పొంచి ఉన్న ప్రమాదం!

ABN , First Publish Date - 2020-11-25T05:25:52+05:30 IST

పొంచి ఉన్న ప్రమాదం!

పొంచి ఉన్న ప్రమాదం!
సురసముద్రం చెరువు తూము వద్ద కట్ట కింది నుంచి లీకేజీ అయి వృథాగా పోతున్న నీరు

  • సురసముద్రం చెరువు కట్ట తూముల వద్ద లీకేజీ 
  • నెలల తరబడి వృథాగా పోతున్న నీరు  
  • ఆందోళన చెందుతున్న రైతులు, సమీప కాలనీ వాసులు 
  • పట్టించుకోని ప్రజాప్రతినిధులు, అధికారులు 

ఆమనగల్లు : ఆమనగల్లు సురసముద్రం చెరువు కట్ట వద్ద ప్రమాదం పొంచి ఉంది. ఒక వైపు నడిమి తూము, నక్కల తూము ల వద్ద నీరు లీకేజీ అవుతూ వృథాగా పోతుంది. మరో వైపు కట్ట మైసమ్మ ఆలయం వద్ద కట్ట కింది నుంచి నెలల తరబడి చెరువులోని నీరు బయటకు పారుతోంది. ఫలితంగా కింది భాగంలో ఉన్న బీసీ కాలనీ వాసులు, రైతులు ఎప్పుడు ఏం జరుగుతుందోనని ఆందోళన చెందుతున్నారు. రోజుల తరబడి నీరు లీకేజీ అవుతుండడంతో కట్టకు కూడా ప్రమాదం జరిగే అవకాశం ఉందని స్థానికులు వాపోతున్నారు. నీరు పారడంతో ఆమనగల్లు-షాద్‌నగర్‌ ప్రధాన రహదారిపై రాకపోకలకు కూడ ఇబ్బందిగా మారింది. సురసముద్రం చెరువు వేల ఎకరాలకు సాగునీరు, అనేక గ్రామాలకు తాగునీరు అందిస్తోంది. దశాబ్దాల క్రితం నిర్మించిన ఈ చెరువును మిషన్‌ కాకతీయలో భాగంగా మినీ ట్యాంక్‌బండ్‌గా రాష్ట్ర ప్రభుత్వం ఆధునికీకరిస్తోంది. చెరువు కట్ట, తూముల, పూడికతీత, ఆధునీకరణ పనులకు మూడేళ్ల క్రితం సుమారు రూ.5 కోట్లు మంజూరయ్యాయి. పనులు చేపట్టిన కాంట్రాక్టర్‌ కట్ట మరమ్మతు, సీసీ వాల్‌ నిర్మాణం కొన్ని ఇతర పనులు చేపట్టాక బిల్లులు రాక పనులు నిలిపివేశారు. అధికారులు, ప్రజాప్రతినిధులు, రైతుల ఒత్తిడి మేరకు ఈ ఏడాది పనులు ప్రారంభించారు. మరమ్మతుల్లో భాగంగా నడిమి తూము వద్ద చెరువు లోపలి భాగం నుంచి కట్టను అనుసరించి సీసీ కోసం పెద్ద ఎత్తున తవ్వకాన్ని చేపట్టారు. అదే సమయంలో పనులు పూర్తికాక ముందే చెరువులోకి పెద్దఎత్తున నీరు చేరింది. ఆ తర్వాత తూము మరమ్మతు పనులు సరిగ్గా చేపట్టక రెండు వైపులాసీసీ వేసి  పూర్తిచేశారు. కాగా, నడిమి తూము, నక్కల తూము వద్ద గతంలో వర్షాలు వచ్చినప్పుడు కొంత మేర నీరు లీకేజీ అ య్యేది. గతేడాది కొం త మేర నీటి వృథాను అరికట్టారు. మరమ్మ తు చేసినా నీరు లీకేజీ అవుతుండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. కట్టమైసమ్మ ఆలయం వద్ద కట్టకింది నుంచి కూడ నీరు ఎక్కువగా లీకేజీ అవుతోంది. దీంతో కట్ట తెగిపోయే ప్రమాదం ఉందని సమీపంలో ఉన్న బీసీ కాలనీ వాసులు, రైతులు, పట్టణ ప్రజలు ఆందోళన చెందుతున్నారు. రోజుల తరబడి నీరు లీకేజీ అవుతున్నా ప్రజాప్రతినిధులు, అధికారులు పట్టించుకోకపోవడం విమర్శలకు తావిస్తోంది. 

Updated Date - 2020-11-25T05:25:52+05:30 IST