Jun 20 2021 @ 18:35PM

‘మా’ అధ్యక్ష బరిలో విలక్షణ నటుడు!

మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌’ ఎన్నికలకు రంగం సిద్ధం అవుతోంది. త్వరలో జరగబోయే ‘మా’ఎన్నికల్లో అధ్యక్ష పదవికి విలక్షణ నటుడు ప్రకాశ్‌ రాజ్‌ పోటీ చేయనున్నారు. ఈ విషయాన్ని ఆయన ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆదివారం వెల్లడించారు. ఆయన ఎవరి మద్దతుతో బరిలో దిగుతున్నారు? పోటీగా ఎవరు నిలబడుతున్నారు అన్న విషయాలపై ప్రకాశ్‌ మాట్లాడారు. ‘‘సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నా నేను కర్ణాటకలో ఆరు ప్రభుత్వ పాఠశాలను నడిపిస్తున్నాను. మూడు ఊర్లను దత్తత తీసుకున్నాను. కాబట్టి ఎన్ని భాషల్లో సినిమాలు చేసినా ‘మా’ అసోసియేషన్‌కి అధ్యక్షుడిగా సేవలు అందించగలననే నమ్మకం నాకుంది. సినిమాలో పాత్ర పండించడానికి ఎంతగా కష్టపడతామో ఈ బాధ్యతను అలాగే తీసుకుని ముందుకెళ్తా’’ అని అన్నారు. చిరంజీవి సపోర్ట్‌తో ముందుకు వెళ్తున్నారట అన్న ప్రశ్నకు.. ‘చిరంజీవి అందరి వ్యక్తి. వ్యక్తిగతంగా ఆయన ఏ ఒక్కరికో మద్దతు ఇవ్వరు. మంచి చేస్తారని అనిపించిన వారికే మద్దతు ఇస్తారు. అన్నయ్యతో ఉన్న సాన్నిహిత్యాన్ని దీని కోసం ఉపయోగించుకోను’’ అని ప్రకాశ్‌రాజ్‌ బదులిచ్చారు. తెలుగు పరిశ్రమలో ఉన్న సమస్యల గురించి తనకు పూర్తి అవగాహన ఉందని, వాటిని పరిష్కరించడానికి సరైన ప్రణాళిక కూడా తన దగ్గర ఉందని ప్రకాశ్‌ చెప్పారు. ఇతర పరిశ్రమలతో పోల్చితే తెలుగు పరిశ్రమ చాలా పెద్దదని, కాకపోతే ఒకప్పుడు ఉన్న పేరు ఇప్పుడు లేదని అన్నారు. దేశవ్యాప్తంగా ‘మా’ అసోసియేషన్‌కు గౌరవం తీసుకొచ్చేందుకు తనవంతు కృషి చేస్తానని, తాను ‘మా’ అధ్యక్షుడు అయితే 100 శాతం ‘మా’కు సొంత భవనం నిర్మిస్తానని ఆయన మాటిచ్చారు. సినీ కళాకారులకు సాయం చేయడానికి పరిశ్రమలో ఎంతోమంది సహృదయం కలిగిన నటులు ఉన్నారని, వాళ్లందరినీ ఒకతాటిపైకి తీసుకొస్తానని ప్రకాశ్‌ రాజ్‌ తెలిపారు. 


ప్రకాశ్‌కు ఆ సత్తా ఉంది: నాగబాబు

‘‘ప్రకాశ్‌రాజ్‌ ఏ ఒక్క చిత్ర పరిశ్రమకో చెందిన వ్యక్తి కాదని, ఆయన భారతీయ నటుడని నాగబాబు అన్నారు. రాజకీయంగా మా మధ్య భిన్నాభిప్రాయాలు ఉన్నా సినిమా పరిశ్రమ విషయంలో ఒకేతాటిపై ఉంటామని అన్నారు. ప్రకాశ్‌రాజ్‌ లాంటి ల వ్యక్తి ‘మా’ అధ్యక్షుడు అయితే, తెలుగు చిత్ర పరిశ్రమకు మంచి జరుగుతుందన్న నమ్మకం ఉందని, చేయగల సత్తా ఉందని చెప్పారు. ఎన్నికల సమయంలో తమ వంతు సహకారం చేస్తామని హామీ ఇచ్చారు.