వైవాహిక జీవితం విఫలం, పాక్ గూఢచర్యం ఆరోపణలు.. కడవరకూ కష్టాల్లోనే తొలి మిస్ ఇండియా జీవితం

ABN , First Publish Date - 2022-06-11T16:10:59+05:30 IST

1947లో మిస్ ఇండియా టైటిల్‌ను గెలుచుకున్న...

వైవాహిక జీవితం విఫలం, పాక్ గూఢచర్యం ఆరోపణలు.. కడవరకూ కష్టాల్లోనే తొలి మిస్ ఇండియా జీవితం

1947లో మిస్ ఇండియా టైటిల్‌ను గెలుచుకున్న మొదటి మహిళ ఎస్తేర్ విక్టోరియా అబ్రహం. ఆమె రంగస్థలం పేరు ప్రమీల. 1947లో ప్రమీల, 1967లో ఆమె కూతురు నాకీ జహాన్ కూడా మిస్ ఇండియా టైటిల్‌ను గెలుచుకున్నారు. ఈ టైటిల్‌ను పొందిన మొదటి, ఏకైక తల్లీకూతుళ్ల జంట వీరే. మిస్ ఇండియా విజేతగా నిలిచిన ప్రమీల హిందీ చిత్రసీమలోకి డ్యాన్సర్‌గా అడుగుపెట్టారు. సినిమాల్లోకి వచ్చాక దాదాపు 31 సినిమాల్లో నటించడంతో పాటు డేంజరస్ స్టంట్స్ చేస్తూ తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నారు. నటనతో పాటు 16 చిత్రాలను నిర్మించారు. ఆమె జీవితం చిన్నప్పటి నుండి అనేక  కష్టాల మధ్య సాగింది. విజయం సాధించాక ప్రభుత్వంతో సుదీర్ఘ పోరాటం చేయాల్సి వచ్చింది. 


పాకిస్థాన్ గూఢచర్యానికి పాల్పడ్డారనే అనుమానంతో అప్పటి మహారాష్ట్ర ముఖ్యమంత్రి ప్రమీలను జైలుకు పంపారు. ప్రమీల 1916 డిసెంబర్ 30న కోల్‌కతాలోని బాగ్దాదీ కుటుంబంలో జన్మించారు. ఆమె తండ్రి రిబ్ అబ్రహం వ్యాపారవేత్త తల్లి మటిల్డా పాకిస్తాన్‌లోని కరాచీకి చెందినవారు. ప్రమీలకు ఆరుగురు తోబుట్టువులు. 17 ఏళ్ల వయసులో ప్రమీల కుటుంబానికి దూరమయ్యారు. ఆమెకు బొంబాయిలోని పార్సీ ట్రావెలింగ్ థియేటర్ గ్రూప్‌లో పనిచేసే అవకాశం వచ్చింది.  ప్రమీల నాటకాల్లో పనిచేస్తూనే.. చదువు కొనసాగించారు. ప్రమీల 1935లో హిందీ చిత్రసీమలోకి అడుగుపెట్టారు. తరువాత మహామాయ, సరళ, హమారీ బేటియా వంటి హిట్ చిత్రాలు ఆమెకు విజయాన్ని అందించాయి. ప్రమీల రెండు పెళ్లిళ్లు చేసుకున్నారు. ప్రమీల తన 31 ఏళ్ల వయసులో 1947లో జరిగిన తొలి మిస్ ఇండియా పోటీల్లో పాల్గొని టైటిల్ గెలుచుకున్నారు. ఆశ్చర్యకరంగా మిస్ ఇండియా విజేతగా ఎన్నికైనప్పుడు ఆమె గర్భవతి. ప్రమీలకు అప్పటి మహారాష్ట్ర ముఖ్యమంత్రి మొరార్జీ దేశాయ్ కిరీటం ధరింపజేశారు. సరిగ్గా 20 ఏళ్ల తర్వాత 1967లో ప్రమీల కూతురు నకీ జహాన్ మిస్ ఇండియా టైటిల్ గెలుచుకున్నారు. ఈ టైటిల్‌ను సాధించిన తొలి తల్లీకూతుళ్లు ఇదే కావడం విశేషం. 1962లో ప్రమీల భర్త అన్నీ వదిలేసి పాకిస్థాన్ వెళ్లాలనుకున్నారు. అందుకు ప్రమీల అంగీకరించలేదు. ఇండియాలోనే ఉండిపోయారు. 1961 తర్వాత సినిమాల్లో నటించడం మానేశారు. ప్రమీల తన 89 ఏళ్ల వయసులో 2006 ఆగస్టు 6న కన్నుమూశారు. 

Updated Date - 2022-06-11T16:10:59+05:30 IST