పతకాలు సాధించాడు. ఇందులో నాలుగు ప్రపంచ చాంపియన్‌షిప్ గోల్డ్ మెడల్స్ ఉన్నాయి. అలాగే, 2018 ఏషియన్ పారా గేమ్స్‌లో కాంస్య పతకం సాధించాడు.  


మనోజ్‌కు కాంస్యం

ఇదే అంశంలో భారత్‌కు మరో పతకం సొంతమైంది. పురుషుల సింగిల్స్‌లో కాంస్య పతకం కోసం జరిగిన మ్యాచ్‌లో మనోజ్ సర్కార్ విజయం సాధించి కాంస్య పతకం సొంతం చేసుకున్నాడు. అంతకుముందు ఈ ఉదయం సెమీఫైనల్‌లో ఓటమి పాలైన మనోజ్ ఆ తర్వాత అద్భుతంగా పుంజుకున్నాడు.


జపాన్‌కు చెందిన డైసుకె ఫుజిహరతో జరిగిన మ్యాచ్‌లో మనోజ్ వరుస (22-20, 21-13) గేముల్లో విజయం సాధించి కాంస్యాన్ని కైవసం చేసుకున్నాడు. తాజా పతకాలతో కలుపుకుని దేశానికి మొత్తంగా 17 పతకాలు లభించాయి. ఇందులో నాలుగు స్వర్ణాలు, ఏడు రజతాలు, ఆరు కాంస్యాలు ఉన్నాయి. ఇక, పతకాల పట్టికలో భారత్  25వ స్థానానికి ఎగబాకింది.



Updated Date - 2021-09-04T22:43:59+05:30 IST