ప్రమాదాలతో జనం బేజారు!

ABN , First Publish Date - 2020-11-20T04:05:05+05:30 IST

సాగర్‌-హైదరాబాద్‌ రహదారిపై తరచూ రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. డ్రైవర్ల నిర్లక్ష్యంతో, కొందరు మద్యం తాగి డ్రైవింగ్‌ చేస్తుండడంతో ఇటీవల ఈ రహదారిపై ప్రమాదాల సంఖ్య పెరిగిపోయింది.

ప్రమాదాలతో జనం బేజారు!
తమ్మలోనిగూడ గేటు వద్ద ప్రమాదంలో మృతి చెందిన తండ్రీకొడుకు(ఫైల్‌)

  • సాగర్‌-హైదరాబాద్‌ రహదారిపై తరుచూ ప్రమాదాలు
  • నాలుగు నెలల్లో ఆరుగురి దుర్మరణం.. 40మందికి గాయాలు 
  • రోడ్డున పడుతున్న బాధిత కుటుంబాలు

యాచారం: సాగర్‌-హైదరాబాద్‌ రహదారిపై తరచూ రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. డ్రైవర్ల నిర్లక్ష్యంతో, కొందరు మద్యం తాగి డ్రైవింగ్‌ చేస్తుండడంతో ఇటీవల ఈ రహదారిపై ప్రమాదాల సంఖ్య పెరిగిపోయింది. ప్రమాదాలతో ప్రాణాలు కోల్పోతున్న వారి కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. మరి కొందరు క్షతగాత్రులవుతున్నారు. సాగర్‌-హైదరాబాద్‌ రహదారిపై ప్రమాదాలు జరిగే ప్రదేశాల్లో సూచిక బోర్డులను ఏర్పాటు చేయకపోవడంతో ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఆర్టీఏ, పోలీసు అధికారులు వాహనాలను తనిఖీ చేసి జరిమానాలు విధించాల్సి ఉన్నా పట్టనట్టు వ్యవహరిస్తున్నారు. లాక్‌డౌన్‌ ఎత్తివేసినప్పటి నుంచి అంటే ఆగస్టు 6వ తేదీ నుంచి ఇప్పటి వరకు హైదరాబాద్‌-నాగార్జునసాగర్‌ రహదారిపై మొత్తం 18రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకోగా, ఆరుగురు మృతిచెందారు. మరో 40మంది క్షతగాత్రులయ్యారు.


ప్రమాదాలతో కుదేలవుతున్న కుటుంబాలు


ఈ రోడ్డుపై జరుగుతున్న ప్రమాదాలతో ప్రజలు జేజారవుతున్నారు. చింతపట్ల గేటు వద్ద గేదెను బైక్‌ ఢీకొనడంతో నల్లగొండ జిల్లా మర్రిగూడ మండలం ఎరుగల్లపల్లి గ్రామానికి చెందిన చామకూర సురేష్‌(35) గాయపడ్డాడు. ఇటీవల యాచారం మండల కాంప్లెక్స్‌ సమీపంలో హైదరాబాద్‌ నుంచి మాల్‌ వైపు వెళ్తున్న కారు ఎదురుగా వస్తున్న మరో కారును ఢీకొనడంతో పలువురు గాయపడ్డారు. తమ్మలోనిగూడ గేటు వద్ద మాల్‌ వైపు నుంచి హైదరాబాద్‌కు బైక్‌పై వెళ్తున్న బ్రహ్మచారి, అమృతలను వెనుక నుంచి కారు ఢీకొనడంతో ఇద్దరూ గాయపడ్డారు.  ఈ నెల 17న తమ్మలోనిగూడ గేటు వద్ద ఆర్టీసీ బస్సు బైక్‌ను ఢీకొనడంతో నానక్‌నగర్‌కు చెందిన తాండ్ర జంగయ్య(70) అతడి కుమారుడు రమేష్‌(30) దుర్మరణం పాలయ్యారు. రమేశ్‌ కూతురు రుత్విక గాయపడింది. మంతన్‌గౌరెల్లిలో ఆటో-బైక్‌ను ఢీకొని మర్రిగూడకు చెందిన శివ మృతి చెందాడు. ఇలా చాలా ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. యాచారం మండల కాంప్లెక్స్‌ వద్ద రోడ్డు దాటాలంటే జనం భయపడుతున్నారు. పెట్రోల్‌ బంకు నుంచి  అభయాంజనేయ స్వామి ఆలయం వరకు మూడుచోట్ల బారీకేడ్లు ఏర్పాటు చేయాలని  ప్రజలు డిమాండ్‌ చేస్తున్నారు. 


నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు


వాహనాదారులు నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవు. అతివేగం ప్రమాదకరమని గుర్తించాలి. బైక్‌లకు ఫోక్‌సలైట్లు ఏర్పాటు చేయ డం తగదు. ద్విచక్రవాహనాదారులు తప్పక హెల్మెట్‌ ధరించాలి. ప్రమాదాల నివారణకు అన్ని చర్యలు తీసుకుంటున్నాం.               

- లింగయ్య, యాచారం సీఐ

Updated Date - 2020-11-20T04:05:05+05:30 IST